Chess World Cup: టైబ్రేక్‌లోనే తాడోపేడో

ఓ వైపు చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడుతున్న పిన్న వయస్సు ఆటగాడిగా నిలిచిన 18 ఏళ్ల ప్రజ్ఞానంద! మరోవైపు అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ టైటిళ్లు దక్కించుకున్న మేటి ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సన్‌! ఈ ఇద్దరి మధ్య విజేత ఎవరో? ప్రపంచకప్‌ కిరీటాన్ని ధరించే కొత్త రాజు ఎవరో? నేడే తేలిపోనుంది.

Updated : 24 Aug 2023 14:20 IST

కార్ల్‌సన్‌తో ప్రజ్ఞానంద రెండో గేమ్‌ కూడా డ్రా
విజేత ఎవరో తేలేది నేడే
చెస్‌ ప్రపంచకప్‌

ఓ వైపు చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడుతున్న పిన్న వయస్సు ఆటగాడిగా నిలిచిన 18 ఏళ్ల ప్రజ్ఞానంద! మరోవైపు అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ టైటిళ్లు దక్కించుకున్న మేటి ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సన్‌! ఈ ఇద్దరి మధ్య విజేత ఎవరో? ప్రపంచకప్‌ కిరీటాన్ని ధరించే కొత్త రాజు ఎవరో? నేడే తేలిపోనుంది. ఈ ఇద్దరి మధ్య ప్రపంచకప్‌ ఫైనల్‌ సమరంలో వరుసగా రెండో గేమ్‌ కూడా డ్రా కావడంతో.. ఇక పోరు టైబ్రేక్‌కు మళ్లింది. ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ ఫార్మాట్లో సాగే ఈ టైబ్రేక్‌లో కార్ల్‌సన్‌కు ప్రజ్ఞానంద చెక్‌ పెట్టాలన్నది భారత అభిమానుల ఆకాంక్ష!

బాకు

అత్యంత ఆసక్తి రేపుతూ.. ఉత్కంఠభరితంగా సాగుతున్న చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ మరో మలుపు తీసుకుంది. టైటిల్‌ కోసం దిగ్గజం మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే)తో తలపడుతున్న భారత కుర్రాడు ప్రజ్ఞానంద.. వరుసగా రెండో గేమ్‌నూ డ్రాగా ముగించాడు. మంగళవారం వీళ్లిద్దరి మధ్య తొలి గేమ్‌ కూడా ఫలితం తేలకుండా ముగిసిన సంగతి తెలిసిందే. బుధవారం రెండో గేమ్‌ కూడా ఆరంభం నుంచి అదే బాటలో సాగింది. తెల్ల పావులతో ఆడిన ప్రపంచ నంబర్‌వన్‌ కార్ల్‌సన్‌ మొదటి నుంచి డ్రా దృష్టిలో పెట్టుకునే ఎత్తులు వేశాడు. మరోవైపు నల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద కూడా ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా జాగ్రత్తగా పావులు కదిపాడు. సెమీస్‌ తర్వాత కలుషిత ఆహారం కారణంగా అనారోగ్యం బారిన పడ్డానని చెప్పిన కార్ల్‌సన్‌.. పోరును టైబ్రేక్‌కు మళ్లించేందుకే ప్రయత్నించాడు. మరో రోజు ఆగితే మరింత శక్తి వస్తుందని, అప్పుడు పూర్తిస్థాయిలో తలపడొచ్చన్నది అతని ఆలోచన. ప్రజ్ఞానంద కూడా రక్షణాత్మకంగానే వ్యవహరించాడు. దీంతో 30 ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు పాయింట్లు పంచుకునేందుకు ఒప్పుకున్నారు. రెండు క్లాసికల్‌ గేమ్‌లు ముగిసిన తర్వాత ప్రజ్ఞానంద, కార్ల్‌సన్‌ 1-1తో సమానంగా ఉన్నారు. దీంతో గురువారం విజేతను నిర్ణయించేందుకు జరిగే టైబ్రేక్‌పై అందరి దృష్టి నెలకొంది. మరోవైపు మూడో స్థానం కోసం జరుగుతున్న పోరులో తొలి   గేమ్‌లో కరువానా (అమెరికా)పై అబసోవ్‌ (అజర్‌బైజాన్‌) గెలిచాడు.

టైబ్రేక్‌ ఇలా..: నాకౌట్‌ ఫార్మాట్లో జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో ప్రతి రౌండ్లోనూ మొదట రెండు క్లాసికల్‌ గేమ్‌లు నిర్వహించారు. ఇవి పూర్తయినా విజేత ఎవరో తేలకపోతే.. అప్పుడు టైబ్రేక్‌ అనివార్యమవుతోంది. టైబ్రేక్‌లో మొదట ర్యాపిడ్‌లో పోటీ నిర్వహిస్తారు. రౌండ్‌కు రెండు గేమ్‌లు చొప్పున రెండు రౌండ్లు పోటీ ఉంటుంది. తొలి రౌండ్లో ఫలితం వస్తే అక్కడితో పోటీ ఆపేసి విజేతను ప్రకటిస్తారు. ర్యాపిడ్‌ రౌండ్లు ముగిసినా ఆటగాళ్ల పాయింట్లు సమానంగా ఉంటే.. అప్పుడు ఒక్కో రౌండ్‌కు రెండు చొప్పున బ్లిట్జ్‌ గేమ్‌లు నిర్వహిస్తారు. రెండు రౌండ్లలో ఫలితం తేలకపోతే.. ఎవరో ఒకరు విజేతగా నిలిచేంతవరకూ బ్లిట్జ్‌ గేమ్‌లు కొనసాగిస్తారు.

‘‘టోర్నీ నిర్వాహకులు, ఫిడేతో పాటు నాకు చికిత్స అందించిన వైద్యులు, నర్సులకు కృతజ్ఞతలు. బుధవారం ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉంది. కానీ పోరాడేందుకు పూర్తి శక్తి లేదనిపించింది. అందుకే మరో రోజు విశ్రాంతి కావాలనుకున్నా. గురువారం పూర్తి శక్తి సాధిస్తానని ఆశిస్తున్నా. ప్రజ్ఞానంద ఇప్పటికే బలమైన ఆటగాళ్లతో చాలా టైబ్రేక్‌లు ఆడాడు. అతను బలమైన ఆటగాడని తెలుసు. నాకు మరింత శక్తి ఉండి, మంచి రోజు కలిసొస్తే కచ్చితంగా గెలిచే అవకాశాలుంటాయి’’

- కార్ల్‌సన్‌

‘‘కార్ల్‌సన్‌ వేగంగా డ్రా చేస్తాడని అనుకోలేదు. కానీ టైబ్రేక్‌ కోసమే అతనలా ఆడాడని అర్థమైంది. నాకూ ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ టోర్నీలో చాలా టైబ్రేక్‌లు ఆడి నేను కూడా కాస్త అలసిపోయా. గురువారం పోరులో పూర్తి స్థాయిలో పోరాడతా. మెదడును తాజాగా ఉంచుకుంటా. ఎక్కువ గేమ్‌లు ఆడడంతో పాటు తక్కువ సమయంలో స్పందించాల్సి ఉంటుందని తెలుసు. దేనికైనా సిద్ధంగా ఉండాలి. కార్ల్‌సన్‌ పూర్తి శక్తితో ఉన్నాడనిపించలేదు. అలాగే అనారోగ్యం సూచనలూ కనిపించలేదు. అతను కోలుకుంటాడని ఆశిస్తున్నా. అమ్మ నాతో పాటు అక్కకూ ఎప్పుడూ కొండంత అండగా ఉంటోంది’’

- ప్రజ్ఞానంద

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని