సంక్షిప్త వార్తలు (3)

అఫ్గానిస్థాన్‌ అదరగొట్టింది. పాకిస్థాన్‌ లాంటి బలమైన జట్టుపై టీ20 సిరీస్‌ గెలిచింది. రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో నెగ్గిన అఫ్గాన్‌.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని దక్కించుకుంది.

Published : 28 Mar 2023 03:06 IST

పాక్‌పై అఫ్గాన్‌ సిరీస్‌ విజయం

షార్జా: అఫ్గానిస్థాన్‌ అదరగొట్టింది. పాకిస్థాన్‌ లాంటి బలమైన జట్టుపై టీ20 సిరీస్‌ గెలిచింది. రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో నెగ్గిన అఫ్గాన్‌.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని దక్కించుకుంది. మొదట పాక్‌ 6 వికెట్లకు 130 పరుగులు చేసింది. ఇమాద్‌ వసీమ్‌ (64 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌. కెప్టెన్‌ షాదాబ్‌ఖాన్‌ (32) కూడా రాణించాడు. ఫారూఖీ (2/19) పాక్‌ను కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించాడు. రహ్మనుల్లా గుర్బాజ్‌ (44), ఇబ్రహీం జద్రాన్‌ (38) రాణించడంతో లక్ష్యాన్ని అఫ్గాన్‌ 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గుర్బాజ్‌, ఇబ్రహీం ఔట్‌ కావడంతో ఆఖర్లో ఉత్కంఠ నెలకొంది. చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు అవసరమయ్యాయి. ఈ స్థితిలో ధాటిగా ఆడిన నజిబుల్లా జద్రాన్‌ (23 నాటౌట్‌; 12 బంతుల్లో 2×4, 1×6).. మహ్మద్‌ నబి (14 నాటౌట్‌; 9 బంతుల్లో 1×6)తో కలిసి అఫ్గానిస్థాన్‌ను విజయపథంలో నడిపించాడు. ఒక ఐసీసీ టాప్‌-6 ర్యాంకు జట్టుపై సిరీస్‌ గెలవడం అఫ్గాన్‌కు ఇదే తొలిసారి.


తొలి టీ20లో బంగ్లాదేశ్‌ విజయం

చట్టోగ్రామ్‌: ఐర్లాండ్‌తో తొలి టీ20లో బంగ్లాదేశ్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ విధానంలో 22 పరుగుల తేడాతో గెలిచింది. రోనీ తాలుక్దార్‌ (67), లిటన్‌ దాస్‌ (47), షమీమ్‌ హుస్సేన్‌ (30) చెలరేగడంతో మొదట బంగ్లాదేశ్‌ 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. వర్షం వల్ల బంగ్లా ఇన్నింగ్స్‌ 19.2 ఓవర్ల వద్దే ముగిసింది. చాలా సేపు ఆట నిలిచిపోయింది. ఐర్లాండ్‌ లక్ష్యాన్ని 8 ఓవర్లలో 104 పరుగులకు సవరించగా.. ఆ జట్టు 5 వికెట్లకు 81 పరుగులే చేయగలిగింది. గారెత్‌ డెలాని (21 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లా 1-0 ఆధిక్యం సంపాదించింది.


ఇందౌర్‌ పిచ్‌ రేటింగ్‌ మార్పు

దుబాయ్‌: బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టుకు ఆతిథ్యమిచ్చిన ఇందౌర్‌లోని హోల్కర్‌ స్టేడియం పిచ్‌ రేటింగ్‌ను సోమవారం ఐసీసీ మార్చింది. మొదట ఐసీసీ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ ‘పేలవం’ అని రేటింగ్‌ ఇవ్వగా.. దీనిపై బీసీసీఐ అప్పీల్‌ను పరిశీలించిన ఐసీసీ రేటింగ్‌ను తాజాగా ‘బిలో యావరేజ్‌ (సాధారణం కంటే దిగువన)’గా మార్చింది. ‘పేలవం’ అని పేర్కొనేందుకు ఆ పిచ్‌పై మరీ ఎక్కువగా అస్థిర బౌన్స్‌ లభించలేదని ఐసీసీ అభిప్రాయపడింది. దీంతో అప్పుడు ఆ పిచ్‌కు కేటాయించిన 3 అయోగ్యతా పాయింట్లను ఒకటికి తగ్గించనుంది. స్పిన్‌కు విపరీతంగా సహకరించిన పిచ్‌పై ఆ మ్యాచ్‌ మూడు రోజుల్లోపే ముగిసింది. అందులో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. మరోవైపు డ్రాగా ముగిసిన చివరి టెస్టుకు వేదికైన అహ్మదాబాద్‌ పిచ్‌కు ఐసీసీ ‘సాధారణం (యావరేజ్‌)’ రేటింగ్‌ ఇచ్చింది. ఈ సిరీస్‌ను టీమ్‌ఇండియా 2-1తో గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలకు ఆతిథ్యమిచ్చిన ముంబయిలోని వాంఖడే స్టేడియం, విశాఖ స్టేడియం ‘అత్యుత్తమం’ రేటింగ్‌ సంపాదించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని