WI vs IND: విండీస్‌తో రెండో టెస్టు.. వారిద్దరు చెలరేగితే విజయం భారత్‌దే!

రెండో టెస్టులో విండీస్‌ (WI vs IND) పోరాటం కొనసాగుతోంది. భారత్‌కు తేలిగ్గా విజయం దక్కేలా లేదు. ఇంకా రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది.

Published : 23 Jul 2023 08:51 IST

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌ - భారత్‌ (WI vs IND) జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారుతోంది. అడపాదడపా వర్షం అంతరాయం కలిగించడంతో మూడో రోజు 67 ఓవర్లు మాత్రమే వేయాల్సి వచ్చింది. తొలి టెస్టులో చేతులెత్తేసిన విండీస్‌ బ్యాటర్లు ఈసారి మాత్రం పోరాడారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్‌ 229/5 స్కోరుతో కొనసాగుతోంది. కేవలం రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ ఇంకా 209 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజ్‌లో అథనేజ్ (37*), జాసన్ హోల్డర్ (11*) ఉన్నారు. నాలుగో రోజు వెస్టిండీస్‌ను త్వరగా ఆలౌట్‌ చేయడంతోపాటు భారత బ్యాటింగ్‌ దూకుడుగా ఉండాలి. లేకపోతే మ్యాచ్‌ డ్రాగా ముగిసినా ఆశ్చర్య పడక్కర్లేదు. 

అశ్విన్ ‘మ్యాజిక్‌ డెలివరీ’.. బ్రాత్‌వైట్ క్లీన్‌బౌల్డ్‌..

స్పిన్‌ ద్వయంపైనే.. 

రెండో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలంటే భారత బౌలర్లు మరింత మెరుగ్గా రాణించాలి. మరీ ముఖ్యంగా భారత స్పిన్‌ ద్వయం రవిచంద్రన్ అశ్విన్‌, రవీంద్ర జడేజా మరోసారి చెలరేగితే విండీస్‌కు కష్టాలు తప్పవు. తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు విండీస్‌ కోల్పోయిన ఐదు వికెట్లలో మూడింటిని వీరిద్దరే తీశారు. నాలుగు, ఐదు రోజుల్లో పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వర్షం లేకుండా ఉంటే అశ్విన్‌, జడ్డూ తమ మాయతో విండీస్‌ను కట్టిపడేయాలి. అరంగేట్ర బౌలర్‌ ముకేశ్‌ కుమార్‌ కూడా తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. సిరాజ్‌ కట్టుదిట్టంగా బంతులు వేసినా ఒక్క వికెట్‌ మాత్రమే తీశాడు. ఇక లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ జయ్‌దేవ్ ఉనద్కత్ (0/44) ప్రభావం చూపించలేదు. 

నేడు అరగంట ముందుగానే..

మూడో రోజు వర్షం కారణంగా దాదాపు గంటన్నర ఆట వృథా అయింది. దీంతో నాలుగో రోజు వాతావరణం అనుకూలిస్తే అరగంట ముందే ఆటను ప్రారంభించే అవకాశం ఉంది. వర్షం కారణంగా మూడో రోజు ఆటలో 23 ఓవర్ల ఆట వృథాగా మారింది. మొత్తం 67 ఓవర్ల ఆటలో భారత్‌కు నాలుగు వికెట్లు దక్కగా... విండీస్ బ్యాటర్లు 143 పరుగులు సాధించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని