కపిల్‌ అలా అన్నాడు.. గావస్కర్‌ సరే అన్నాడు..

ఇంగ్లాండ్‌లో జరిగిన 1983 ప్రపంచకప్‌లో కపిల్‌ దేవ్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పుడు తమ తొలి ఇన్నింగ్స్‌ పూర్తయ్యాక...

Published : 06 Aug 2020 00:45 IST

గెలుస్తామని, అన్ని వికెట్లు తీస్తానని అనుకోలేదు: బిన్నీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌లో జరిగిన 1983 ప్రుడెన్షియల్‌ క్రికెట్‌ ప్రపంచకప్‌లో కపిల్‌ దేవ్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పుడు తమ తొలి ఇన్నింగ్స్‌ పూర్తయ్యాక జట్టు స్కోర్‌ చూస్తే అస్సలు గెలుస్తామని అనుకోలేదని నాటి బౌలర్‌ రోజర్‌ బిన్నీ గుర్తు చేసుకున్నాడు. తాజాగా స్పోర్ట్స్‌కీడాతో ఫేస్‌బుక్‌ లైవ్‌లో ముచ్చటించిన మాజీ ఛాంపియన్‌ నాటి విశేషాల్ని వివరించాడు. ఆ టోర్నీలో 18 వికెట్లు తీసిన తాను అత్యధిక వికెట్లు తీసే బౌలర్‌గా నిలుస్తాననుకోలేదని చెప్పాడు.

‘ఆ ప్రపంచకప్‌లో నేను 18 వికెట్లు తీస్తానని, మేం ప్రపంచకప్‌ గెలుస్తామని అస్సలు అనుకోలేదు. అది నాకెంతో ప్రత్యేకం. తొలి మ్యాచ్‌లో విండీస్‌ను ఓడించాక మా జట్టులో స్ఫూర్తి రగిలింది. మా వద్ద మంచి ఫీల్డర్లు లేకున్నా సునీల్‌ గావస్కరే కీలకం. అయితే అతను బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. ఇక సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై గెలిచాక ఆత్మవిశ్వాసం లభించింది. అదే క్రమంలో విండీస్‌తో ఫైనల్‌కు సిద్ధమయ్యాం. కానీ తొలి ఇన్నింగ్స్‌ పూర్తయ్యాక మా స్కోరు చూసి చాలా నిరాశపడ్డాం. 220-240 పరుగులు చేస్తేనే గెలుస్తామనుకున్నాం. చివరికి 183 పరుగులకే పరిమితమయ్యాం. తొలి ఇన్నింగ్స్‌ అయ్యాక 40 నిమిషాలు డ్రెస్సింగ్‌ రూమ్‌లో కూర్చోవాల్సి వచ్చినా ఒక్కరూ కిక్కుమనలేదు. ఉన్నట్టుండి కపిల్‌దేవ్‌ వచ్చి ‘మన స్కోరు గురించి ఆలోచించకుండా వాళ్లని ఆలౌట్‌ చేద్దాం’ అన్నాడు. వెంటనే గావస్కర్‌ కూడా సరేనన్నాడు’ అని బిన్నీ గుర్తుచేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 183 పరుగులు చేయగా వెస్టిండీస్‌ ఛేదనలో 140 పరుగులకే కుప్పకూలింది. దాంతో భారత్‌ తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని