మనోడు ఎక్కడిదాకా?

ఆసియా కప్‌లో తలపడే భారత జట్టు ఎంపిక అనగానే.. గాయాల నుంచి కోలుకుంటున్న కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ పునరాగమనంపై ఎంత చర్చ జరిగిందో..

Updated : 22 Aug 2023 08:17 IST

సియా కప్‌లో తలపడే భారత జట్టు ఎంపిక అనగానే.. గాయాల నుంచి కోలుకుంటున్న కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ పునరాగమనంపై ఎంత చర్చ జరిగిందో.. అదే స్థాయిలో తిలక్‌ వర్మకు అవకాశం దక్కుతుందా అనే విషయమై ఆసక్తి నెలకొంది. నెల ముందు వరకూ తిలక్‌ అంటే.. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరపున   వరుసగా రెండు సీజన్లలో మెరిసిన ఆటగాడు, దేశవాళీల్లో హైదరాబాద్‌ తరపున సత్తాచాటుతున్న కుర్రాడు మాత్రమే. కానీ ఇప్పుడు తిలక్‌ అంటే.. ప్రపంచ క్రికెట్లో ఓ మెరుపు. వెస్టిండీస్‌తో పొట్టి సిరీస్‌లో అరంగేట్రం చేసి.. అద్భుతమైన బ్యాటింగ్‌ ప్రదర్శన కనబరిచాడు. 5 మ్యాచ్‌ల్లో 57.66 సగటుతో 173 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్‌రేట్‌ 140.65గా ఉంది. ఈ సిరీస్‌లో భారత్‌ తరపున అత్యధిక పరుగులు చేసింది అతనే. సాధించిన పరుగులను మించి అతని బ్యాటింగ్‌ తీరు ఎక్కువగా ఆకట్టుకుంది. క్రీజులో ఆత్మవిశ్వాసంతో కదులుతూ, అలవోకగా సిక్సర్లు కొడుతూ గొప్ప పరిణతి ప్రదర్శించాడు. దీంతో తిలక్‌ను ప్రపంచకప్‌లో ఆడించాలనే వాదన మొదలైంది. ఆ దిశగా ఈ నెల 30న ఆరంభమయ్యే ఆసియా కప్‌లో అతనికి చోటు దక్కింది. ఈ ఏడాది అక్టోబర్‌- నవంబర్‌లో భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా అదే ఫార్మాట్లో ఆసియా కప్‌ నిర్వహించనున్నారు. ఆసియా కప్‌తోనే ప్రపంచకప్‌లో ఆడే జట్టుపై తుది నిర్ణయానికి వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో మన తిలక్‌ ప్రయాణం ఎక్కడి వరకూ సాగుతుందనేది ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతానికి ఆసియా కప్‌కు 17 మంది ఆటగాళ్లలో ఒకడిగా తిలక్‌ను ఎంపిక చేశారు. కానీ తుది జట్టులో చోటు దక్కుతుందని మాత్రం కచ్చితంగా చెప్పలేం. కీలక ఆటగాళ్లైన శ్రేయస్‌, రాహుల్‌కు ప్రపంచకప్‌ ముందు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ ఉండేలా చూడాలన్నది టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రయత్నం. శ్రేయస్‌ పూర్తిగా కోలుకున్నాడని చెబుతున్నారు. ఒకవేళ ఫిట్‌నెస్‌ పరంగా శ్రేయస్‌, రాహుల్‌ ఇబ్బంది పడ్డా, లయ అందుకోవడంలో తడబడ్డా అప్పుడు తిలక్‌కు అవకాశం రావొచ్చు. ఆసియా కప్‌లో తిలక్‌నూ పరీక్షించే అవకాశాలు లేకపోలేదు. కానీ శ్రేయస్‌, రాహుల్‌ జట్టులో ఉండగా.. చోటు దక్కుతుందా అన్నది ప్రశ్న. ఇప్పుడు ప్రపంచకప్‌లో తిలక్‌ స్థానం.. శ్రేయస్‌, రాహుల్‌ ఫిట్‌నెస్‌, ఫామ్‌పై ఆధారపడి ఉందనడంలో సందేహం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని