అశ్విన్‌ ఇంజినీర్‌ ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌ : ఇంగ్లాండ్‌ మాజీ బౌలర్ ప్రశంస

తన స్పిన్‌ బౌలింగ్‌తో ఎన్నో రికార్డులు నెలకొల్పిన అశ్విన్‌పై ఇంగ్లాండ్‌ మాజీ బౌలర్‌ ప్రశంసలు కురిపించాడు.

Published : 06 Mar 2024 13:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత స్టార్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin)పై ఇంగ్లాండ్‌ మాజీ  స్పిన్నర్‌ మోంటీ పనేసర్‌ (Monty Panesar) ప్రశంసలు కురిపించాడు. స్పిన్‌ బౌలింగ్‌లో ఇంజినీర్‌ అంటూ  కొనియాడాడు.
‘‘అశ్విన్‌ చాలా తెలివైనవాడు. భారత్‌ (2012)లో జరిగిన టెస్టు సిరీస్‌లో నేను తొలిసారిగా అతని బౌలింగ్‌ ఎదుర్కొన్నాను. పరిస్థితికి తగ్గట్టు బౌలింగ్‌ చేస్తాడు. పలు కోణాల్లో బంతులు వేయడం, నిరంతరం మెరుగుపడుతూ వికెట్లు పడగొట్టడం అతనికి తెలుసు. తన నూతన విధానాలతో స్పిన్‌ బౌలింగ్‌లో అనేక మార్పులు తీసుకొచ్చాడు. నేను తనని ‘ఇంజినీర్‌ ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌’గా భావిస్తాను’’ అని ఓ కార్యక్రమంలో మీడియాతో అన్నాడు.

ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదో టెస్టుతో కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్‌ ఆడనున్న అశ్విన్‌ 99 మ్యాచుల్లో 507 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ప్రపంచంలో 9వ స్థానంలో ఉన్నాడు. నిరంతరం బౌలింగ్‌ను మెరుగుపరుచుకుంటూ దశాబ్దకాలంగా కెరీర్‌ కొనసాగిస్తున్నాడు. క్యారమ్‌ బాల్‌, స్లైడర్‌, ఆర్మ్‌ బాల్‌, టాప్‌ స్పిన్‌తో సహా అనేక వైవిధ్యమైన అస్త్రాలు అతని సొంతం. ఇంగ్లాండ్‌పై అశ్విన్‌కు మంచి రికార్డు ఉంది. 21 టెస్టుల్లో 105 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న 5 మ్యాచ్‌ల సిరీస్‌లోనూ 17 వికెట్లు పడగొట్టాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని