
Dhoni-CSK: ఐపీఎల్ వేలం కోసం ధోనీ.. నెటిజన్లకు కృనాల్ క్షమాపణ
(Photo: CSK Twitter)
ఇంటర్నెట్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీ గురువారం చెన్నైకి చేరుకున్నాడు. వచ్చేనెల 12, 13 తేదీల్లో ఐపీఎల్-2022కు సంబంధించిన మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ముందే తన జట్టును రూపొందించుకునే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ విషయాన్ని ఆ జట్టు యాజమాన్యం ట్విటర్‌లో తెలిపింది. సీఎస్కే జట్టులో ధోనీ కీలక పాత్ర పోషిస్తాడనే సంగతి అందరికీ తెలిసిందే. ఆటగాళ్ల ఎంపిక దగ్గరి నుంచి తుది జట్టులో ఎవరుండాలి, ఎవరు ఎప్పుడు ఎలా ఆడాలనేది ప్రతీది తానే చూసుకుంటాడు. కాగా, చెన్నై ఈ ఏడాది నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. కెప్టెన్‌తో పాటు రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ చెన్నైతోనే కొనసాగనున్నారు.
కృనాల్ క్షమాపణ..
మరోవైపు ముంబయి ఇండియన్స్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య నెటిజన్లకు క్షమాపణలు చెప్పాడు. గురువారం అతడి ట్విటర్ ఖాతా హ్యాకింగ్‌కు గురికావడంతో పలువురు నెటిజన్లు ఇబ్బంది పడ్డారు. అతడి ఖాతా నుంచి సైబర్ నేరస్థులు పలు అనుచిత పోస్టులు చేయడంతో పాటు పలువురికి అసభ్యకరమైన సందేశాలు పంపారు. వాటిని తొలగించిన అనంతరం.. కృనాల్ తన ట్విటర్ ఖాతాను తిరిగి రీస్టోర్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే గురువారం రాత్రి ఓ పోస్టు చేసి క్షమాపణలు చెప్పాడు.