FIFA World Cup: ఫుట్‌బాల్‌ జగజ్జేత అర్జెంటీనా

గుండెలు చేతుల్లో పెట్టుకుని.. కళ్లన్నీ టీవీలకు అతికించేసి.. కాళ్లు కట్టేసుకుని.. బంతి కదిలితే వాళ్లే కదిలిపోయినట్లుగా.. గోల్‌ కొడితే తామే చేసేసినట్లుగా.. షాట్‌ గురి తప్పితే తామే ఏదో కోల్పోయినట్లుగా.. ఏమిటీ ఉత్కంఠ.. ఏమిటా పులకింత.

Updated : 19 Dec 2022 08:13 IST

గుండెలు చేతుల్లో పెట్టుకుని.. కళ్లన్నీ టీవీలకు అతికించేసి.. కాళ్లు కట్టేసుకుని.. బంతి కదిలితే వాళ్లే కదిలిపోయినట్లుగా.. గోల్‌ కొడితే తామే చేసేసినట్లుగా.. షాట్‌ గురి తప్పితే తామే ఏదో కోల్పోయినట్లుగా.. ఏమిటీ ఉత్కంఠ.. ఏమిటా పులకింత. జేమ్స్‌బాండ్‌ సినిమాలోనూ ఇన్ని ట్విస్టులు ఉండవేమో! అర్జెంటీనా, ఫ్రాన్స్‌ మధ్య ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో మొదట 80 నిమిషాలు ఒక ఎత్తు! ఆ తర్వాత ఆట ఇంకో ఎత్తు! రెండు గోల్స్‌ కొట్టేసి దిలాసాగా ఉన్న అర్జెంటీనాపై.. ఆఖర్లో ఎంబాపె బాంబులా పడిపోతే టెన్షన్‌ ఎవరెస్టులా పెరిగిన వేళ! ప్రతి గడియా అపురూపమే. చెరో రెండు గోల్స్‌తో అర్జెంటీనా- ఫ్రాన్స్‌ సమ ఉజ్జీలుగా నిలిచిన తరుణంలో నిర్ణీత సమయం అయిపోయింది. ఆపై ఇంజురీ టైమ్‌ కరిగిపోయింది. ఆ సమయంలో మెస్సి కొట్టిన ఓ మెరుపు షాట్‌ను ఫ్రాన్స్‌ కీపర్‌ ఆపేసిన క్షణాన అభిమానులు ఎంతగా నిట్టూర్చారో! నువ్వానేనా అన్నట్లు సాగిన అదనపు సమయంలోనూ రెండు జట్లు తలో గోల్‌ కొట్టడంతో.. విజేత కోసం నిరీక్షణ తప్పలేదు. బుర్రలు వేడెక్కి.. కాళ్లు చల్లబడి.. మెదడు మొద్దుబారిన భావన ఒక్కొక్కరిలో! మ్యాచ్‌ పెనాల్టీ షూటౌట్‌కి మళ్లిన సమయాన గుండెజారి గల్లంతైనట్లే అనిపించిన అనుభూతి. ఇంతటి ఉత్కంఠలో మెస్సి, ఎంబాపె తొలి రెండు షాట్లు గోల్స్‌గా కొడితే ఆనందం.. బాధ కలిసిన భావోద్వేగం. ఆ తర్వాత ఫ్రాన్స్‌ ఆటగాడి షాట్‌ను అర్జెంటీనా గోల్‌కీపర్‌ అడ్డుకుంటే సర్రున లేచి నించున్నారు జనాలు! ఎందుకంటే అంత కీలకం ఆ సేవ్‌. ఆ తర్వాత రెండు షాట్లకు అర్జెంటీనా గోల్‌ కొట్టగానే విజయం మెస్సి సేనదే అన్న ధీమా! ఫ్రాన్స్‌ ఆటగాడు ఓ గోల్‌ చేసినా అర్జెంటీనాదే కప్‌ అన్న నమ్మకం! ఆ తర్వాత అర్జెంటీనా ఆటగాడు గోల్‌ కొట్టేయడంతో దిక్కులు పిక్కటిల్లేలా సంబరాలే సంబరాలు!

గాలి స్తంభించేలా.. కాలం ఆగేలా.. విశ్వమే బంతిగా మారి.. అతని కాలు కింద వాలిందేమో అనేలా.. షూటౌట్‌తో కలిపి మూడుసార్లు బంతిని నెట్‌లోకి పంపించాడు మెస్సి. ఈ ఉత్కంఠభరిత పోరు ముగియగానే రెప్ప వేయడం మర్చిపోయిన అభిమానుల కళ్లు చెమర్చాయి. ఊపిరి తీసుకోవడం ఆగిపోయినట్లు కనిపించిన మనసులు.. భావోద్వేగంతో కేకలు పెట్టాయి. మెస్సి సాధించాడు. తనకు చివరిదైన అయిదో ప్రపంచకప్‌లో లక్ష్యాన్ని చేరుకున్నాడు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు