WPL 2024: మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని.. అడ్డుకున్న ఆసీస్‌ మహిళా స్టార్‌

మహిళల ప్రీమియర్‌ లీగ్ (WPL 2024) అద్భుతంగా సాగుతోంది. ఐదు జట్లూ హోరాహోరీగా పోరాడుతున్నాయి.

Updated : 01 Mar 2024 12:58 IST

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్‌ లీగ్ (WPL 2024)లో యూపీ వారియర్స్ - ముంబయి ఇండియన్స్‌ (UPW vs MI) జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి మైదానంలోకి దూసుకొచ్చాడు. భద్రతను దాటి పిచ్‌ వద్దకు రావడంతో యూపీ వారియర్స్‌ కెప్టెన్, ఆసీస్‌ సీనియర్‌ క్రికెటర్ ఎలీసా హీలే అతడిని అడ్డుకుంది. రెండు రోజుల కిందట చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆ సపోర్ట్‌తో అదనంగా 10 పరుగులు వచ్చినట్లే: స్మృతీ మంధాన

చిన్నస్వామి స్టేడియంలో అభిమానుల మద్దతు భారీగా లభిస్తోందని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్ స్మృతీ మంధాన వ్యాఖ్యానించింది. ‘‘ఆర్‌సీబీకి మద్దతు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇదంతా చూస్తుంటే మాకు అదనంగా పది పరుగులు చేరినట్లే అనిపిస్తోంది. వారిందరికీ ధన్యవాదాలు’’ అని తెలిపింది. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుకు ఓటమి తప్పలేదు. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీపై దిల్లీ 25 పరుగుల తేడాతో గెలిచింది. ఈ క్రమంలో మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు నమోదైన మ్యాచ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 19 సిక్స్‌లను ఇరు జట్ల బ్యాటర్లు బాదారు.

పాయింట్ల పట్టికలో ఇలా.. 

ఐదు జట్లు తలపడుతోన్న డబ్ల్యూపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుజరాత్‌ జెయింట్స్‌ మినహా మిగతా నాలుగు టీమ్‌లు మూడేసి మ్యాచ్‌లను ఆడేశాయి. దిల్లీ (4), రాయల్  ఛాలెంజర్స్‌ బెంగళూరు (4), ముంబయి ఇండియన్స్‌ (4) రెండేసి విజయాలు సాధించాయి. అయితే, నెట్‌రన్‌రేట్‌ కారణంగా దిల్లీ ముందుంది. గుజరాత్‌ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడి అట్టడుగున కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని