Covid-19: మీకోసం మేమున్నాం 

దేశంలో కరోనా రెండో దశ తీవ్రత ప్రమాదకరంగా మారింది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ మహమ్మారి ఎవరినీ వదలడం లేదు...

Published : 13 May 2021 18:26 IST

టీమ్‌ఇండియా ఆటగాళ్ల ఔదార్యం..

దేశంలో కరోనా రెండో దశ తీవ్రత ప్రమాదకరంగా మారింది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. ఆస్పత్రుల్లో సరైన వసతులు లేక, ఆక్సిజన్‌ కొరతతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే మనసున్న ఎంతో మంది తోచినంత సాయం చేస్తూ ఈ కష్టకాలంలో కొంతమందినైనా కాపాడుతున్నారు. అలాగే టీమ్‌ఇండియా క్రికెటర్లు సైతం ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఈ మధ్య ముందుకు వచ్చారు. కొంతమంది ఆటగాళ్లు సొంతంగా సాయమందిస్తుండగా మరికొందరు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు.


మీతోపాటే మేము..

టీమ్‌ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అందరికన్నా ముందు స్పందించాడు. ఐపీఎల్‌ జరుగుతుండగానే ‘మిషన్‌ ఆక్సిజన్‌’ అనే ఛారిటబుల్‌ ట్రస్టుకు రూ.20లక్షలు ప్రకటించాడు. అలాగే ఐపీఎల్‌లో మ్యాచ్‌ల్లో తన వ్యక్తిగత ప్రదర్శనలకు లభించే అవార్డుల మొత్తాన్ని సైతం ఆ సంస్థకే అందజేస్తానన్నాడు. ఇక ఐపీఎల్ 14వ సీజన్‌ వాయిదా పడగానే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి ఓ ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. తమ వంతుగా రూ.2కోట్లతో ఈ మహత్కార్యాన్ని ప్రారంభించారు. తొలుత దాని లక్ష్యాన్ని రూ.7 కోట్లుగా నిర్ణయించుకోగా వారికి ఎంపీఎల్‌ క్రీడా ఫౌండేషన్‌ రూ.5 కోట్లు ఆర్థిక సాయం అందజేసింది. దాంతో ఇప్పుడా లక్ష్యాన్ని రూ.11 కోట్లుగా మార్చుకోవడం విశేషం. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సహాయం సరిపోదని, వీలైనంత మేర సహాయం చేయాలని విరాట్‌ దంపతులు కోరుతున్నారు.


ఆపదలో ఆదుకుంటున్నారు..

మరోవైపు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ఈ వైరస్‌ నుంచి కోలుకున్నాక ‘మిషన్‌ ఆక్సిజన్‌’కు భారీ మొత్తంలో విరాళం అందజేసినట్లు తెలిపారు. తాను ఆడే రోజుల్లో ఈ దేశం ఎంతో ఇచ్చిందని, దాన్ని ఇప్పుడు తిరిగి ఇచ్చేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు. ఇటీవలే తండ్రిని కోల్పోయిన టీమ్‌ఇండియా సోదరులు హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య తమవంతుగా 200 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందజేయడానికి ముందుకొచ్చారు. అలాగే మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తన ఫౌండేషన్‌ ద్వారా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. కొవిడ్‌ పేషెంట్ల కుటుంబాలకు ఉచిత భోజన సౌకర్యాలు కల్పించడమే కాకుండా తన సంస్థకు వచ్చే విరాళాలతో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందజేస్తున్నట్లు చెప్పాడు. ఎవరైనా తన ఫౌండేషన్‌కు విరాళాలు ఇవ్వొచ్చని కోరుతున్నాడు. యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ సైతం హేమ్‌కుంత్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆక్సిజన్‌, కొవిడ్‌ రిలీఫ్‌ కిట్లు అందజేయడానికి ఆసక్తి చూపాడు. ఇక హనుమ విహారి, సురేశ్‌ రైనా, వృద్ధిమాన్‌ సాహా లాంటి క్రికెటర్లు ఎవరికైనా అత్యవసర వైద్య సహాయం కావాలంటే తమ సామాజిక మాధ్యమాల ద్వారా నెటిజన్ల సహాయం అభ్యర్థిస్తున్నారు.


ఐపీఎల్‌ నుంచే ముందడుగు..

ఐపీఎల్‌ 14వ సీజన్ నడుస్తుండగానే పలువురు ఆటగాళ్లు, ఫ్రాంఛైజీలు కొవిడ్‌పై పోరాటానికి ముందుకొచ్చారు. చెన్నై బౌలర్‌ జేసన్‌ బెరెండార్ఫ్‌ యూనిసెఫ్‌కు విరాళం అందజేస్తానని చెప్పగా కోల్‌కతా బౌలర్‌ పాట్‌కమిన్స్‌ 50 వేల డాలర్లు ప్రకటించాడు. అలాగే ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌లీ ఒక క్రిప్టో బిట్‌కాయిన్‌ను విరాళంగా అందజేశాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంఛైజీ రూ.7.5 కోట్ల విరాళం ఇవ్వడానికి ముందుకు రాగా దిల్లీ క్రికెట్ అసోసియేషన్‌ రూ.1.5కోట్ల విరాళం ప్రకటించింది. పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ నికోలస్‌ పూరన్‌ సైతం తన ఐపీఎల్‌ ఆదాయంలో కొంతమేర విరాళంగా ప్రకటించాడు. పంజాబ్‌ ఫ్రాంఛైజీ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు అందజేయనున్నట్లు వెల్లడించింది. రాజస్థాన్‌ బౌలర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ తన ఐపీఎల్‌ ఆదాయం నుంచి పది శాతం ప్రకటించాడు. ఇక క్రికెట్‌ ఆస్ట్రేలియా కూడా 50వేల డాలర్లను విరాళంగా ప్రకటించడం గొప్ప విశేషం. ఏదేమైనా ఈ కష్టకాలంలో వీరంతా తమకు తోచిన సాయం చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలవడమే కాకుండా కొంతమంది ప్రాణాలనైనా కాపాడుతున్నారు. ఆ విషయంలో వీరు చేస్తున్న కృషిని ఎవరైనా అభినందించాల్సిందే.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని