IND vs BAN: కోహ్లీ సెంచరీ.. ఆ వైడ్‌ బాల్‌పై స్పందించిన బంగ్లాదేశ్ కెప్టెన్

ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ బాదాడు. 42 ఓవర్‌లో మూడో బంతికి సిక్స్ బాది జట్టును విజయ తీరాలకు చేర్చడంతోపాటు శతకం పూర్తి చేసుకున్నాడు. 

Updated : 21 Oct 2023 15:59 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ బాదాడు. 42 ఓవర్‌లో మూడో బంతికి సిక్సర్‌ బాది జట్టును విజయ తీరాలకు చేర్చడంతోపాటు శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, నసూమ్ అహ్మద్‌ 42 ఓవర్‌ ప్రారంభించడానికి ముందు కోహ్లీ 97 పరుగులతో ఉండగా.. మరో రెండు పరుగులు చేస్తే భారత్‌ విజయం సాధిస్తుంది. ఈ క్రమంలో కోహ్లీ సెంచరీ చేస్తాడా? లేదా? అని అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. ఈ ఓవర్‌లో తొలి బంతి వైడ్‌లా అనిపించింది. బంతి లెగ్‌సైడ్‌ వెళ్లడంతో అంపైర్‌ వైడ్‌ ఇస్తాడా? అన్నట్లు కోహ్లి చూశాడు. కానీ కోహ్లి కాస్త లోపలికి జరిగాడని భావించి అంపైర్‌ వైడ్‌ ఇవ్వకపోవడంతో కోహ్లితో పాటు అభిమానులూ ఊరట చెందారు. మూడో బంతికి సిక్సర్‌తో కోహ్లి శతకం అందుకున్నాడు. 

అయితే, బంగ్లాదేశ్ కెప్టెన్‌ నజ్ముల్ హొస్సేన్ సూచన మేరకే బౌలర్ నసూమ్ అహ్మద్‌ ఉద్దేశపూర్వకంగా వైడ్ బాల్ వేసి కోహ్లీ సెంచరీని అడ్డుకునేందుకు ప్రయత్నించాడన్న విమర్శలు ఎదురయ్యాయి. తాజాగా ఈ అంశంపై స్పందించిన నజ్ముల్ శాంటో ఆ విమర్శలను  తిప్పికొట్టాడు. వైడ్ బాల్‌ వేయాలని ప్రత్యేక వ్యూహం ఏం లేదని, సాధారణంగా అలా జరిగిపోయిందని వివరించాడు. ‘‘అలాంటి ప్లాన్ ఏమీ లేదు. ఎప్పటిలానే ఆడాం. వైడ్ బాల్ వేయాలనే ఉద్దేశం ఏ బౌలర్‌కు ఉండదు. సరైన ఆట ఆడేందుకు ప్రయత్నించాం. ఇది ఉద్దేశపూర్వకంగా చేయలేదు’’ అని పేర్కొన్నాడు.

వ్యాఖ్యాత పొరపాటు.. వెంటనే స్పందించిన కోహ్లీ

బంగ్లాపై సెంచరీ చేసిన అనంతరం కోహ్లీ ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా అక్కడున్న వ్యాఖ్యాత 2011 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా విజేతగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ ప్రపంచకప్‌ జట్టులో ఉండి 2023 ప్రపంచకప్‌  ఆడుతున్నది మీరు (కోహ్లీ) ఒక్కరే కదా అన్నారు. అయితే, అశ్విన్‌ కూడా ప్రస్తుతం భారత జట్టులో ఉన్న విషయాన్ని సదరు వ్యాఖ్యాత మర్చిపోయారు. దీంతో కోహ్లీ వెంటనే స్పందించాడు. ‘లేదు. 2011 ప్రపంచకప్‌లో నాతోపాటు అశ్విన్‌ కూడా ఉన్నాడు’ అని వ్యాఖ్యాతతో అన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని