Team India: టోర్నీల్లో ఒక్కరే జట్టును గెలిపించలేరు: ప్రవీణ్ కుమార్‌

భారత జట్టు సాధించిన విజయాలను ఒక్కరి గెలుపుగా అభివర్ణించడం సరైంది కాదని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానించారు.

Published : 15 Mar 2024 15:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత క్రికెట్‌లో వ్యక్తిపూజ ఎక్కువైందని ఇటీవల గౌతమ్‌ గంభీర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్‌ స్పందించాడు. 2011 వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిచిన టీమ్‌ఇండియా కోసం ప్రతిఒక్కరూ కష్టపడ్డారని ఓ ఇంటర్య్వూలో గంభీర్‌ వ్యాఖ్యానించాడు. దీంతో అవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. జట్టుగా సాధించిన విజయాన్ని కొందరికే ఆపాదించడం భారత క్రికెట్‌కు మంచిది కాదని ప్రవీణ్‌కుమార్‌ వ్యాఖ్యానించాడు. 

‘‘ భారత్‌లో వ్యక్తిగతంగా ఆరాధించడం నుంచి బయటకు రావాలి. అప్పుడే క్రికెట్‌కు ఇంకాస్త మంచి జరుగుతుంది. రాజకీయాలు, దిల్లీ క్రికెట్‌.. ఇలా ఏదైనా సరే ఆ ఒరవడిని ముగించాలి. కేవలం భారత జట్టును మాత్రమే ప్రేమించాలి. అసలు ఇదంతా ఎవరు సృష్టిస్తున్నారు? కేవలం రెండింటి వల్లే ఇదంతా జరుగుతోంది. సోషల్ మీడియా ఫాలోవర్ల వల్ల ఫేక్‌ కూడా విస్త్రతంగా ప్రచారమవుతుంది. ఇక రెండోది.. మీడియా, బ్రాడ్‌కాస్టర్లు మరింత కీలక పాత్ర పోషించాయి. 

వన్డే ప్రపంచ కప్ 2011ను భారత్ గెలవడంలో ప్రతిఒక్కరూ కీలక పాత్ర పోషించారు. యువరాజ్‌ సింగ్, జహీర్ ఖాన్, గౌతమ్‌ గంభీర్‌, ధోనీ.. ఇలా అందరూ బాగా ఆడారు. కానీ, ఒకరికే క్రెడిట్‌ ఇవ్వడం సరైంది కాదు. అందుకే, గౌతమ్‌ గంభీర్‌ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్. ఎందుకంటే ఇదేమీ రెజ్లింగ్‌ లేదా ఇతర వ్యక్తిగత స్పోర్ట్స్‌ కాదు. ఒకరే మ్యాచ్‌ను గెలిపించలేరు. అలాగే టోర్నీల్లో జట్టును విజేతగా నిలపలేరు. యువరాజ్‌ సింగ్ 15 వికెట్లు + కీలక పరుగులు చేశాడు. జహీర్‌ ఖాన్ 21 వికెట్లు పడగొట్టాడు. గంభీర్‌ 2007, 2011 ఫైనల్స్‌లో భారీగా పరుగులు చేశాడు. ధోనీ 2011 ఫైనల్‌ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఏ జట్టైనా సరే కనీసం ముగ్గురు బ్యాటర్లు పరుగులు చేయాలి. ఇద్దరు బౌలర్లు వికెట్లు తీయాలి. అంతేకానీ, ఒక్కరే గెలిపించడం అసాధ్యం. అందుకే, ఈ హీరో కల్చర్‌ భారత క్రికెట్‌లో ఆగిపోవాలి. 1980ల్లోనే ఇది మొదలైంది. దీంతో క్రికెటర్లు క్రికెట్‌ కంటే తామే పెద్దగా భావిస్తున్నారు’’ అని ప్రవీణ్ కుమార్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని