Cricket News: అజిత్ అగార్కర్‌ నిర్ణయంతోనే కుర్రాళ్లకు ఛాన్స్‌!

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను (IND vs ENG) భారత్ కైవసం చేసుకోవడంలో యువ క్రికెటర్లు కీలక పాత్ర పోషించారు. 

Published : 15 Mar 2024 14:05 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో (IND vs ENG) ఐదుగురు భారత్‌ తరఫున అరంగేట్రం చేశారు. వారిలో రజత్‌ పటీదార్‌ మినహా.. అందరూ సత్తా చాటారు. యువకులకు జట్టులో స్థానం కల్పించడం వెనక కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ కంటే చీఫ్‌ సెలక్టర్ అజిత్ అగార్కర్‌ ప్రోద్బలమే ఎక్కువగా ఉందని కథనాలు వస్తున్నాయి. భవిష్యత్తులో సీనియర్లు లేకపోయినా జట్టును నడిపించేందుకు యువకులకు అనుభవం వస్తుందనే ఉద్దేశంతో అగర్కార్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వికెట్‌ కీపర్‌గా కేఎస్ భరత్‌ను ఈ సిరీస్‌ మొత్తం ఆడించాలని  రోహిత్-రాహుల్ ద్రవిడ్ ద్వయం భావించింది. తొలి రెండు టెస్టుల్లో భరత్‌ ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ధ్రువ్‌ జురెల్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని అగార్కర్‌ సూచించాడని తెలిసింది.

‘‘జురెల్‌ను ఆడించాలనేది అగార్కర్ సూచన. జట్టు మేనేజ్‌మెంట్ మాత్రం నమ్మకం ఉంచలేదు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అనుభవం లేని క్రికెటర్‌ను ఎంపిక చేయడం సరైంది కాదనే అభిప్రాయం కెప్టెన్‌తోపాటు కోచ్‌లోనూ ఉంది. దీంతో వారు తొలుత ఆసక్తి చూపించలేదు. ఇంగ్లాండ్‌ వంటి కఠినమైన ప్రత్యర్థితో ఆడేటప్పుడు కొత్త ఆటగాడు కాకుండా అనుభవం ఉన్న క్రికెటర్‌ను బరిలోకి దింపితే బాగుంటుందనేది వారి అభిప్రాయం. అగార్కర్ మాత్రం యువ క్రికెటర్‌కు అవకాశం ఇవ్వాలని చెప్పడంతో ధ్రువ్‌ను తుది జట్టులోకి తీసుకున్నాం’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. 


ఇంగ్లాండ్‌ జట్టుకు అదే సమస్య: అశ్విన్‌

బజ్‌బాల్‌ క్రికెట్‌ అంటూ భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఐదు టెస్టుల సిరీస్‌ను 4-1 తేడాతో టీమ్ఇండియా సొంతం చేసుకుంది. దీంతో ఇంగ్లిష్‌ జట్టు ఆటతీరుపై పలువురు విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. ఇంగ్లాండ్‌కు అతిపెద్ద సమస్య.. వారు పరిస్థితులను అర్థం చేసుకోవడంలో విఫలం కావడమేనని భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యాఖ్యానించాడు. ‘‘టెస్టు క్రికెట్ లేదా ఏదైనా ఫార్మాట్‌లోనైనా సరే.. రన్‌వే మీద విమానం దూసుకుపోయినట్లు ఆడకూడదు. హైవేలపై కూడా దూసుకుపోయే సమయంలో ఓవర్‌టేక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఊహించని ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంటుంది.  ఇంగ్లాండ్‌లో ఆ జట్టు ఎలా ఆడుతుందనేది అందరికీ తెలుసు. కానీ, భారత్‌లో ఎప్పుడూ నాలుగో గేర్‌లో ప్రయాణించడం చాలా కష్టం. గేర్లు మార్చుకుంటూ ముందుకెళ్లాలి. ఒక కాలు బ్రేక్‌ మీద ఉంచాలి. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఇక్కడ చేయలేనిదదే. దూకుడుగా ఆడేద్దామని వచ్చి అయోమయానికి గురయ్యారు’’ అని అశ్విన్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని