Dinesh Karthik: నేనంటే నీకసలు ఇష్టం లేదు.. నీ మాటలు నమ్మను: నాజర్‌ హుస్సేన్‌ వ్యాఖ్యలకు డీకే సెటైర్

దినేశ్ కార్తిక్‌పై ఎప్పుడూ కామెంట్లు చేసే నాజర్ హుస్సేన్ తొలిసారి పాజిటివ్‌గా స్పందించాడు. దానికి కార్తిక్‌ కూడా కౌంటర్ ఇచ్చాడు.

Published : 10 Apr 2024 15:18 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత సీనియర్‌ క్రికెటర్ దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik), ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్‌ల మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. ఈసందర్భంగా నాజర్‌పై డీకే చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇద్దరూ నవ్వుకుంటూనే మాట్లాడుకోవడంతో అభిమానులూ ఖుషీ అయ్యారు. ఇంతకీ అసలేం జరిగిందంటే? 

ఐపీఎల్ 17వ సీజన్‌లో దినేశ్‌ కార్తిక్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగళూరు జట్టు ఓటమి పాలవుతున్నప్పటికీ.. దినేశ్‌ ‘ఫినిషిర్‌’ పాత్రను మాత్రం చక్కగా నిర్వర్తిస్తున్నాడు. ఈక్రమంలో ఓ స్పోర్ట్స్‌ ఛానల్‌ పాడ్‌ కాస్ట్‌లో నాజర్‌ హుస్సేన్, దినేశ్ కార్తిక్‌లు పాల్గొన్నారు.  ఈసందర్భంగా డీకేను అభినందిస్తూ.. ‘‘వచ్చే టీ20 ప్రపంచకప్‌ స్క్వాడ్‌లో కార్తిక్‌ ఉండాలి. లోయర్‌ ఆర్డర్‌లో అద్భుతంగా ఆడుతున్నాడు’’ అని నాజర్‌ చెప్పాడు. దీనికి బదులుగా కార్తిక్‌ స్పందించాడు. ప్రస్తుత సీజన్‌లో దినేశ్‌ కార్తిక్‌ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 90 పరుగులు చేశాడు.

‘‘నాజర్‌,  నీ మాటలు నేను నమ్మడం లేదు. ఎందుకంటే వ్యక్తిగా, క్రికెటర్‌గా, వికెట్‌ కీపర్‌గా నువ్వు నన్ను ఇష్టపడవని తెలుసు. అయితే, తొలిసారి నన్ను పొగుడుతూ మాట్లాడావు. గత టీ20 ప్రపంచకప్‌ ముందు నన్ను జట్టులోకి తీసుకోవద్దని చెప్పిన ఏకైక వ్యక్తివి నీవే. ఆ ఇంటర్వ్యూలో నన్ను వెన్నుపోటు పొడిచావు. రిషభ్‌ పంత్‌ను హైలైట్‌ చేశావు. కాబట్టి, నాతో కామెడీలు చేయొద్దు (నవ్వుతూ)’’ అని కార్తిక్‌ వ్యాఖ్యానించాడు.  దాదాపు పది మ్యాచుల తర్వాత నాకొకసారి నాజర్ ఫోన్ చేసి చాలా బాగా ఆడావని ప్రశంసించాడు.  దాంతో వ్యక్తిగతంగా మా మధ్య మంచి సంబంధం మొదలైనట్లే’’నని కార్తిక్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని