Kohli-Gambhir: కోపం చల్లారాలంటే కోహ్లీ-గంభీర్‌ ఈ యాడ్‌లో నటించాలి : యువరాజ్‌ సూచన

విరాట్‌ కోహ్లీ, గౌతమ్‌ గంభీర్‌ల మధ్య వ్యవహారం సాధారణ స్థితికి రావడానికి మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌(Yuvraj Singh) ఓ సరదా సూచన చేశాడు.

Updated : 05 May 2023 12:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విరాట్‌ కోహ్లీ (Virat Kohli), గౌతమ్‌ గంభీర్‌(Gautam Gambhir )ల మధ్య చెలరేగిన తీవ్ర వాగ్వాదంపై చర్చ ఇప్పట్లో ముగిసేట్లు లేదు. ఈ అంశంపై మాజీ ఆటగాళ్లు స్పందిస్తూనే ఉన్నారు. లఖ్‌నవూ(Lucknow Supergiants), బెంగళూరు(Royal Challengers Bangalore) మ్యాచ్‌ అనంతరం.. విరాట్‌, గంభీర్‌ కోపోద్రిక్తులై ఒకరిపై ఒకరు దూసుకెళ్లేంత పని చేశారు. వారిని ఇతర ఆటగాళ్లు విడదీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌(Yuvraj Singh) స్పందించాడు. వారిద్దరి మధ్య కోపం తగ్గేలా ఓ సరదా సూచన చేశాడు.

వీరిద్దరి మధ్య వ్యవహారం చల్లగా ఉండాలంటే.. కోహ్లీ, గంభీర్‌ ఓ శీతల పానీయం యాడ్‌కు సంతకం చేయాలని సూచించాడు. ‘యాడ్‌ ప్రమోషన్‌ కోసం గంభీర్‌, కోహ్లీల నుంచి సాఫ్ట్‌ డ్రింక్‌ సంతకం తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. వారిని ఇది చల్లగా ఉంచుతుంది.. మీరేమంటారు?’ అంటూ యువీ ఫన్నీ ట్వీట్‌ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది.

కోచ్‌లు జోక్యం చేసుకోకూడదు : వాన్‌

ఇక ఈ అంశంపై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌వాన్‌(Michael Vaughan) స్పందిస్తూ గంభీర్‌ ప్రవర్తించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఇలాంటివి ఆటగాళ్ల మధ్య జరుగుతూనే ఉంటాయనీ.. అయితే కోచ్‌ అందులో జోక్యం చేసుకోకూడదని సూచించాడు.

‘మైదానంలో ఆటగాళ్లు చిన్న చిన్న గొడవలకు దిగడాన్ని నేను పట్టించుకోను. ఇది ఆట మాత్రమే. ఇలాంటివి రోజూ జరగవు. ఈ విషయంలో కోచ్‌లు జోక్యం చేసుకోవడం నాకిష్టం ఉండదు. కోచ్‌ గానీ, కోచింగ్‌ డిపార్ట్‌మెంట్‌ జోక్యం చేసుకోవడం నేను చూడలేదు. మైదానంలో ఏం జరిగిందో.. మైదానంలోనే వదిలేయండి. ఇద్దరి ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగితే.. వాళ్లే పరిష్కరించుకోవాలి. కోచ్‌లు డగౌట్‌, డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉంటూ వ్యూహాలు రచిస్తుండాలి’ అంటూ వాన్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని