ఫైనల్లో ముచోవా, స్వైటెక్‌

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇగా స్వైటెక్‌, అన్‌సీడెడ్‌ కరోలినా ముచోవా ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌కు దూసుకెళ్లారు.

Published : 09 Jun 2023 05:05 IST

ఫ్రెంచ్‌  ఓపెన్‌

పారిస్‌: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇగా స్వైటెక్‌, అన్‌సీడెడ్‌ కరోలినా ముచోవా ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌కు దూసుకెళ్లారు. సెమీఫైనల్లో స్వైటెక్‌ (పొలెండ్‌) 6-2, 7-6 (9-7)తో బ్రెజిల్‌కు చెందిన 14వ సీడ్‌ హదద్‌ మయాను ఓడించింది. తొలి సెట్‌ తొలి గేమ్‌లోనే సర్వీసు కోల్పోయిన స్వైటెక్‌ ఆ తర్వాత చెలరేగిపోయింది. నాలుగు, ఆరు, ఎనిమిదో గేముల్లో బ్రేక్‌లతో సెట్‌ను చేజిక్కించుకుంది. రెండో సెట్‌ హోరాహోరీగా సాగింది. మయా అవకాశాలు సృష్టించుకున్నా.. చివరికి స్వైటెక్‌దే పైచేయి అయింది. మరో సెమీఫైనల్లో ముచోవా 7-6 (7-5), 6-7 (5-7), 7-5తో రెండో సీడ్‌ సబలెంక (బెలారస్‌)కు షాకిచ్చింది. ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్‌కు చేరుకోవడం ముచోవాకు ఇదే తొలిసారి. హోరాహోరీగా సాగిన పోరులో ముచోవా ఆరు ఏస్‌లు, 38 విన్నర్లు కొట్టింది. 53 అనవసర తప్పిదాలు, ఆరు డబుల్‌ ఫాల్ట్‌లతో సబలెంక దెబ్బతింది. ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు తలపడడంతో సెమీస్‌ రసవత్తరంగా సాగింది. ముచోవా 9వ గేమ్‌లో, సబలెంక పదో గేమ్‌లో బ్రేక్‌ సాధించడంతో తొలి సెట్‌ టైబ్రేక్‌కు దారితీసింది. అక్కడ ముచోవా పైచేయి సాధించింది. రెండో గేమ్‌ అంతే జోరుగా సాగింది. ఈసారి చెరో రెండు సార్లు బ్రేక్‌ సాధించారు. టైబ్రేక్‌లో సబలెంక నెగ్గడంతో మ్యాచ్‌ మూడో సెట్లోకి వెళ్లింది. మూడో సెట్లో సబలెంకే గెలిచేలా కనిపించింది. ఆరో గేమ్‌లో బ్రేక్‌ సాధించిన ఆమె ఆ తర్వాత సర్వీసులు నిబెట్టుకుంటూ 5-4తో ఆధిక్యంలోకి వెళ్లింది. పదో గేమ్‌లో సర్వీసు నిలబెట్టుకుంటే మ్యాచ్‌ను ముగించేదే. కానీ ముచోవా అద్భుతంగా పుంజుకుంది. ఆ గేమ్‌లో బ్రేక్‌ సాధించి, ఆ తర్వాత సర్వీసు నిలబెట్టుకుని 6-5తో నిలిచిన ఆమె.. 12వ గేమ్‌లో మరోసారి ప్రతర్థి సర్వీసును బ్రేక్‌ చేసి విజయాన్నందుకుంది.

కాటో జోడీకి మిక్స్‌డ్‌ టైటిల్‌: మియు కాటో (జపాన్‌), పుయెజ్‌ (జర్మనీ) జంట మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో ఈ ద్వయం 4-6, 6-4, 10-6తో బియాంకా (కెనడా), మైకెల్‌ (న్యూజిలాండ్‌) జంటపై గెలిచింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని