Cricket: క్రికెట్‌ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఇంతకీ ఆ నటుడు ఎవరంటే?

జింబాబ్వేలో జులై 20 నుంచి ‘జిమ్ ఆఫ్రో T10’(Zim Afro T10) అనే లీగ్‌ ప్రారంభంకానుంది. ఈ లీగ్‌లో ఒక ఫ్రాంచైజీ బాలీవుడ్‌ (Bollywood)కు చెందిన స్టార్ హీరో ఒకరు కొనుగోలు చేశారు.

Updated : 22 Jun 2023 18:11 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఫ్రాంచైజీ క్రికెట్ హవా కొనసాగుతోంది. తక్కువ సమయంలో కావాల్సినంత వినోదం అందుతుండటంతో అభిమానులు ఈ లీగ్‌లను ఆదరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో టీ20 10, టీ20 లీగ్‌లు పుట్టుకొస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో  జింబాబ్వే కూడా ఓ టీ20 లీగ్‌ని నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. జింబాబ్వే క్రికెట్ బోర్డు ‘‘జిమ్ ఆఫ్రో T10’’ (Zim Afro T10) అనే పేరుతో ఈ లీగ్‌ను నిర్వహించనుంది. జులై 20న నుంచి ప్రారంభం కానున్న ఈ  T10 లీగ్‌.. అదే నెల 29న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌తో ముగియనుంది. ఈ లీగ్‌లో ఐదు జట్లు.. హరారే హరికేన్స్, డర్బన్ క్వాలందర్స్, కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ, బులవాయో బ్రేవ్స్‌, జోబర్గ్ లయన్స్ పోటీపడనున్నాయి.

జిమ్ ఆఫ్రో T10 లీగ్‌తో బాలీవుడ్ (Bollwood) స్టార్‌ హీరో సంజయ్‌ దత్‌ (Sanjay Dutt) కొత్త జర్నీని మొదలెట్టనున్నాడు. ఈ లీగ్‌లో పాల్గొననున్న హరారే హరికేన్స్‌ ఫ్రాంచైజీని సంజయ్‌ దత్ కొనుగోలు చేశాడు. ఏరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ సోహన్ రాయ్‌తో కలిసి హరారే హరికేన్స్‌ను సొంతం చేసుకున్నాడు. “భారతదేశంలో క్రికెట్ ఒక మతం లాంటింది. క్రికెట్‌ ఆడే అతిపెద్ద దేశాలలో భారత్‌ ఒకటి.  ఆటను ప్రపంచంలోని ప్రతి మూలకు తీసుకెళ్లడం మా కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. జింబాబ్వేకు కూడా క్రికెట్‌లో గొప్ప చరిత్ర ఉంది. క్రికెట్‌తో  అనుబంధం ఏర్పరుచుకుని అభిమానులకు వినోదాన్ని అందించడంలో భాగస్వామిని అవుతున్నందుకు సంతోషంగా ఉంది. జిమ్ ఆఫ్రో T10లో హరారే హరికేన్స్ బాగా రాణిస్తుందని ఆశిస్తున్నా’’ అని  సంజయ్ దత్ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని