IND vs AFG: మహా సమరానికి ముందు మినీ పోరు

ఆస్ట్రేలియాతో ఆరంభ పోరులో కొంచెం కష్టపడ్డప్పటికీ.. విజయం మాత్రమే రోహిత్‌ సేనదే. ఎన్నో ఆశలతో, అంచనాలతో ప్రపంచకప్‌లో అడుగు పెట్టిన భారత జట్టుకు ఈ మ్యాచ్‌ ఒక పాఠమే.

Updated : 11 Oct 2023 08:07 IST

నేడు అఫ్గాన్‌తో భారత్‌ ఢీ
గాడిన పడతారా?
మధ్యాహ్నం 2 నుంచి

దిల్లీ

ఆస్ట్రేలియాతో ఆరంభ పోరులో కొంచెం కష్టపడ్డప్పటికీ.. విజయం మాత్రమే రోహిత్‌ సేనదే. ఎన్నో ఆశలతో, అంచనాలతో ప్రపంచకప్‌లో అడుగు పెట్టిన భారత జట్టుకు ఈ మ్యాచ్‌ ఒక పాఠమే. దీని తర్వాత అందరి దృష్టీ నిలిచి ఉన్నది పాకిస్థాన్‌ పోరు మీదే. ప్రపంచకప్‌కే ఆకర్షణ కానున్న ఆ పోరుకు ముందు భారత్‌ చిన్న జట్టు అఫ్గానిస్థాన్‌తో తలపడబోతోంది. శనివారం జరిగే మహా పోరుకు ముందు టీమ్‌ఇండియాకిది ప్రాక్టీస్‌ మ్యాచ్‌ లాంటిదనే చెప్పొచ్చు. బ్యాటర్లు, బౌలర్లు అందరూ గాడిన పడటానికి ఈ మ్యాచ్‌ మంచి అవకాశం.

ప్రపంచకప్‌ను విజయంతో ఆరంభించిన టీమ్‌ఇండియా.. తర్వాతి పోరుకు సిద్ధమైంది. బుధవారం రోహిత్‌ సేన.. అఫ్గానిస్థాన్‌ను ఢీకొనబోతోంది. తొలి మ్యాచ్‌లో నెగ్గినప్పటికీ టాప్‌ఆర్డర్‌ ఘోర వైఫల్యం భారత్‌ను కలవరపెట్టిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌తో కీలక మ్యాచ్‌ నేపథ్యంలో బ్యాటర్లందరూ గాడిన పడటానికి అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌ను ఉపయోగించుకుంటారని జట్టు ఆశిస్తోంది. దిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం పిచ్‌ బ్యాటింగ్‌కు పూర్తి అనుకూలం కాబట్టి మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశముంది.


సీస్‌తో మ్యాచ్‌లో ఘోరమైన ప్రదర్శన చేసిన ముగ్గురు బ్యాటర్ల మీదే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టీ నిలిచి ఉంటుందనడంలో సందేహం లేదు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌లతో పాటు నాలుగో నంబర్‌ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ ఆ మ్యాచ్‌లో డకౌటయ్యారు. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఈ ముగ్గురూ అలా ఆడటం అభిమానులను నిరాశపరిచింది. డెంగీ జ్వరంతో బాధ పడుతున్న శుభ్‌మన్‌ ఈ మ్యాచ్‌కూ అందుబాటులో ఉండడు కాబట్టి ఇషానే రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నాడు. అతను ఓ మంచి ఇన్నింగ్స్‌ ఆడాలని జట్టు కోరుకుంటోంది. రోహిత్‌ ఈ మ్యాచ్‌లో పెద్ద ఇన్నింగ్స్‌ ఆడి పాక్‌తో మ్యాచ్‌ ముంగిట లయ అందుకోవాల్సి ఉంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో సెంచరీ సాధించినప్పటికీ.. అసలు టోర్నీలోకి వచ్చేసరికి శ్రేయస్‌ పేలవంగా ఆడి వెనుదిరిగాడు. అతను కూడా ఫామ్‌ చాటాల్సి ఉంది. ఇక ఆసీస్‌పై గొప్పగా పోరాడి జట్టును గెలిపించిన రాహుల్‌, కోహ్లి ఈ మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. హార్దిక్‌, జడేజాలకు ఎక్కువసేపు ఆడే అవకాశం ప్రధాన బ్యాటర్లు ఇస్తారా అన్నది చూడాలి. బౌలింగ్‌లో స్పిన్నర్ల మీద ఎక్కువ అంచనాలున్నాయి. దిల్లీ పిచ్‌ వారికే అనుకూలం కాబట్టి జడేజా, కుల్‌దీప్‌ల నుంచి మరోసారి ఉత్తమ ప్రదర్శన ఆశించవచ్చు. పిచ్‌ను అనుసరించి మూడో స్పిన్నర్‌గా అశ్విన్‌ను ఆడించే అవకాశాలే ఎక్కువ. లేదంటే బుమ్రా, సిరాజ్‌లకు తోడుగా షమి, శార్దూల్‌ల్లో ఒకరిని ఎంచుకోవచ్చు.


కొంచెం జాగ్రత్తగా..

టీమ్‌ఇండియా ముందు.. అఫ్గానిస్థాన్‌ చిన్న జట్టే అయినా మరీ తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ముఖ్యంగా ఆ జట్టు బౌలర్లు స్టార్‌ బ్యాటర్లను కూడా ఇబ్బంది పెట్టగలరు. రషీద్‌ ఖాన్‌ సత్తా ఏంటో భారత ఆటగాళ్లకు తెలియంది కాదు. ఇంకా ముజీబ్‌, ఫారూఖీల రూపంలో ప్రమాదకర బౌలర్లున్నారు అఫ్గాన్‌కు. బ్యాటింగ్‌లో గుర్బాజ్‌ దూకుడుగా ఆడి బౌలర్ల లయను దెబ్బ తీయాలని చూస్తాడు. ఇబ్రహీం జాద్రాన్‌ ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్నాడు. నబి లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్‌ సేవలూ అఫ్గాన్‌కు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అఫ్గాన్‌తో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే.


దిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం బ్యాటింగ్‌కు  అనుకూలం. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే ఇక్కడ ఓ మ్యాచ్‌ జరగ్గా.. అందులో దక్షిణాఫ్రికా ఏకంగా 428 పరుగులతో రికార్డు నెలకొల్పింది. తర్వాత శ్రీలంక కూడా 300 పైచిలుకు స్కోరు చేసింది. కాబట్టి టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేస్తే భారత్‌ నుంచి కూడా భారీ స్కోరు ఆశించవచ్చు. ఇక్కడి పిచ్‌ స్పిన్నర్లకూ సహకరిస్తుంది.


తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), ఇషాన్‌, కోహ్లి, శ్రేయస్‌, రాహుల్‌, హార్దిక్‌, జడేజా, కుల్‌దీప్‌, అశ్విన్‌/షమి, బుమ్రా, సిరాజ్‌.

అఫ్గానిస్థాన్‌: గుర్బాజ్‌, ఇబ్రహీం జాద్రాన్‌, హష్మతుల్లా (కెప్టెన్‌), రహ్మత్‌ షా, నజీబుల్లా జాద్రాన్‌, నబి, అజ్మతుల్లా, రషీద్‌, ముజీబ్‌, ఫారూఖీ, నవీనుల్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని