Virat Kohli: బెంగళూరుకు చావోరేవో.. కోహ్లీపైనే అందరి దృష్టి

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కథ ముగిసింది. ఐపీఎల్‌-16లో పేలవ ప్రదర్శనతో ఆ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

Updated : 18 May 2023 07:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కథ ముగిసింది. ఐపీఎల్‌-16లో పేలవ ప్రదర్శనతో ఆ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడనున్న ఆ జట్టు.. మిగతా జట్ల అవకాశాలను ప్రభావితం చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అందులో మొదటగా సొంతగడ్డపై గురువారం బెంగళూరును ఢీకొననుంది. 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 6 ఓటములతో ఉన్న బెంగళూరుకు ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం అత్యావశ్యకం. ఓడినా ఆ జట్టు రేసులో ఉంటుంది కానీ.. ఆఖరి మ్యాచ్‌లో గెలవడంతో పాటు మిగతా జట్ల ఫలితాలు కలిసిరావాలి. గుజరాత్‌ టైటాన్స్‌ (18 పాయింట్లు) ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ (15), లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (15), ముంబయి ఇండియన్స్‌ (14) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ పరువు కోసం పోరాడనుండగా.. బెంగళూరుకు చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. తన తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌లపై నెగ్గాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో గెలుపు కోసం బెంగళూరు సర్వశక్తులు ఒడ్డుతుందనడంలో సందేహం లేదు. కెప్టెన్‌ డుప్లెసిస్‌.. స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు అతిపెద్ద సానుకూలాంశం. సీజన్‌లో అత్యధిక పరుగుల జాబితాలో టాప్‌-6లో ఇద్దరు బెంగళూరు బ్యాటర్లే. డుప్లెసిస్‌ (631 పరుగులు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. కోహ్లి (438) ఆరో స్థానంలో ఉన్నాడు. మ్యాక్స్‌వెల్‌ (384) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో అదరగొడుతున్నాడు. మిడిలార్డర్‌ కూడా గాడినపడితే బ్యాటింగ్‌లో బెంగళూరుకు తిరుగుండదు. గత మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై భారీ విజయం బెంగళూరులో స్ఫూర్తి నింపింది. ముఖ్యంగా బౌలర్లు పార్నెల్‌, సిరాజ్‌, మైకెల్‌ బ్రాస్‌వెల్‌, కర్ణ్‌శర్మ సమష్టిగా సత్తాచాటి రాజస్థాన్‌ను 59 పరుగులకే ఆలౌట్‌ చేయడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అదే జోరులో సన్‌రైజర్స్‌ను చిత్తుచేయాలని బెంగళూరు భావిస్తోంది. ఇక గురువారం విరాట్‌ కోహ్లి ఆడనుండటం హైదరాబాద్‌ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఉప్పల్‌ స్టేడియంలో లఖ్‌నవూతో సన్‌రైజర్స్‌ గత మ్యాచ్‌లో కోహ్లి లేకపోయినా.. అభిమానులు పెద్ద ఎత్తున అతనికి మద్దతుగా నిలిచారు. మ్యాచ్‌ ఆసాంతం కోహ్లి.. కోహ్లి అంటూ నినాదాలతో హోరెత్తించారు. గురువారం కోహ్లి స్వయంగా ఉప్పల్‌లో కనిపిస్తుండటంతో అభిమానం ఏ స్థాయిలో  ఉంటుందో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని