CSK vs PBKS: చెపాక్‌లో ‘కింగ్స్‌’ పోరాటం.. గెలిస్తే అగ్రస్థానంలోకి ధోనీ సేన!

సండే డబుల్‌ బొనాంజాలో భాగంగా తొలుత పంజాబ్‌ కింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs PBKS) తలపడనుంది. చెపాక్‌ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే గెలిస్తే పాయింట్ల పట్టికలో తొలి స్థానంలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 10 పాయింట్లతో సీఎస్‌కే నాలుగో స్థానంలో ఉండగా.. పంజాబ్‌ 8 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది.

Published : 30 Apr 2023 13:26 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL 2023) సీజన్‌లో ఇవాళ చెన్నై సూపర్  కింగ్స్‌ X పంజాబ్‌ కింగ్స్‌ జట్ల (CSK vs PBKS) మధ్య చెపాక్‌ వేదికగా కీలక పోరాటం జరగనుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే గెలిస్తే పాయింట్ల పట్టికలో టాప్‌ స్థానానికి దూసుకెళ్లే అవకాశం ఉంది. అలాగే పంజాబ్‌ విజయం సాధిస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగవుతాయి. చెపాక్‌లో ‘కింగ్స్‌’ ఎవరనేది తెలియాలంటే వేచి చూడాలి.

సీఎస్‌కే పరిస్థితి ఇలా.. 

ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని (MS Dhoni) చెన్నై ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఐదు మ్యాచుల్లో గెలిచింది. గతేడాది ఫైనలిస్టులు గుజరాత్‌, రాజస్థాన్‌ చేతిలోనే ఓటమిపాలు కావడం గమనార్హం. మరీ ముఖ్యంగా రాజస్థాన్‌తో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడింది. ఈ క్రమంలో ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగువ్వాలంటే మిగిలిన ఆరు మ్యాచుల్లో కనీసం ఐదు విజయాలను నమోదు చేయాలి. బౌలింగ్‌లో అనుభవలేమి వల్ల కీలక మ్యాచుల్లో వెనుకబడాల్సిన పరిస్థితి. పతిరాణ, తీక్షణ, దేశ్‌ పాండే, ఆకాశ్ సింగ్‌ అప్పుడప్పుడూ గాడి తప్పడం సీఎస్‌కేకు కష్టంగా మారింది. బ్యాటింగ్‌లోనూ అంబటి రాయుడు వరుసగా విఫలమవుతూ నిరాశపరుస్తున్నాడు. పంజాబ్ బౌలర్లు అర్ష్‌దీప్‌, రబాడ, రాహుల్ చాహర్, సామ్‌ కరన్‌ను అడ్డుకోవడంపై చెన్నై బ్యాటర్లు దృష్టిపెట్టాలి.

ఆ షాక్‌ నుంచి త్వరగా కోలుకోవాలి..

భారీ హిట్టర్లు ఉన్న ముంబయి ఇండియన్స్‌ను అడ్డుకున్న పంజాబ్‌ కింగ్స్ బౌలర్లు లఖ్‌నవూ చేతిలో మాత్రం చావుదెబ్బ తిన్నారు. మూడు మ్యాచుల తర్వాత వచ్చిన కెప్టెన్‌ ధావన్‌కు షాక్‌కొట్టిన ఫలితం అది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అత్యధిక స్కోరు 257/5 ఇచ్చిన జట్టుగా పంజాబ్‌ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. అయితే, కెప్టెన్‌ శిఖర్ ధావన్‌ విఫలమైనప్పటికీ పంజాబ్‌ బ్యాటర్లు పోరాడి 200కుపైగా పరుగులు సాధించారు. ఇప్పుడు చెపాక్‌ వేదికగా చెన్నైను ఓడించాలంటే మళ్లీ పంజాబ్‌ బౌలర్లు పుంజుకోవాల్సిందే. భారీగా హిట్టింగ్‌ చేయగల సమర్థులు సీఎస్‌కే సొంతం.

పిచ్‌ రిపోర్ట్‌

వాతావరణం చల్లగా ఉండటంతో కాస్త బౌలింగ్‌కు అనుకూలంగా ఉండొచ్చు. అయితే, వర్షం అడ్డంకిగా మారనుందని తెలుస్తోంది. దీంతో టాస్‌ నెగ్గే జట్టు బౌలింగ్‌కే మొగ్గు చూపి పిచ్‌ నుంచి వచ్చే అడ్వాంటేజ్‌ను పొందేందుకు ఆస్కారముంది.

జట్లు (అంచనా)

చెన్నై: డేవన్ కాన్వే, రుతురాజ్‌ గైక్వాడ్, అజింక్య రహానె, మొయిన్‌ అలీ, శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్ / వికెట్ కీపర్), తుషార్‌ దేశ్‌పాండే, మహీశా పతిరాణ, మహీశ్ తీక్షణ, ఆకాశ్‌ సింగ్

ఇంపాక్ట్‌ ప్లేయర్‌: అంబటి రాయుడు 

పంజాబ్‌: శిఖర్ ధావన్ (కెప్టెన్), అథర్వ తైడే, లియామ్‌ లివింగ్‌స్టోన్, సికిందర్ రజా, జితేశ్‌ శర్మ (వికెట్ కీపర్), షారుఖ్‌ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, రాహుల్‌ చాహర్, అర్ష్‌దీప్‌ సింగ్‌

ఇంపాక్ట్‌ ప్లేయర్‌: ప్రభ్‌సిమ్రన్ సింగ్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని