Asia Cup 2023: ఆ కప్‌పై కన్ను.. ఈ కప్‌లో పోరు
ఈ ఏడాది భారత్ ఆతిథ్యమిచ్చే వన్డే ప్రపంచకప్‌పైనే అందరి దృష్టి! అక్టోబర్ 5న మొదలయ్యే ఆ విశ్వ సమరం షెడ్యూల్ వచ్చేసింది.
ఆసియా కప్ మరో రెండు రోజుల్లో
ఈ ఏడాది భారత్ ఆతిథ్యమిచ్చే వన్డే ప్రపంచకప్‌పైనే అందరి దృష్టి! అక్టోబర్ 5న మొదలయ్యే ఆ విశ్వ సమరం షెడ్యూల్ వచ్చేసింది. టికెట్ల విక్రయాలూ ఆరంభమయ్యాయి. పోటీపడే దేశాలు తమ జట్లనూ ప్రకటించేస్తున్నాయి. స్వదేశంలో ఇప్పటికే ప్రపంచకప్ సందడి షురూ అయింది. కానీ అంతకంటే ముందు.. మరో ప్రతిష్ఠాత్మక టోర్నీకి తెరలేవనుంది. ఆసియాలో ఛాంపియన్‌గా నిలిచేందుకు ఆరు దేశాలు పోటీపడనున్నాయి. అదే.. ఆసియా కప్. బుధవారమే దీనికి తెరలేవనుంది. ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఈ టోర్నీని ఉపయోగించుకునేందుకు జట్లు సిద్ధమవుతున్నాయి.
ఈనాడు క్రీడా విభాగం
మరో రెండు రోజుల్లోనే ఆసియా కప్‌కు తెరలేవనుంది. ఇది 16వ ఆసియా కప్. 1984లో దీనికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించాలనుకున్నారు. కానీ వివిధ కారణాల వల్ల మధ్యలో ఒక్కోసారి అయిదు, నాలుగేళ్ల విరామం కూడా వచ్చింది. 2008 నుంచి మాత్రం ప్రతి రెండేళ్లకోసారి నిర్వహిస్తున్నారు. నిజానికి 2020లో శ్రీలంకలో, 2022లో పాకిస్థాన్‌లో ఈ టోర్నీ జరగాల్సింది. కానీ కరోనా కారణంగా 2020లో జరగాల్సింది 2022లో యూఏఈకి మారడంతో.. 2022లో జరగాల్సింది 2023కి మారింది. మొదట కేవలం వన్డే ఫార్మాట్లోనే ఈ టోర్నీ నిర్వహించేవాళ్లు. కానీ 2016 నుంచి ఐసీసీ ప్రపంచకప్‌లను దృష్టిలో పెట్టుకుని టీ20, వన్డేల్లో మార్చిమార్చి నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్లో ఆసియా కప్ జరగబోతుంది. చివరగా 2018లో వన్డే ఫార్మాట్లో టోర్నీ జరిగింది.
భారత్‌దే ఆధిపత్యం
ఆసియా కప్‌లో టీమ్‌ఇండియాదే ఆధిపత్యం. ఏడు టైటిళ్లతో అగ్రస్థానంలో ఉంది. ఆరు సార్లు విజేతగా నిలిచిన శ్రీలంక రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్ రెండు సార్లు కప్పు సొంతం చేసుకుంది. ఈ సారి డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో పాటు భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, నేపాల్ టైటిల్ కోసం బరిలో దిగుతున్నాయి. ఆసియా కప్‌లో ఆడబోతుండటం నేపాల్‌కిదే తొలిసారి. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ టోర్నీ జరుగుతుంది.
రెండు దేశాల్లో..
ఈ సారి ఆసియా కప్ మ్యాచ్‌లు పాకిస్థాన్, శ్రీలంకలో జరుగనున్నాయి. మ్యాచ్‌లాడేందుకు పాక్ వెళ్లమని భారత్ స్పష్టం చేయడంతో ఈ టోర్నీ చరిత్రలోనే తొలిసారిగా హైబ్రిడ్ విధానంలో రెండు దేశాల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. అధికారిక ఆతిథ్య హోదాలో ఉండే పాక్‌లో 4 మ్యాచ్‌లు, శ్రీలంకలో భారత్ ఆడేవి సహా 9 మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రూప్- ఎలో భారత్, పాకిస్థాన్, నేపాల్.. గ్రూప్- బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ ఉన్నాయి. మొదట ఒక్కో జట్టు గ్రూప్ దశలోని ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతి గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-4 ఆడతాయి. ఎలాగో గ్రూప్- ఎ నుంచి పాకిస్థాన్ (ఏ1), భారత్ (ఏ2), గ్రూప్- బి నుంచి శ్రీలంక (బి1), బంగ్లాదేశ్ (బి2) ముందంజ వేస్తాయనే ఉద్దేశంతో ఈ జట్లకు సీడింగ్ ఇచ్చారు. ఒకవేళ అఫ్గాన్ ముందంజ వేస్తే.. బంగ్లా, లంకలో నిష్క్రమించే ఒక జట్టును అది భర్తీ చేస్తుంది. సూపర్-4లో ఒక్కో జట్టు మిగతా మూడు జట్లతో ఒక్క మ్యాచ్ ఆడుతుంది. టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్ చేరతాయి.
అందరి కళ్లు
ఆసియా కప్ అనగానే అందరి కళ్లు భారత్, పాక్ పోరు మీదే ఉంటాయనడంలో సందేహం లేదు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ రెండు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడని సంగతి తెలిసిందే. అందుకే ఆసియా కప్, ప్రపంచకప్ వచ్చిందంటే ఈ దాయాది దేశాల మధ్య మ్యాచ్‌పైనే అమితాసక్తి ఉంటుంది. ఈ సారి ఆసియా కప్‌లో ఈ రెండు జట్లు మూడు సార్లు తలపడే అవకాశముంది. మొదట గ్రూప్ దశలో, ఆ తర్వాత సూపర్-4 దశలో ఆడటమైతే ఖాయమే! ఫైనల్ చేరితే మరోసారి తలపడతాయి. సెప్టెంబర్ 2న ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది.
7
ఆసియా కప్‌లో అత్యధిక టైటిళ్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్ సాధించిన విజయాలు. 1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018లో భారత్ విజేతగా నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Gandhi Jayanti: మహాత్ముడి బోధనలు.. మన మార్గాన్ని వెలిగించాయి: గాంధీజీకి ప్రముఖుల నివాళి
-
Trudeau- Elon Musk: ట్రూడో మీకిది సిగ్గుచేటు.. విరుచుకుపడ్డ ఎలాన్ మస్క్
-
Upcoming Movies: ఈ వారం థియేటర్లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీ చిత్రాలివే!
-
Art of living: వాషింగ్టన్ డీసీలో మార్మోగిన శాంతి మంత్రం
-
NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు
-
Eluru: యువకుడి చేతిలో దాడికి గురైన కానిస్టేబుల్ మృతి