IND vs SA: నంబర్‌ వన్‌ బౌలర్‌ను పక్కనెలా పెడతారు?: గంభీర్‌

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో (IND vs SA) భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో భారత ఓటమికి తుది జట్టు ఎంపిక కూడా ఓ కారణమని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.

Published : 13 Dec 2023 15:28 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భారత్‌కు (IND vs SA) ఓటమి ఎదురైంది. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో సఫారీ జట్టు గెలిచింది. అయితే, తుది జట్టు ఎంపికపై క్రికెట్‌ మాజీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఏడాదిలో పొట్టి కప్‌ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ అవకాశం ఇవ్వాలనే మేనేజ్‌మెంట్ తీరు ఇప్పుడు సరైంది కాదని వ్యాఖ్యానించారు. మరీ ముఖ్యంగా వరల్డ్‌ నంబర్‌వన్‌ బౌలర్‌ను ఎలా పక్కన పెడతారని భారత మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) ప్రశ్నించాడు. ఓ క్రీడా ఛానెల్‌లో పీయూశ్ చావ్లా, గంభీర్‌ మాట్లాడారు. 

భారత తుది జట్టు ఎంపిక మీకేమైనా ఆశ్చర్యాన్ని కలిగించిందా..? అని యాంకర్‌ అడిగిన ప్రశ్నకు పీయూశ్‌ చావ్లా స్పందించాడు. ‘‘గత సిరీస్‌లో రవి బిష్ణోయ్ అద్భుత ప్రదర్శన చేశాడు. అతడు తప్పకుండా ఆడాల్సింది. తాజాగా ఐసీసీ ర్యాంకుల్లో టాప్‌లోకి వచ్చాడు. అవకాశం రాకపోయేసరికి నిరుత్సాహానికి గురై ఉంటాడు’’ అని చావ్లా వ్యాఖ్యానించాడు. 

ఇదే విషయంపై గంభీర్‌ కాస్త ఘాటుగానే స్పందించాడు. ‘‘శ్రేయస్‌ అయ్యర్‌ను (Shreyas Iyer) ఎందుకు తీసుకోలేదో అర్థం కావడం లేదు. ఆసీస్‌తో టీ20 సిరీస్‌ చివరి మ్యాచ్‌లో అర్ధ శతకం సాధించాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు వచ్చేసరికి ఎడమ చేతివాటం బ్యాటర్లను తీసుకోవడానికి కారణం ఏంటో మేనేజ్‌మెంట్ చెప్పాలి. పీయూశ్‌ చెప్పినట్లు.. నంబర్‌ వన్‌ బౌలర్‌ రవి బిష్ణోయ్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం సరైంది కాదు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తూ ఉండాలి. అయితే, టాప్‌ బౌలర్‌ను పక్కన పెట్టడం సరికాదు. కీలకమైన బౌలర్‌ను బెంచ్‌కు ఎలా పరిమితం చేస్తారు? దీనికి కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్, టీమ్‌ మేనేజ్‌మెంట్ స్పష్టతనివ్వాలి’’ అని గంభీర్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని