Asian Games 2023 : అట్టహాసంగా ఆసియా క్రీడలు ప్రారంభం.. ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్!

ఆసియా క్రీడలు (Asian Games) అధికారికంగా ప్రారంభమయ్యాయి. చైనాలోని హాంగ్‌జౌ వేదికగా అట్టహాసంగా ప్రారంభ వేడుకలు జరిగాయి.

Published : 23 Sep 2023 20:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా క్రీడా సంబరం (Asian Games 2023) ప్రారంభమైంది. చైనాలోని హాంగ్‌జౌ వేదికగా అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. ఇప్పటికే కొన్ని గేమ్స్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు అధికారికంగా క్రీడా సందడి మొదలైంది. చైనా ప్రధాని జింగ్‌పింగ్‌తోపాటు పలు దేశాల అధినేతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారత బాక్సర్‌ లవ్లీనా, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (హాకీ కెప్టెన్‌) జాతీయ పతాకధారులుగా వ్యవహరించారు. నిఫ్ట్‌ (జాతీయ ఫ్యాషన్ టెక్నాలజీ) రూపొందించిన వస్త్రాలను అథ్లెట్లు ధరించారు. 

భారత ప్రధాని ట్వీట్

ఆసియా క్రీడల ప్రారంభం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా (ప్రస్తుతం ఎక్స్‌) అథ్లెట్లకు శుభాకాంక్షలు చెప్పారు. పతకాలను గెలుచుకుని రావాలని ఆకాంక్షించారు. ‘‘ఆసియా క్రీడా సంబరం ప్రారంభమైంది. భారత క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్. భారీ అథ్లెట్ల బృందం క్రీడల పట్ల అభిరుచి, సంకల్ప బలంతో మరిన్ని పతకాలను సాధించాలి. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి నిజమైన క్రీడాస్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పాలి’’ అని మోదీ ట్వీట్ చేశారు.  

2022లో ఈ ఆసియా క్రీడలు జరగాల్సింది. చైనాలో కరోనా కేసులు కారణంగా ఓ ఏడాది వాయిదా వేశారు. అయినా వీటిని 2022 ఆసియా క్రీడలుగానే వ్యవహరిస్తున్నారు. ఈసారి ఆసియా క్రీడల్లో భారత్‌ నుంచి 39 విభాగాల్లో దాదాపు 655 మంది అథ్లెట్లు పతకాల కోసం బరిలోకి దిగారు. మహిళల క్రికెట్‌లో ఆదివారం బంగ్లాదేశ్‌తో భారత్‌ సెమీస్‌లో తలపడనుంది. ఇక్కడ గెలిస్తే పతకం ఖాయమవుతుంది. అక్టోబర్ 3న భారత పురుషుల క్రికెట్‌ జట్లు తలపడనుంది.  2018లో 70 (16 స్వర్ణాలు, 23 రజతాలు, 31 కాంస్యాలు) పతకాలు గెలిచిన భారత్‌.. ఈ సారి వంద పతకాలు సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని