BAN vs SL - Asia Cup 2023: తడబడ్డాకొట్టేశారు

ఆసియాకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ శ్రీలంకతో మ్యాచ్‌లో స్లో పిచ్‌పై మొదట బంగ్లా అతి కష్టం మీద 164 పరుగులు చేసింది. ఈ చిన్న స్కోరును ఛేదించడానికి లంక బాగా ఇబ్బంది పడింది.

Updated : 01 Sep 2023 08:04 IST

బంగ్లాపై లంక గెలుపు
మెరిసిన అసలంక, సమరవిక్రమ
సత్తా చాటిన పతిరన, తీక్షణ

ఆసియాకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ శ్రీలంకతో మ్యాచ్‌లో స్లో పిచ్‌పై మొదట బంగ్లా అతి కష్టం మీద 164 పరుగులు చేసింది. ఈ చిన్న స్కోరును ఛేదించడానికి లంక బాగా ఇబ్బంది పడింది. ఒక దశలో కుప్పకూలుతుందా అనిపించింది. కానీ అసలంక, సమరవిక్రమ పోరాటంతో నిలిచి గెలిచిన ఆ జట్టు టోర్నీలో బోణీ కొట్టింది. ఇది లంకకు వన్డేల్లో వరుసగా పదకొండో విజయం కావడం విశేషం.

పల్లెకెలె : వన్డే ఫార్మాట్లో ఇప్పటికే వరుసగా పది విజయాలు సాధించిన శ్రీలంక.. ఆసియా కప్‌లోనూ శుభారంభం చేసింది. గురువారం గ్రూప్‌-బి మ్యాచ్‌లో లంక 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. మొదట ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పతిరన (4/32), తీక్షణ (2/19) దెబ్బకు బంగ్లా 164కే ఆలౌటైంది. నజ్ముల్‌  శాంటో (89; 122 బంతుల్లో 7×4) టాప్‌స్కోరర్‌.లంక 39 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. అసలంక (62 నాటౌట్‌; 92 బంతుల్లో 5×4, 1×6), సమరవిక్రమ (54; 77 బంతుల్లో 6×4) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

వాళ్లిద్దరూ నిలిచారు: లక్ష్యం చిన్నదే అయినా లంక ఆట కూడా బంగ్లా ఇన్నింగ్స్‌నే తలపించింది. బంతి బ్యాట్‌పైకి రాకపోవడంతో అనవసర షాట్లకు పోయిన ఆ జట్టు బ్యాటర్లు వికెట్లు పారేసుకున్నారు. దీంతో 9.2 ఓవర్లలో 43/3తో లంక ఇబ్బందుల్లో పడిపోయింది. ఈ స్థితిలో అసలంక, సమరవిక్రమ జోడీ నిలిచింది. క్రీజులో కుదురుకోవడానికి సమయం తీసుకున్న ఈ ద్వయం.. నెమ్మదిగా జోరు పెంచింది. వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీని తరలించి స్కోరు కరిగించింది. ముఖ్యంగా పుల్‌, స్వీప్‌ షాట్లతో పరుగులు రాబట్టిన అసలంక.. మెహదీ హసన్‌ బౌలింగ్‌లో డీప్‌లో ఓ మెరుపు సిక్స్‌ కూడా బాదాడు. అయితే లక్ష్యానికి సమీపంగా ఉన్నప్పుడు సమరవిక్రమతో పాటు ధనంజయ (2) వికెట్లు పడినా.. కెప్టెన్‌ శానక (14 నాటౌట్‌)తో కలిసి అసలంక మరో వికెట్‌ పడకుండా జట్టును గెలిపించాడు. బంగ్లా బౌలర్లలో షకిబ్‌ (2/29) రాణించాడు.

బంగ్లా కట్టడి: అంతకుముందు బంతి నెమ్మదిగా కదులుతున్న పిచ్‌పై టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ బాగా ఇబ్బంది పడింది. పతిరన, తీక్షణ కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగులు చేయలేకపోగా.. వికెట్లు కూడా చేజార్చుకుంది. 12 ఓవర్లకు బంగ్లా చేసింది 43 పరుగులే. పైగా 3 వికెట్లు కోల్పోయింది. దీనికి తోడు వర్షం అంతరాయం కలిగించిన తర్వాత పిచ్‌ బ్యాటింగ్‌కు మరింత క్లిష్టంగా మారింది. ఈ స్థితిలో నజ్ముల్‌ శాంటో నిలిచాడు. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ దాటిస్తూ రన్‌రేట్‌ పడిపోకుండా చూశాడు. కానీ వికెట్ల పతనం మాత్రం ఆగలేదు. తౌహిద్‌ (20) తప్ప ఎవరూ శాంటోకు పెద్దగా సహకారం అందించలేదు. దీంతో 41 ఓవర్లకు 162/7తో నిలిచిన బంగ్లా.. ఓవర్‌ తేడాతో శాంటోతో పాటు తస్కిన్‌ (0), ముస్తాఫిజుర్‌ (0) వికెట్లు కోల్పోయి అనుకున్న దానికంటే తక్కువ స్కోరుకే ఆలౌటైంది.
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: నయీం (సి) నిశాంక (బి) ధనంజయ 16; తంజిద్‌ ఎల్బీ (బి) తీక్షణ 0; నజ్ముల్‌ శాంటో (బి) తీక్షణ 89; షకిబ్‌ (సి) కుశాల్‌ (బి) పతిరన 5; తౌహిద్‌ ఎల్బీ (భి) శానక 20; ముష్ఫికర్‌ (సి) కరుణరత్నే (బి) పతిరన 13; మిరాజ్‌ రనౌట్‌ 5; మెహదీ హసన్‌ ఎల్బీ (బి) వెల్లలాగె 6; తస్కిన్‌ (సి) తీక్షణ (బి) పతిరన 0; షోరిఫుల్‌ నాటౌట్‌ 2; ముస్తాఫిజుర్‌ ఎల్బీ (బి) పతిరన 0; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (42.4 ఓవర్లలో ఆలౌట్‌) 164; వికెట్ల పతనం: 1-4, 2-25, 3-36, 4-95, 5-127, 6-141, 7-162, 8-162, 9-164; బౌలింగ్‌: రజిత 7-0-29-0; తీక్షణ 8-1-19-2; ధనంజయ 10-0-35-1; పతిరన 7.4-0-32-4; వెల్లలాగె 7-0-30-1; శానక 3-0-16-1

శ్రీలంక ఇన్నింగ్స్‌: నిశాంక (సి) ముష్ఫికర్‌ (బి) షోరిఫుల్‌ 14; కరుణరత్నే (బి) తస్కిన్‌ 1; కుశాల్‌ మెండిస్‌ (బి) షకిబ్‌ 5; సమరవిక్రమ (స్టంప్డ్‌) ముష్ఫికర్‌ (బి) మెహదీ హసన్‌ 54; అసలంక నాటౌట్‌ 62; ధనంజయ డిసిల్వా (బి) షకిబ్‌ 2; శానక నాటౌట్‌ 14; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (39 ఓవర్లలో 5 వికెట్లకు) 165; వికెట్ల పతనం: 1-13, 2-15, 3-43, 4-121, 5-128; బౌలింగ్‌: తస్కిన్‌ అహ్మద్‌ 7-1-34-1; షోరిఫుల్‌ ఇస్లాం 4-0-23-1; షకిబ్‌ 10-2-29-2; ముస్తాఫిజుర్‌ 3-0-12-0; మిరాజ్‌ 5-0-26-0; మెహదీ హసన్‌ 10-0-35-1

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని