Umran Malik: ఉమ్రాన్‌ మాలిక్‌ను వీలైనంత త్వరగా భారత జట్టుకు ఎంపిక చేయాలి: చిదంబరం

హైదరాబాద్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వీలైనంత త్వరగా టీమ్‌ఇండియాకు ఎంపిక చేయాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆకాంక్షించారు...

Published : 29 Apr 2022 02:25 IST

                  (Photo: Umran Malik Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: హైదరాబాద్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వీలైనంత త్వరగా టీమ్‌ఇండియాకు ఎంపిక చేయాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఆకాంక్షించారు. మాలిక్‌ ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తూ.. 150 కిమీ వేగంతో బంతులు సంధిస్తున్నాడు. దీంతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే గతరాత్రి గుజరాత్‌తో ఆడిన మ్యాచ్‌లో మరోసారి నిప్పులు చెరిగాడు. నాలుగు ఓవర్లలో 25 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. దీంతో ఈ టోర్నీలో అనక్యాప్డ్‌ ప్లేయర్‌గా ఐదు వికెట్ల ఘనత సాధించిన ఐదో క్రీడాకారుడిగా నిలిచాడు.

ఈ నేపథ్యంలోనే అతడి బౌలింగ్‌ను మెచ్చుకున్న చిదంబరం మ్యాచ్‌ అనంతరం రెండు టీట్లు చేశారు. ‘ఉమ్రాన్‌ తన బౌలింగ్‌తో తుపాను సృష్టిస్తూ ఆ దారిలో వచ్చేవాటిని తనలో కలిపేసుకుంటున్నాడు. అతడి భయంకరమైన పేస్‌ బౌలింగ్‌, దూకుడుతనం కళ్లారా చూడాల్సినవే. ఈ ఒక్క ప్రదర్శనతోనే ఉమ్రాన్‌.. ఈ సీజన్‌లో కనుగొన్న మేటి ఆటగాడిగా నిలిచిపోతాడనడంలో సందేహం లేదు. అతడికి బీసీసీఐ ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి, వీలైనంత త్వరగా భారత జట్టుకు ఎంపిక చేయాలి’ అని చిదంబరం అభిప్రాయపడ్డారు. అంతకుముందు పంజాబ్‌తో ఆడిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు సాధించినప్పుడు కూడా మరో కాంగ్రెస్‌ లీడర్‌ శశిథరూర్‌.. ఉమ్రాన్‌ బౌలింగ్‌ను ప్రశంసించాడు. అతడిని త్వరగా జాతీయ జట్టులోకి పంపాలని, అలాగే త్వరలో ఇంగ్లాండ్‌ పర్యటనకు కూడా ఎంపిక చేయాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని