IPL 2023: పడిపోదాం పదహారులో..
ధోని.. ధోని.. అరుపులతో చెపాక్ స్టేడియం దద్దరిల్లిపోయే సమయం ఆసన్నమైంది. విరాట్ విన్యాసాలకు మంత్రముగ్ధులయ్యేందుకు అభిమానుల కేరింతల్లో మునిగిపోయేందుకు చిన్నస్వామి స్టేడియం సిద్ధమైంది. ఇటు సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట చూసేందుకు తెలుగు అభిమానులు సై అంటున్నారు.
ఐపీఎల్ 16వ సీజన్ నేటి నుంచే
తొలి మ్యాచ్‌లో గుజరాత్‌తో చెన్నై ఢీ
రాత్రి 7.30 నుంచి
అహ్మదాబాద్
ధోని.. ధోని.. అరుపులతో చెపాక్ స్టేడియం దద్దరిల్లిపోయే సమయం ఆసన్నమైంది. విరాట్ విన్యాసాలకు మంత్రముగ్ధులయ్యేందుకు అభిమానుల కేరింతల్లో మునిగిపోయేందుకు చిన్నస్వామి స్టేడియం సిద్ధమైంది. ఇటు సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట చూసేందుకు తెలుగు అభిమానులు సై అంటున్నారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఇంటా, బయట మ్యాచ్‌లతో పాత విధానంతో.. కొన్ని మార్పులతో కొత్తగా ముస్తాబైన ఐపీఎల్ వచ్చేసింది. శుక్రవారం 16వ సీజన్‌కు తెరలేవనుంది. ఇక పరుగుల వేటలో.. వికెట్ల బాటలో అభిమాన ఆటగాళ్ల అద్భుత నైపుణ్యాలను చూడడమే ఆలస్యం. దాదాపు రెండు నెలల పాటు టీ20 కిక్కే కిక్కే!
వేసవి వినోదాన్ని అందించేందుకు ఐపీఎల్ సిద్ధమైంది. ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొడుతుంది. గతేడాదే లీగ్‌లో అడుగుపెట్టి.. సంచలన ప్రదర్శనతో విజేతగా నిలిచిన గుజరాత్ అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో తొలిసారే కెప్టెన్‌గా గుజరాత్‌కు టైటిల్ అందించిన హార్దిక్ పాండ్య ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. బ్యాట్‌తో, బంతితో సత్తాచాటుతున్నాడు. ఈ ఏడాది పరుగుల వరద పారిస్తున్న శుభ్‌మన్ గిల్.. ఐపీఎల్‌లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. జాతీయ జట్టు కోసం తొలి రెండు మ్యాచ్‌లకు మిల్లర్ దూరం కావడం గుజరాత్‌కు దెబ్బే. వేలంలో దక్కించుకున్న కేన్ విలియమ్సన్ ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది ఆసక్తికరం. ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ వికెట్ కీపర్ బ్యాటర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. రషీద్ ఖాన్, మహమ్మద్ షమి బౌలింగ్‌లో కీలకం కానున్నారు. మరోవైపు కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోని మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. అతని సారథ్యంలోని చెన్నై ఎప్పటిలాగే బలంగా ఉంది. స్టోక్స్, డెవాన్ కాన్వె, రుతురాజ్, అంబటి రాయుడు, మొయిన్ అలీ, జడేజా, తీక్షణ, దీపక్ చాహర్ లాంటి ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ స్టోక్స్ ఆ జట్టుకు కీలకం కానున్నాడు. ప్రాక్టీస్ సందర్భంగా ధోని మోకాలికి గాయమైంది. తొలి మ్యాచ్‌కు అతడు దూరమయ్యే అవకాశముంది. మ్యాచ్‌లన్నీ స్టార్‌స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రసారం అవుతాయి.
ధరకు న్యాయం చేస్తారా?
ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు.. వేలంలో ఎక్కువ ధర పలికిన ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. ఈ సీజన్‌కు ముందు నిరుడు డిసెంబర్‌లో నిర్వహించిన వేలంలోనూ కొంతమంది ఆటగాళ్లు భారీ ధర పలికారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ యువ ఆల్‌రౌండర్ సామ్ కరన్ కోసం పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.18.5 కోట్లు పెట్టింది. లీగ్ చరిత్రలోనే ఇదే అత్యధిక ధర. ఇక కామెరూన్ గ్రీన్ (రూ.17.5 కోట్లు)ను ముంబయి, స్టోక్స్ (రూ.16.25 కోట్లు)ను చెన్నై, నికోలస్ పూరన్ (రూ.16 కోట్లు)ను లఖ్‌నవూ, హ్యారీ బ్రూక్ (రూ.13.25 కోట్లు), మయాంక్ (రూ.8.25 కోట్లు)ను సన్‌రైజర్స్, శివమ్ మావి (రూ.6 కోట్లు)ని గుజరాత్, హోల్డర్ (రూ.5.75 కోట్లు)ను రాజస్థాన్, ముఖేష్ (రూ.5.5 కోట్లు)ను దిల్లీ, క్లాసెన్ (రూ.5.25 కోట్లు)ను సన్‌రైజర్స్ కూడా అధిక మొత్తం చెల్లించే సొంతం చేసుకున్నాయి.
తారల తళుకులు..
కరోనా కారణంగా గత మూడేళ్లుగా ఐపీఎల్ ఆరంభ వేడుకలు జరగలేదు. దీంతో ఈ సారి సీజన్ ప్రారంభోత్సవాన్ని అదిరేలా నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తులు పూర్తి చేసింది. ఇందులో భాగంగానే ప్రముఖ నటీమణులు రష్మిక మంధాన, తమన్నా భాటియా నృత్యాలతో అలరించబోతున్నారు. స్టార్ గాయకుడు అర్జిత్ సింగ్ తన గాత్రంతో ప్రేక్షకులను మైమరిపించనున్నాడు. ఇంకా ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను బీసీసీఐ నిర్వహించనుంది. ఈ వేడుకలు సాయంత్రం 6 గంటలకు నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభవుతాయి.
అందరి దృష్టి ఆ ‘ప్లేయర్’పై..
ఈ సీజన్ నుంచి కొన్ని మార్పులతో ఐపీఎల్ సరికొత్తగా మారనుంది. అందులో ముఖ్యంగా ‘ఇంపాక్ట్ ప్లేయర్’ గురించి చెప్పుకోవాలి. తుది 11 మంది ఆటగాళ్లు కాకుండా.. జట్టు ముందుగానే ప్రకటించిన నలుగురు సబ్‌స్టిట్యూట్‌ల నుంచి ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంచుకునే అవకాశం ఉంది. అలా మైదానంలో అడుగుపెట్టే ఆటగాడు బ్యాటింగ్ చేయొచ్చు.. బౌలింగ్ వేయొచ్చు. టాస్ వేశాక తుది జట్ల ప్రకటన.. వైడ్, నోబాల్‌కు సమీక్ష.. బంతి వేసేటప్పుడు ఫీల్డర్ లేదా వికెట్‌కీపర్ ఉద్దేశపూర్వకంగా కదిలితే అయిదు పరుగుల జరిమానా.. ఇలా కొత్త విషయాలు ఈ సీజన్‌లో చూడబోతున్నాం. కొత్త ఫార్మాట్ విషయానికి వస్తే పది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఓ గ్రూప్‌లోని ప్రతి జట్టు.. తమ గ్రూప్‌లోని మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్, అవతలి గ్రూప్‌లోని అయిదు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. ఇక 2019 తర్వాత తిరిగి ఇంటా, బయట మ్యాచ్‌లు జరగబోతున్నాయి. కొత్తగా గువాహాటిలో రాజస్థాన్ రాయల్స్, ధర్మశాలలో పంజాబ్ కింగ్స్.. ఇతర జట్లతో తలపడతాయి.
ఈ స్టార్లు దూరం..
సీజన్ ఆరంభం కాకముందే జట్లకు ఆటగాళ్ల గాయాలు పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే కొంతమంది స్టార్ ఆటగాళ్లు సీజన్‌కు పూర్తిగా దూరమయ్యారు. మరికొందరు కొన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. విల్ జాక్స్ (ఆర్సీబీ), ప్రసిద్ధ్ కృష్ణ (రాజస్థాన్), బెయిర్‌స్టో (పంజాబ్), బుమ్రా, రిచర్డ్‌సన్ (ముంబయి), పంత్ (దిల్లీ), జేమీసన్, ముఖేష్ చౌదరి (చెన్నై) ఈ సీజన్ మొత్తానికి అందుబాటులో లేకుండా పోయారు. ఇక రజత్ పటీదార్, హేజిల్‌వుడ్, మ్యాక్స్‌వెల్ (ఆర్సీబీ), లివింగ్‌స్టోన్ (పంజాబ్), మోసిన్ ఖాన్ (లఖ్‌నవూ), శ్రేయస్ అయ్యర్ (కోల్‌కతా) కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నారు. మరోవైపు జాతీయ జట్ల తరపున ఆడుతున్న దక్షిణాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్‌కు చెందిన కొంతమంది ఆటగాళ్లు కాస్త ఆలస్యంగా సీజన్‌లో అడుగుపెట్టనున్నారు.
టీమ్‌ఇండియా జాగ్రత్త..
ఐపీఎల్ భారత క్రికెట్‌కు ఎంతో మేలు చేస్తూనే ఉంది. అద్భుతమైన నైపుణ్యాలున్న ఆటగాళ్లను జాతీయ జట్టుకు అందిస్తోంది. కానీ ఈ లీగ్‌తో టీమ్‌ఇండియా ప్రదర్శనను ముడిపెడుతూ విమర్శలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి భారత ఆటగాళ్లపై ప్రత్యేక దృష్టి ఉండనుంది. ఎందుకంటే ఈ సీజన్ ముగిసిన పది రోజుల్లోపే ఆస్ట్రేలియా, భారత్ మధ్య ఇంగ్లాండ్‌లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ (జూన్ 7న) ఆరంభం కానుంది. అక్టోబర్‌లో స్వదేశంలో వన్డే ప్రపంచకప్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా ఆటగాళ్ల పని భారంపై ప్రత్యేక దృష్టి పెట్టే ఆస్కారముంది.
రాత మారుస్తారా?
ఈ సీజన్లో నాలుగు జట్లు కొత్త కెప్టెన్లతో బరిలో దిగుతున్నాయి. దిల్లీకి వార్నర్, పంజాబ్‌కు ధావన్, సన్‌రైజర్స్‌కు మార్‌క్రమ్, కోల్‌కతాకు నితీష్ రాణా నాయకత్వం వహిస్తున్నారు. ఇందులో దిల్లీ, పంజాబ్ ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గలేదు. ఒకసారి సన్‌రైజర్స్ (2016), రెండు సార్లు కోల్‌కతా (2012, 2014) టైటిళ్లు దక్కించుకున్నాయి. ఈ జట్లను నడిపించడం కెప్టెన్లకు సవాలే. వార్నర్, ధావన్‌కు ఇప్పటికే ఐపీఎల్‌లో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. సన్‌రైజర్స్‌కు వార్నర్ కప్పు అందించగా.. గతంలో కొన్ని మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్, దిల్లీ, పంజాబ్‌ను ధావన్ నడిపించాడు. నిరుడు పంజాబ్‌కు మయాంక్ సారథిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక నిరుడు లీగ్‌లో అడుగుపెట్టిన లఖ్‌నవూ కూడా టైటిల్‌పై కన్నేసింది. కృనాల్ పాండ్య, దీపక్ హుడా, మార్క్‌వుడ్, నికోలస్ పూరన్ లాంటి ఆటగాళ్లతో బలంగానే కనిపిస్తున్న ఆ జట్టుకు.. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫామ్ అందుకోవడం కీలకం కానుంది.
రోహిత్ ఎక్కడ?
గురువారం ఐపీఎల్ జట్ల కెప్టెన్లందరూ కలిసి ట్రోఫీతో ఫొటో దిగారు. కానీ అందులో ముంబయి సారథి రోహిత్ శర్మ లేకపోవడం చర్చకు దారితీసింది. అనారోగ్యం కారణంగా రోహిత్ అహ్మదాబాద్ వెళ్లలేదని, ఆదివారం ఆర్సీబీతో మ్యాచ్ వరకూ కోలుకుంటాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మార్‌క్రమ్ ఇంకా దక్షిణాఫ్రికాలోనే ఉండడంతో సన్‌రైజర్స్ తరపున భువీ పాల్గొన్నాడు.
ఆ రెండు జట్లు ఏం చేస్తాయో?
ఐపీఎల్‌లో ముంబయి 5 సార్లు, చెన్నై 4 సార్లు టైటిల్ సొంతం చేసుకున్నాయి. కానీ నిరుడు ఈ రెండు జట్లూ అనూహ్యంగా పేలవ ప్రదర్శనతో పట్టికలో చివరి రెండు స్థానాల్లో (ముంబయి 10, చెన్నై 9) నిలిచాయి. ఈ సారి ఈ అగ్రశ్రేణి జట్లు తిరిగి పుంజుకుని.. సీజన్‌ను రసవత్తరంగా మారుస్తాయనే అంచనాలున్నాయి. ముఖ్యంగా టైటిళ్ల సంఖ్యలో ముంబయిని అందుకోవాలనే పట్టుదలతో చెన్నై ఉంది. ఇక నిరుటి ప్రదర్శన తర్వాత రోహిత్‌పై ఒత్తిడి పెరిగింది. ఇటు అంతర్జాతీయ క్రికెట్లోనూ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ సీజన్ రోహిత్‌కు పరీక్షే. చెన్నై.. ముంబయిని అందుకుంటుందా..? ముంబయి ఆరో టైటిల్ దక్కించుకుంటుందా? లేదా ఈ రెండు జట్లను కాదని మరొకటి విజేతగా నిలుస్తుందా? అన్నది మే 28న తేలిపోతుంది.
సన్‌రైజర్స్ మెరుగయ్యేనా?
గత రెండు సీజన్లలో ఆటపరంగా ప్రదర్శన పడిపోయి, జట్టు ఎంపికలో ఇంటా, బయటా విమర్శలు ఎదుర్కొన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సారి ఏం చేస్తుందో? గత రెండు సీజన్లలోనూ ఆ జట్టు ఎనిమిదో స్థానంలోనే నిలిచింది. ఇప్పుడు కొత్త కెప్టెన్ మార్‌క్రమ్ సారథ్యంలో ఉత్సాహంతో కనిపిస్తున్న జట్టు.. మెరుగైన ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతోంది. ఇటీవల దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో కెప్టెన్‌గా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ను విజేతగా నిలిపిన మార్‌క్రమ్.. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ జట్టుకు టైటిల్ అందించాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. మార్‌క్రమ్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, గ్లెన్ ఫిలిప్స్, హ్యారీ బ్రూక్, అబ్దుల్ సమద్ లాంటి ఆటగాళ్లతో జట్టు బ్యాటింగ్ బలంగానే ఉన్నా బౌలింగ్ ఆందోళన కలిగిస్తోంది. ఉమ్రాన్ మాలిక్ నిలకడ ప్రదర్శించాల్సి ఉంది. భువనేశ్వర్ ప్రదర్శన కొంతకాలంగా పడిపోయింది. పేసర్ జాన్సెన్, స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఏ మేరకు రాణిస్తారన్నది చూడాలి. మరో పేసర్ నటరాజన్‌పై భారం పడుతోంది. నెదర్లాండ్స్‌తో వన్డే సిరీస్ కోసం స్వదేశంలో ఉండిపోయిన మార్‌క్రమ్ సోమవారం భారత్‌కు వస్తాడు. దీంతో తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను భువనేశ్వర్ నడిపించనున్నాడు. ఆదివారం ఉప్పల్‌లో రాజస్థాన్‌తో ఆ జట్టు తలపడుతుంది.
ముంబయి ఇండియన్స్‌తో రిలయన్స్ డిజిటల్ భాగస్వామ్యం
ముంబయి: ఐపీఎల్‌లో అత్యంత విజయంతమైన ముంబయి ఇండియన్స్‌తో రిలయన్స్ డిజిటల్ ఒప్పందం చేసుకుంది. 16వ సీజన్ కోసం అధికారిక భాగస్వామిగా ముంబయితో చేరింది. ఆటగాళ్ల కిట్లలో భాగమైన దుస్తుల (ట్రౌజర్స్) స్పాన్సర్‌గా రిలయన్స్ డిజిటల్ వ్యవహరించనుంది. ఈ భాగస్వామ్యం ద్వారా తమ వ్యాపారాన్ని పెంచుకోవాలనే లక్ష్యంతో ఆ సంస్థ ఉంది. ఈ సందర్భంగా రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌కు వచ్చే లేదా సామాజిక మాధ్యమాల్లో అనుసరించే అభిమానులకు ముంబయి ఇండియన్స్ జెర్సీ, మ్యాచ్ టికెట్లు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
74
ఈ సీజన్‌లో జరిగే మ్యాచ్‌లు. 58 రోజుల పాటు జరిగే ఈ సీజన్‌లో 18 రోజుల్లో రెండేసి చొప్పున మ్యాచ్‌లున్నాయి. మే 28న ఫైనల్ జరుగుతుంది.
12
ఈ సారి ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే వేదికలు. అహ్మదాబాద్, మొహాలి, లఖ్‌నవూ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీ, కోల్‌కతా, జైపుర్, ముంబయితో పాటు కొత్తగా గువాహాటి, ధర్మశాలలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
MS Dhoni: త్వరలో ఆస్పత్రిలో చేరనున్న ఎంఎస్ ధోనీ.. కారణం ఏంటంటే?
-
Sports News
సెల్ఫీ అడిగిన వ్యక్తినే పెళ్లాడనున్న స్టార్ ప్లేయర్..!
-
India News
Char Dham: చార్ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు.. ఉత్తరాఖండ్ పోలీసుల కీలక సూచన
-
World News
అవును.. నేను బైసెక్సువల్‌ను: అందాల భామ సంచలన ప్రకటన
-
Crime News
Andhra News: బాణసంచా గిడ్డంగిలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురి సజీవ దహనం
-
Sports News
IPL 2023 : కోట్లు పెట్టి కొన్నా.. కొట్టింది కొందరే..