WTC Final: రెండు నెలలు ఆడిన అనుభవం ఇదేనా..? పుజారాపై కనేరియా విమర్శలు

డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌లో (WTC Final 2023) భారత్‌ ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్‌లో విఫలం కావడం. ఆదుకుంటాడని భావించిన ఛెతేశ్వర్ పుజారా తేలిపోయి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

Updated : 14 Jun 2023 19:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఏప్రిల్ నుంచి మే మధ్యకాలంలో ఇంగ్లాండ్‌లోనే ఆరు కౌంటీ మ్యాచ్‌లను ఆడిన ఛెతేశ్వర్ పుజారా.. మూడు సెంచరీల సాయంతో 545 పరుగులు సాధించాడు. మంచి ఫామ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ బరిలోకి దిగాడు. తీరా కీలక మ్యాచ్‌లో 14, 27 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. భారీ లక్ష్య ఛేదనలో కుదురుకున్నట్లే కనిపించిన పుజారా అనవసరమైన అప్పర్‌ కట్‌ షాట్‌తో పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో పుజారా ఆటతీరుపై పాక్‌ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా తీవ్ర విమర్శలు గుప్పించాడు. రోజుల తరబడి ఉండి కూడా సరైన ప్రదర్శన ఇవ్వడంలో విఫలం కావడం దారుణమని పేర్కొన్నాడు.

‘‘ఛెతేశ్వర్‌ పుజారా కౌంటీ క్రికెట్ ఆడాడు. రెండు నెలలపాటు ఇంగ్లాండ్‌ పరిస్థితులను అలవాటు చేసుకున్నాడు. అతడి అనుభవం మొత్తం డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఉపయోగించాల్సింది పోయి దారుణంగా విఫలం కావడం గమనార్హం. దీని వల్ల ఇంగ్లాండ్‌ డొమిస్టిక్‌ క్రికెట్‌లో బౌలింగ్‌ గొప్పగా ఏమీ లేదని తెలుస్తోంది. ఆసీస్‌ బౌలర్లు అద్భుతంగా బంతులను సంధించడంతో వారిని అడ్డుకోవడంలో పుజారా విఫలమయ్యాడు. ఓవల్‌ పిచ్‌ పరిస్థితుల మాదిరిగానే ఉండే ఇతర మైదానాల్లో ఆడినప్పటికీ కీలక ఇన్నింగ్స్‌లు ఆడలేక చేతులెత్తేశాడు’’ అని డానిష్ కనేరియా తన యూట్యూబ్‌ ఛానల్‌లో వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని