Avesh Khan IPL : ఐపీఎల్‌ వల్లే.. భారత జట్టులోకి రాగలిగాను : అవేశ్‌ ఖాన్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) కారణంగానే తాను.. భారత జట్టులో చోటు దక్కించుకోగలిగానని యువ బౌలర్‌ అవేశ్‌ ఖాన్‌ అన్నాడు. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడుతున్న అవేశ్‌ ఖాన్‌..

Published : 02 Feb 2022 01:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) కారణంగానే తాను.. భారత జట్టులో చోటు దక్కించుకోగలిగానని యువ బౌలర్‌ అవేశ్‌ ఖాన్‌ అన్నాడు. ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడుతున్న అవేశ్‌ ఖాన్‌ గత సీజన్‌లో 24 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. బౌలర్‌గా ఎదగడంలో దిల్లీ హెడ్‌ కోచ్‌ రికీ పాటింగ్‌ అందించిన ప్రోత్సాహం మరులేనిదని  పేర్కొన్నాడు. గతేడాది న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కి అవేశ్ ఖాన్‌ ఎంపికైనా తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. దీంతో తాజాగా వెస్టిండీస్‌తో జరుగనున్న టీ20 సిరీస్ ద్వారా అతడు అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయనున్నాడు.

‘నాణ్యమైన బౌలర్‌గా ఎదిగేందుకు ఐపీఎల్‌ నాకు చాలా ఉపయోగపడింది. దాని వల్లే నాకు ఇంతటి గుర్తింపు లభించింది. గత సీజన్‌ (ఐపీఎల్-2021)లో నేను ఆడిన 16 మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టాను. అంతకు ముందు సీజన్లలో చాలా తక్కువగా అవకాశాలొచ్చేవి. దాంతో నా టాలెంట్‌ని నిరూపించుకోలేకపోయాను. గత ఐపీఎల్‌ సీజన్‌లో తొలి మ్యాచ్‌ నుంచే మెరుగ్గా రాణించానని అనుకుంటున్నాను. నా ప్రదర్శనతోనే సెలెక్టర్ల దృష్టిలో పడ్డాను. ఆ కారణంగానే భారత జట్టుకు ఎంపికయ్యాను. భారత వన్డే, టీ20 ఫార్మాట్లో నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలి. థ్యాంక్స్ టు ఐపీఎల్‌’ అని అవేశ్‌ ఖాన్‌ పేర్కొన్నాడు. 

* పాంటింగ్‌ ప్రోత్సాహం మరువలేనిది..

‘గత సీజన్‌లో నేను తొలి మ్యాచ్ ఆడుతున్న సమయంలో.. మా జట్టు హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ నా దగ్గరకు వచ్చి ‘గత నాలుగేళ్లుగా నువ్వు దిల్లీ జట్టులో కొనసాగుతున్నా.. పెద్దగా అవకాశాలు రాలేదు. జట్టులో స్థానం సుస్థిరం చేసుకునేందుకు ఇదే సరైన సమయం. నీ సత్తా చూపించు. ఏదో ఒక రోజు కచ్చితంగా టీమ్‌ఇండియాకు ఆడుతావు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండు’అని చెప్పాడు. తుది జట్టులో చోటు దక్కినా, దక్కకపోయినా పాంటింగ్‌ ఎప్పుడూ అండగా ఉండేవాడు. నెట్స్‌లో బాగా బౌలింగ్‌ చేయించేవాడు. అతడు అందించిన ప్రోత్సాహం మరువలేనిది’ అని అవేశ్‌ ఖాన్‌ చెప్పాడు.

గత సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నా.. అవేశ్ ఖాన్‌ని దిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం రిటెయిన్‌ చేసుకోవకపోవడం గమనార్హం. కెప్టెన్‌ రిషభ్ పంత్‌, అక్షర్‌ పటేల్‌, పృథ్వీ షా, అన్రిచ్ నార్జ్‌లను మాత్రమే అట్టిపెట్టుకుంది. కాగా, వచ్చే సీజన్‌ (ఐపీఎల్ -2022)కి సంబంధించిన మెగా వేలం ఫిబ్రవరి 12 - 13 తేదీల్లో జరుగనున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని