Gujarat Vs Rajasthan : గుజరాతేనయా.. ఫైనల్‌కు చేరిందయా

ప్లేఆఫ్స్‌ రేసు మొదలైంది. తొలి క్వాలిఫయిర్‌లో గుజరాత్‌-రాజస్థాన్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్‌ నెగ్గిన గుజరాత్ కెప్టెన్‌...

Updated : 24 May 2022 23:43 IST

కోల్‌కతా: టీ20 లీగ్‌లో గుజరాత్‌ ఫైనల్‌కు చేరుకుంది. తొలి క్వాలిఫయర్‌లో ఆఖరి ఓవర్‌ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో రాజస్థాన్‌పై గుజరాత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 188/6 స్కోరు సాధించింది. అనంతరం గుజరాత్ కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 19.3 ఓవర్లలో 191 పరుగులు చేసి గెలిచింది. డేవిడ్ మిల్లర్‌ (68*) అర్ధశతకం సాధించగా.. హార్దిక్‌ పాండ్య (40*), శుభ్‌మన్‌ గిల్ (35), మ్యాథ్యూ వేడ్ (35) రాణించారు. రాజస్థాన్‌ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, మెక్‌కాయ్‌ చెరో వికెట్‌ తీశారు. 

ఈ విజయంతో గుజరాత్‌ నేరుగా ఫైనల్‌కు చేరుకోగా.. రాజస్థాన్‌కు మరొక అవకాశం క్వాలిఫయర్‌-2 రూపంలో ఉంది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లఖ్‌నవూ-బెంగళూరు మధ్య ఎవరు నెగ్గితే వారితో రాజస్థాన్‌ తలపడుతుంది. మే 25న (బుధవారం) ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరగనుంది. 


లక్ష్యం దిశగా గుజరాత్

గుజరాత్ ఇన్నింగ్స్‌ లక్ష్యం దిశగా సాగుతోంది. రాజస్థాన్‌ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో గుజరాత్ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. క్రీజ్‌లో హార్దిక్ పాండ్య (34*), డేవిడ్ మిల్లర్ (22*) ఉన్నారు. వీరిద్దరూ కలిపి ఇప్పటికి 53 పరుగులు జోడించారు. గుజరాత్ గెలవాలంటే ఇంకా 30 బంతుల్లో 50 పరుగులు చేయాలి.


దూకుడుగా గుజరాత్

గుజరాత్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తోంది. అయితే వేగంగా ఆడిన శుభ్‌మన్‌ గిల్ (35) రనౌట్గా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. క్రీజ్‌లో మ్యాథ్యూ వేడ్ (35*), హార్దిక్ పాండ్య (2*) ఉన్నారు. ఆరంభ ఓవర్లో కాస్త ఆచితూచి ఆడిన గుజరాత్ బ్యాటర్లు పవర్‌ప్లే ఓవర్లలో దంచి కొట్టారు. గుజరాత్ విజయానికి ఇంకా 66 బంతుల్లో 114 పరుగులు కావాలి. 


రాజస్థాన్‌ నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనను గుజరాత్ ప్రారంభించింది. అయితే రాజస్థాన్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ ఆదిలోనే వృద్ధిమాన్‌ సాహా (0) వికెట్ తీశాడు. అనంతరం రాజస్థాన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పరుగుల కోసం గుజరాత్ బ్యాటర్లు శ్రమిస్తున్నారు. ప్రస్తుతం 4 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది. క్రీజ్‌లో శుభ్‌మన్‌ గిల్ (7*), మ్యాథ్యూ వేడ్ (19*) ఉన్నారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 188/6 స్కోరు సాధించింది. 


గుజరాత్ ఎదుట భారీ లక్ష్యం

తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్‌ ఎదుట రాజస్థాన్‌ 189 పరుగుల భారీ లక్ష్య ఉంచింది. మధ్య ఓవర్లలో నెమ్మదించినప్పటికీ రాజస్థాన్‌ మంచి స్కోరే సాధించింది. ఓపెనర్ జోస్ బట్లర్ (89) రాణించడంతో  తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌ (47), దేవదుత్‌ పడిక్కల్ (28) ఫర్వాలేదనిపించారు. యశస్వి జైస్వాల్ 3, హెట్‌మయేర్ 4, రియాన్ పరాగ్ 4, అశ్విన్ 2* పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో షమీ, దయాల్, సాయికిశోర్, హార్దిక్ పాండ్య తలో వికెట్ తీశారు.


కోలుకున్న రాజస్థాన్‌

ఇప్పుడిప్పుడే రాజస్థాన్‌ కుదురుకుంటోంది. దేవదుత్ పడిక్కల్ (28) ధాటిగా ఆడి హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం రాజస్థాన్‌ 15 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. క్రీజ్‌లో జోస్ బట్లర్‌ (37*), హెట్‌మయేర్ (1*) ఉన్నారు. ఆఖరి ఐదు ఓవర్లలో ధాటిగా పరుగులు రాబడితేనే గుజరాత్ ఎదుట భారీ లక్ష్యం ఉంచే అవకాశం ఉంటుంది.


గుజరాత్‌ స్పిన్నర్లు కట్టుదిట్టం

గుజరాత్‌ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేయడంతో రాజస్థాన్‌ బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు శ్రమించారు. ఈ క్రమంలో  దూకుడుగా ఆడిన కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (47) పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్‌ రెండు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. క్రీజ్‌లో జోస్ బట్లర్ (25*), దేవదుత్ పడిక్కల్‌ (1*) ఉన్నారు. ప్రారంభంలో ధాటిగా ఆడిన బట్లర్‌ నెమ్మదించాడు. దీంతో స్కోరు బోర్డు స్లో అయింది.


దూకుడుగా రాజస్థాన్‌ బ్యాటింగ్‌..

రాజస్థాన్‌ దూకుడుగా ఆడుతోంది. గుజరాత్‌ బౌలర్లు పట్టు విడవడంతో రాజస్థాన్‌ బ్యాటర్లు భారీ షాట్లు ఆడేశారు. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్‌ వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. క్రీజ్‌లో ఓపెనర్ జోస్ బట్లర్ (17*), సంజూ శాంసన్ (34*) ఉన్నారు. యశస్వి జైస్వాల్ ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన శాంసన్‌ వేగంగా పరుగులు రాబట్టాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు ఇప్పటి వరకు 49 పరుగులు జోడించారు.


రాజస్థాన్ బ్యాటింగ్‌ ప్రారంభం..

తొలి క్వాలిఫయిర్‌లో రాజస్థాన్ బ్యాటింగ్‌ ప్రారంభించింది. గుజరాత్ పేసర్ షమీ వేసిన తొలి ఓవర్‌లో రాజస్థాన్‌ ఓపెనర్ జోస్ బట్లర్ (14*) రెండు బౌండరీలు బాదాడు. అనంతరం రెండో ఓవర్‌ను యాష్ దయాల్ కట్టుదిట్టంగా వేశాడు. కేవలం రెండు పరుగులే ఇచ్చి యశస్వి జైస్వాల్ (3) వికెట్‌ను తీశాడు. దీంతో రాజస్థాన్‌ 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. క్రీజ్‌లో బట్లర్‌తోపాటు సంజూ శాంసన్‌ ఉన్నాడు.


టాస్‌ నెగ్గిన హార్దిక్ పాండ్య

ప్లేఆఫ్స్‌లో సమరం మొదలైంది. తొలి క్వాలిఫయిర్‌లో గుజరాత్‌-రాజస్థాన్ మధ్య మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్‌ నెగ్గిన గుజరాత్ కెప్టెన్‌ హార్దిక్ పాండ్య బౌలింగ్‌ ఎంచుకుని రాజస్థాన్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. అయితే ఓడిన టీమ్‌కు మరొక అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో తొలి క్వాలిఫయర్‌లో ఓడిన టీమ్‌ తలపడుతుంది. గుజరాత్‌ జట్టులో ఒక మార్పు చేసింది. లాకీ ఫెర్గూసన్ స్థానంలో అల్జారీ జోసెఫ్‌ను తీసుకుంది. రాజస్థాన్‌ ఏ మార్పు లేకుండా బరిలోకి దిగింది. 

ఈ సీజన్‌లో రాజస్థాన్‌ తొలిసారి బ్యాటింగ్‌ చేసినప్పుడు ఏడుసార్లు విజయం సాధించగా.. గుజరాత్ ఆరు సార్లు ఛేజింగ్‌లోనే గెలవడం విశేషం. మరోవైపు సంజూ శాంసన్‌ ఈ సీజన్‌లో కేవలం రెండు సార్లు మాత్రమే టాస్‌ను నెగ్గగా.. 13 సార్లు కోల్పోయాడు. దీంతో ఒకే సీజన్‌లో అత్యధికసార్లు టాస్‌ ఓడిన కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ రికార్డు సృష్టించాడు. సంజూ తర్వాత ఎంఎస్ ధోనీ (12సార్లు - 2012) (11సార్లు -2008), విరాట్ కోహ్లీ 11 సార్లు (2013) ఉన్నారు.

జట్ల వివరాలు:

గుజరాత్‌: వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్‌ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్‌, సాయికిశోర్, యాష్ దయాల్, అల్జారీ జోసెఫ్‌, మహమ్మద్ షమీ

రాజస్థాన్‌: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్ (కెప్టెన్), దేవదుత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, షిమ్రోన్ హెట్‌మయేర్, రియాన్ పరాగ్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్‌ కృష్ణ, చాహల్, మెక్‌కాయ్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని