IND vs ENG : విరాట్‌కు జట్టు పగ్గాలపై ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ కామెంట్స్‌!

శుక్రవారం (జులై 1) నుంచి ఇంగ్లాండ్‌తో భారత్‌ టెస్టు మ్యాచ్‌ను ఆడనుంది. గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో టెస్టు మ్యాచ్...

Published : 30 Jun 2022 01:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో శుక్రవారం (జులై 1) నుంచి భారత్‌ టెస్టు మ్యాచ్‌ ఆడనుంది. గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో టెస్టు మ్యాచ్ ఇప్పుడు జరగనుంది. అయితే ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తారనేదే టీమ్‌ఇండియా ముందున్న అసలైన సవాల్‌.. ఎందుకంటే రెగ్యులర్ సారథి రోహిత్ శర్మ కరోనా బారిన పడ్డాడు. వైస్‌ కెప్టెన్‌ కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఇప్పటికే దూరమయ్యాడు. ఒకవేళ రోహిత్ కోలుకొని అందుబాటులోకి రాకపోతే సారథ్య బాధ్యతలను రిషభ్‌ పంత్‌కు గానీ.. ఫాస్ట్‌ బౌలర్‌ బుమ్రాకు దక్కే అవకాశం ఉంది. అయితే ఈ ఒక్క టెస్టుకు మళ్లీ విరాట్ కోహ్లీకి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని ఇంగ్లాండ్‌ సీనియర్‌ బౌలర్‌ ఒకరు అభిప్రాయపడ్డాడు.

గతేడాది ఇంగ్లాండ్‌తో సిరీస్‌ సందర్భంగా విరాట్ కోహ్లీనే కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే టీ20 ప్రపంచకప్‌ తర్వాత అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీలకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్‌ శర్మను బీసీసీఐ సారథిగా నియమించింది. మళ్లీ కోహ్లీ కెప్టెన్సీని స్వీకరిస్తాడా..? అనేది కూడా ప్రశ్నార్థకమే. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ వెటరన్‌ స్పిన్నర్‌ మొయిన్‌ అలీ స్పందించాడు. ‘‘విరాట్ మళ్లీ కెప్టెన్సీ చేపడతాడా..? ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కష్టతరమే. దీని గురించి ఓ రాత్రంతా ఆలోచించా. ఎందుకంటే గతేడాది ఈ సిరీస్‌ జరిగినప్పుడు విరాట్ కోహ్లీనే కెప్టెన్‌. అందుకే ఈ ఒక్క టెస్టు మ్యాచ్‌కు కూడా కోహ్లీనే సారథిగా నియమిస్తే బాగుంటుంది. ఇదంతా పూర్తిగా విరాట్ కోహ్లీ అభిప్రాయంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే విరాట్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టే అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే ‘నేను మళ్లీ టెస్టు జట్టు సారథ్యం చేపట్టను’ అని విరాట్ ఇప్పటికే ప్రకటించాడు. అయితే ఆటగాడిగా మాత్రం కోహ్లీ అనుభవం టీమ్‌ఇండియాకు అక్కరకొస్తుంది’’ అని మొయిన్‌ అలీ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని