ప్రిక్వార్టర్స్‌లో నీతు, ప్రీతి, మంజు

ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత బాక్సర్లు సూపర్‌ పంచ్‌లతో పతకాల వేటలో సాగుతున్నారు. స్వదేశంలో జరుగుతున్న ఈ పోటీల్లో నీతు (48 కేజీలు), ప్రీతి (54), మంజు (66) శనివారం ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.

Published : 19 Mar 2023 02:17 IST

ప్రపంచ మహిళల బాక్సింగ్‌

దిల్లీ: ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో భారత బాక్సర్లు సూపర్‌ పంచ్‌లతో పతకాల వేటలో సాగుతున్నారు. స్వదేశంలో జరుగుతున్న ఈ పోటీల్లో నీతు (48 కేజీలు), ప్రీతి (54), మంజు (66) శనివారం ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. కామన్వెల్త్‌ క్రీడల పసిడి విజేత నీతు ఈ టోర్నీలో తన తొలి పోరులో దోయన్‌ కాంగ్‌ (కొరియా)ను చిత్తుచేసింది. తొలి రౌండ్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించింది. హుక్‌, క్రాస్‌ పంచ్‌లతో చెలరేగిన ఆమె ధాటికి కాంగ్‌ నిలవలేకపోయింది. దీంతో రిఫరీ బౌట్‌ ఆపేసి నీతును విజేతగా ప్రకటించాడు. మరోవైపు మంజు 5-0 తేడాతో కారా వారెరా (న్యూజిలాండ్‌)పై ఏకపక్ష విజయం సాధించింది. బౌట్లో ముష్ఠిఘాతాలతో రెచ్చిపోయిన మంజు.. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఇక తన రెండో రౌండ్లో ప్రీతి 4-3 తేడాతో లాక్రామియోరా (రొమేనియా)పై పోరాడి గెలిచింది. బాక్సర్లిద్దరూ హోరాహోరీగా తలపడడంతో ఆరంభం నుంచే పోరు రసవత్తరంగా సాగింది. తొలి రౌండ్‌లో ప్రీతి 3-2తో పైచేయి సాధించింది. కానీ రెండో రౌండ్‌లో పుంజుకున్న ప్రత్యర్థి 3-2తో ఆధిక్యంలో నిలిచింది. దీంతో చివరి రౌండ్‌ ఉత్కంఠభరితంగా మారింది. చివరి మూడు నిమిషాల్లో ఇద్దరు బాక్సర్లు గెలుపు కోసం హోరాహోరీగా తలపడ్డారు. దీంతో ఈ రౌండ్‌ డ్రాగా ముగిసింది. చివరకు సమీక్షలో ప్రీతిని విజేతగా తేల్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని