ధోనీ చెప్పినట్లే చేశాడు.. ఆశ్చర్యపోయా 

2007 టీ20 ప్రపంచకప్‌ ముందు భారత జట్టును ఎంపిక చేసినప్పుడు ధోనీ చెప్పిన మాటలను అక్షరాలా నిలబెట్టుకున్నాడని మాజీ సెలెక్టర్‌ సంజయ్‌ జగ్దాలే పేర్కొన్నారు...

Published : 25 Dec 2020 11:34 IST

2007 టీ20 ప్రపంచకప్‌ ముందు ఏం జరిగిందంటే..

ఇంటర్నెట్‌డెస్క్‌: 2007 టీ20 ప్రపంచకప్‌ ముందు భారత జట్టును ఎంపిక చేసినప్పుడు ధోనీ చెప్పిన మాటలను నిలబెట్టుకున్నాడని మాజీ సెలెక్టర్‌ సంజయ్‌ జగ్దాలే పేర్కొన్నారు. తాజాగా ఆయన ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడుతూ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను సెలెక్టర్‌గా ఉండగా, మొదటి టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి దిగ్గజ ఆటగాళ్లైన సచిన్‌, గంగూలీ, ద్రవిడ్‌.. తమని ఎంపిక చేయొద్దని స్వయంగా చెప్పారన్నారు. దాంతో యువ ఆటగాళ్లతో కూడిన టీమ్‌ఇండియాను ఎంపిక చేసి ధోనీని తొలిసారి కెప్టెన్‌గా చేశామని తెలిపారు.

అప్పుడు తాను ధోనీతో మాట్లాడుతూ ఇదో మంచి జట్టని పేర్కొన్నట్లు గుర్తుచేసుకున్నారు. దానికి మహీ స్పందిస్తూ.. కచ్చితంగా ప్రపంచకప్‌తోనే తిరిగి వస్తామని చెప్పాడని సంజయ్‌ వివరించారు. అతడి ఆత్మవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. ఇదిలా ఉండగా, 2007లో టీమ్‌ఇండియా రాహుల్‌ ద్రవిడ్‌ నేతృత్వంలో వన్డే ప్రపంచకప్‌లో ఘోర పరాభవం పాలైన సంగతి తెలిసిందే. అనంతరం జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో ధోనీ సారథ్యంలో పాకిస్థాన్‌పై ఉత్కంఠ పోరులో ఫైనల్‌ మ్యాచ్‌ గెలిచింది. దీంతో ధోనీ చెప్పిందే చేశాడని సంజయ్‌ వివరించారు.

ఇక మహీ టీమ్‌ఇండియా కెప్టెన్‌గా జట్టును విజయపథంలో నడిపించాడు. వరుసగా మ్యాచ్‌లు గెలుస్తూ భారత్‌ను అగ్రస్థానంలోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే 2011 వన్డే ప్రపంచకప్‌, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ సాధించాడు. ఆపై 2014 టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్స్‌కు, 2015 వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌కు, 2016 టీ20 ప్రపంచకప్‌లో మరోసారి సెమీస్‌కు తీసుకెళ్లాడు. ఇక 2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ సెమీఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలవ్వడంతో ధోనీ అంతర్జాతీయ ఆటకు దూరమయ్యాడు. ఏడాది పాటు విశ్రాంతి తీసుకొని ఆగస్టు 15న రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

ఇవీ చదవండి..
దుమారం రేపిన సన్నీ!
10 జట్లతో 2022 ఐపీఎల్‌
విలియమ్సన్‌ హైదరాబాద్‌తోనే..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని