WPL Final: కప్పు ఎవరిదో.. టాస్‌ నెగ్గిన దిల్లీ క్యాపిటల్స్‌

డబ్ల్యూపీఎల్‌ రెండో సీజన్‌లో ఆఖరి అంకానికి వేళైంది. దిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య కాసేపట్లో ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Updated : 17 Mar 2024 19:23 IST

దిల్లీ: డబ్ల్యూపీఎల్‌ (WPL) రెండో సీజన్‌లో ఆఖరి అంకానికి వేళైంది. దిల్లీ క్యాపిటల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య కాసేపట్లో ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టాస్‌ నెగ్గిన దిల్లీ బ్యాటింగ్‌ ఎంచుకొని.. బెంగళూరుకు బౌలింగ్‌ అప్పగించింది. ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ఈ ఫ్రాంఛైజీల్లో ఏ పురుషుల జట్టూ విజేతగా నిలవలేదు. ఇప్పుడు అమ్మాయిల్లో ఏ జట్టు జయకేతనం ఎగరేస్తుందో చూడాలి. జట్లు ఇవే..

బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్‌), సోఫీ డివైన్, సబ్బినేని మేఘన, ఎలీస్‌ పెర్రీ, రిచా ఘోష్ (వికెట్‌ కీపర్‌), సోఫీ మోలినక్స్, జార్జియా వేర్‌హామ్, దిశా కసత్‌, శ్రేయాంకా పాటిల్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్‌

దిల్లీ: మెగ్ లానింగ్ (కెప్టెన్‌), షెఫాలి వర్మ, అలీస్‌ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్‌, మరిజేన్‌ కాప్‌, జెస్ జొనాసెన్‌, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, తానియా భాటియా (వికెట్‌ కీపర్‌), శిఖా పాండే, మిన్ను మణి

ఇది దిల్లీ బలం.. 

నిరుడు తుదిపోరులో ముంబయి ఇండియన్స్‌ చేతిలో ఓడిన దిల్లీ ఈ సారి కప్పు వదలకూడదనే లక్ష్యంతో ఉంది. మెగ్‌ లానింగ్‌ సారథ్యంలో ఉత్తమ ప్రదర్శనతో సాగుతోంది. లీగ్‌ దశలో 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో అగ్రస్థానంలో నిలిచి నేరుగా ఫైనల్‌ చేరింది. కెప్టెన్‌ లానింగ్‌ (308 పరుగులు) బ్యాటింగ్‌లో రాణిస్తూ జట్టును విజయాల వైపు నడిపిస్తోంది. షెఫాలి వర్మ (265), జెమీమా రోడ్రిగ్స్‌(235), అలీస్‌ క్యాప్సీ (230) కూడా బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. బౌలింగ్‌లో చూసుకుంటే పేస్‌ ఆల్‌రౌండర్‌ మరిజేన్‌ కాప్‌ (11), స్పిన్నర్లు జొనాసెన్‌ (11), రాధా యాదవ్‌ (10) నిలకడగా రాణిస్తున్నారు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అగ్రస్థానంలో ఉన్న కాప్‌ పవర్‌ప్లేలో వికెట్లు తీసి ప్రత్యర్థిని ఇబ్బందుల్లోకి నెడుతోంది.

తడబాటును దాటి పుంజుకున్న ఆర్సీబీ

మరోవైపు తడబాటును దాటి, బలంగా పుంజుకున్న ఆర్సీబీ లీగ్‌ దశలో 8 మ్యాచ్‌ల్లో నాలుగు చొప్పున విజయాలు, ఓటములతో మూడో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయికి షాకిచ్చిన ఈ జట్టు.. తుదిపోరులోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. స్మృతి మంధాన నాయకత్వంలోని ఆర్సీబీ జట్టులో ఆల్‌రౌండర్‌ ఎలీస్‌ పెర్రీ కీలకంగా మారింది. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో అగ్రస్థానంలో ఉన్న ఆమె (312).. 7 వికెట్లూ పడగొట్టింది. మంధాన (269), రిచా ఘోష్‌ (240) కూడా బ్యాట్‌తో సత్తాచాటితే ఆర్సీబీకి తిరుగుండదు. బౌలింగ్‌లోనే ఆ జట్టు కాస్త బలహీనంగా కనిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని