Rahane: అదే రహానె సమస్య.. ఇలాగైతే మళ్లీ కష్టాలు తప్పవు: వసీమ్‌ జాఫర్

విండీస్‌తో (WI vs IND) జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అజింక్య రహానె ప్రదర్శన నిరాశపర్చింది. జట్టులోని ఇతర ఆటగాళ్లు అదరగొడుతున్న వేళ.. రహానె మాత్రం విఫలం కావడం అభిమానుల్లో కలవరం రేపుతోంది.

Updated : 22 Jul 2023 11:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా (Team India) టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్ అజింక్య రహానె (Ajikya Rahane) తన ప్రదర్శనతో మళ్లీ నిరాశపరిచాడు. విండీస్‌తో తొలి టెస్టులో (3 పరుగులు) విఫలమైన రహానె.. రెండో టెస్టులోనూ 8 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడటంతో విండీస్‌ పర్యటనకు (WI vs IND) ఎంపికయ్యాడు. వైస్‌ కెప్టెన్సీ బాధ్యతలను బీసీసీఐ అప్పగించింది. ఇప్పుడు మళ్లీ పరుగుల కోసం చెమటోడ్చాల్సి వస్తోంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్‌ వసీమ్‌ జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టులో స్థానం నిలవాలంటే రహానె నిలకడగా పరుగులు చేయాలని, లేకపోతే యువ క్రికెటర్ల నుంచి ముప్పు తప్పదని హెచ్చరించాడు. రహానె బ్యాటింగ్‌లో నిలకడలేమి ప్రధాన సమస్యగా ఉందని పేర్కొన్నాడు.

‘‘రహానె నిలకడగా తన బ్యాటింగ్ ప్రదర్శన చేయాలి. కెరీర్‌లో 85 టెస్టులు ఆడిన అనుభవం ఉన్నప్పటికీ.. నిలకడగా ఆడలేకపోవడం అతడి సమస్యగా మారింది. దానిని అధిగమించాల్సిన అవసరం ఉంది. రోహిత్ శర్మ తర్వాత టెస్టు కెప్టెన్సీ సొంతం చేసుకునే అవకాశం రహానెకు ఉంది. రహానె ఒక్కసారి పరుగులు చేయడం ప్రారంభిస్తే ఆటోమేటిక్‌గా పరిస్థితులు అనుకూలిస్తాయి. 

శతక్కొట్టిన కోహ్లీ.. రాణించిన అశ్విన్.. ప్రతిఘటిస్తున్న విండీస్

రహానెలోని కెప్టెన్సీని బీసీసీఐ సెలక్టర్లు గుర్తించాలి. ఆసీస్‌పై 36 పరుగులకు భారత్ ఆలౌట్‌ అయిన తర్వాత రహానె జట్టును నడిపించిన తీరు అభినందనీయం. అతడి ఫామ్‌పై ఎలాంటి అనుమానాలు లేవు. కానీ నిలకడే సమస్య. దాని నుంచి బయటపడితే తప్పకుండా టెస్టు జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా రహానె రేసులో ఉంటాడు. ఒకవేళ అతడు పరుగులు చేయకపోతే జట్టులో నుంచే తప్పించే పరిస్థితీ రావచ్చు. ఐపీఎల్‌లో, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అదరగొట్టడంతో విండీస్‌తో సిరీస్‌కు వైస్‌ కెప్టెన్‌గా వచ్చాడు. ఇంకొంతకాలం ఆడే సత్తా రహానెలో ఉంది. నిలకడగా ఆడితే కెప్టెన్‌గానూ అవకాశం ఉంటుంది’’ అని జాఫర్ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని