ODI World Cup 2023: మికీ ఆర్థర్‌.. నీ పని అది కాదు.. అవన్నీ అనాలోచిత వ్యాఖ్యలు: పాక్‌ మాజీ కెప్టెన్

పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ భట్ వరల్డ్‌ కప్‌లో అంపైరింగ్‌పై స్పందిస్తూనే. తమ జట్టు కోచ్‌ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించాడు.

Published : 18 Oct 2023 10:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ చేతిలో తమ జట్టు ఓడిపోవడంపై పాక్‌ మాజీలు ఇంకా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అదే సమయంలో ఐసీసీ ఈవెంట్‌లో అంపైరింగ్‌పైనా కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. పాక్‌ కోచ్‌ మికీ ఆర్థర్‌ చేసిన కామెంట్లను తప్పుబట్టిన మాజీ కెప్టెన్ సల్మాన్‌ భట్‌.. ఈ వరల్డ్‌ కప్‌లో అంపైరింగ్‌ సరిగా లేదని వ్యాఖ్యానించాడు. భారత్-పాక్‌ మ్యాచ్‌తోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ మ్యాచ్‌లను ఉదాహరణగా పేర్కొన్నాడు. 

‘‘ఐసీసీ ఈవెంట్‌లా కాకుండా బీసీసీఐ ఈవెంట్‌ వలె ఉందని పాక్‌ కోచ్‌ స్థానంలో ఉన్న మికీ ఆర్థర్ వ్యాఖ్యానించడం సరికాదు. అవి పూర్తిగా అనాలోచితమైనవి. అవి అతడి నియంత్రణలో ఉండవు. ఇలాంటి వాటిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతడి కర్తవ్యం ఆటగాళ్లలో స్ఫూర్తినింపడం. పరిస్థితులు ఎలా ఉన్నా జట్టును ఏకతాటిపై ముందుకు నడిపించాలి. అంతేగానీ, ఇలాంటి కామెంట్లు చేయడం వల్ల జట్టుపై సానుకూల ప్రభావం పడదు. తర్వాతి మ్యాచుల్లో ఎలా ఆడాలనే విషయాలపైనే దృష్టి పెట్టాలి’’ అని సల్మాన్‌ హితవు పలికాడు.

ఇదేం అంపైరింగ్‌?

‘‘వరల్డ్‌ కప్‌లో అంపైరింగ్‌ ఆశించిన స్థాయిలో లేదు. తీసికట్టు నిర్ణయాలు వెలువడ్డాయి. డేవిడ్‌ వార్నర్, జానీ బెయిర్‌ స్టో ఔటు ఇచ్చిన విధానాలు  వివాదాస్పదమయ్యాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారత్-పాక్‌ పోరులోనూ ఇలాంటి నిర్ణయాలు వచ్చాయి. మరీ ముఖ్యంగా రిజ్వాన్‌ ఔట్‌ విషయంలో. కానీ, అతడు డీఆర్‌ఎస్‌ తీసుకోవడంతో బతికిపోయాడు. అందుకే, ప్రపంచస్థాయి అత్యున్నత ప్రమాణాలు అంపైరింగ్‌లో లేవని అనిపిస్తోంది’’ అని సల్మాన్‌ భట్‌ తెలిపాడు.

ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు

నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్-పాక్‌ మ్యాచ్‌ నిర్వహణపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC)కి పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (PCB) ఫిర్యాదు చేసింది. ‘ ఆ రోజు మా జట్టును లక్ష్యంగా చేసుకుని అనుచితంగా ప్రవర్తించినట్లు అనిపించింది. ఆ రోజు మ్యాచ్‌లోనే కాకుండా.. పాక్‌ జర్నలిస్టులకు వీసాల మంజూరులోనూ జాప్యం, పాక్‌ అభిమానులకు వీసా విధానం లేకపోవడంపై ఐసీసీకి అధికారికంగా నిరసన తెలియజేసేలా ఫిర్యాదు చేశాం’’ అని పీసీబీ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టింది. ఈ క్రమంలో సీనియర్ అధికారులతో పీసీబీ ఛైర్మన్‌ జకా అష్రాఫ్‌ సమావేశాలు నిర్వహించినట్లు క్రికెట్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని