India vs Afghanistan: సిరీస్‌ పట్టేయాలని

ఊహించినట్లుగానే తొలి టీ20లో అఫ్గానిస్థాన్‌ను చిత్తుచేసింది టీమ్‌ఇండియా. ఇప్పుడు రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ పట్టేయడం పెద్ద కష్టమేమీ కాదు.

Updated : 14 Jan 2024 07:56 IST

నేడు అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20
 కోహ్లీపైనే కళ్లన్నీ
రాత్రి 7 గంటల నుంచి

ఊహించినట్లుగానే తొలి టీ20లో అఫ్గానిస్థాన్‌ను చిత్తుచేసింది టీమ్‌ఇండియా. ఇప్పుడు రెండో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ పట్టేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ కోహ్లి పునరాగమనం.. బ్యాటింగ్‌లో రోహిత్‌ మెరుపులను ఆదివారం జరిగే మ్యాచ్‌లో అభిమానులు చూడాలనుకుంటున్నారు. అందుకే ఈ మ్యాచ్‌పై ఆసక్తి రేకెత్తుతోంది. మరోవైపు సిరీస్‌ ఆశలు నిలవాలంటే అఫ్గాన్‌ శక్తికి మించి పోరాడాల్సిందే.

ఇందౌర్‌

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమ్‌ఇండియా చివరిగా ఆడుతున్న పొట్టి సిరీస్‌లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌పై కన్నేసిన టీమ్‌ఇండియా (India vs Afghanistan) ఆదివారం విజయమే లక్ష్యంగా బరిలో దిగుతోంది. ఈ రెండో మ్యాచ్‌లో గెలిచి మరో పోరు మిగిలి ఉండగానే సిరీస్‌ సొంతం చేసుకోవాలని రోహిత్‌ సేన చూస్తోంది. 14 నెలల తర్వాత తిరిగి టీ20 జట్టులోకి వచ్చిన రోహిత్‌, కోహ్లి ఈ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారిన సంగతి తెలిసిందే. తొలి టీ20లో రోహిత్‌ నాయకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నా బ్యాటింగ్‌లో పరుగులు చేయలేకపోయాడు. ఇక ఆ మ్యాచ్‌కు దూరంగా ఉన్న కోహ్లి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాడు.

కలిసొచ్చిన జట్టుపై: 2022 టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఈ ఫార్మాట్లో తొలి టీ20 ఆడేందుకు కోహ్లి సిద్ధమయ్యాడు. తనకు అచ్చొచ్చిన అఫ్గాన్‌పై చెలరేగి ఘనంగా పునరాగమనం చేయాలని విరాట్‌ చూస్తున్నాడు. 2022లో టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్‌లో అఫ్గాన్‌పైనే శతకంతో కోహ్లి సుదీర్ఘ సెంచరీ నిరీక్షణకు ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే ప్రత్యర్థిపై రాణించి.. జట్టులో తన ఎంపిక సరైందేనని చాటాలని కోహ్లి ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే కోహ్లి రాకతో హైదరాబాద్‌ కుర్రాడు తిలక్‌ వర్మ బెంచ్‌కే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కెరీర్‌ను గొప్పగా ఆరంభించిన తిలక్‌ ఆ తర్వాత తడబడుతున్నాడు. గత 13 ఇన్నింగ్స్‌లో అతను ఒక్క అర్ధసెంచరీ కూడా చేయలేదు. యశస్వి జైస్వాల్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తే శుభ్‌మన్‌ కూడా బయటే ఉండాల్సి వస్తుంది.

దూబెపై దృష్టి: తొలి టీ20లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శివమ్‌ దూబెపై మరోసారి అందరి దృష్టి ఉంటుందనడంలో సందేహం లేదు. హార్దిక్‌ గైర్హాజరీలో పేస్‌ ఆల్‌రౌండర్‌ స్థానాన్ని భర్తీ చేసేలా కనిపిస్తున్న దూబె నిలకడ కొనసాగించాల్సి ఉంది. ఇక గాయంతో వన్డే ప్రపంచకప్‌కు దూరమైన అక్షర్‌ పటేల్‌.. ఈ ఏడాది మాత్రం టీ20 ప్రపంచకప్‌లో ఆడాలనే పట్టుదల ప్రదర్శిస్తున్నాడు. ఆ దిశగా ప్రతి మ్యాచ్‌ అతనికి కీలకమే. తొలి టీ20లో పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు రెండు వికెట్లతో రాణించిన అక్షర్‌ ఈ మ్యాచ్‌లోనూ ఫామ్‌ కొనసాగించాల్సి ఉంది. గత మ్యాచ్‌లో సుందర్‌్ వికెట్ల వేటలో విఫలమయ్యాడు. 3 ఓవర్లలో 27 పరుగులిచ్చి ఒక్క వికెట్టూ తీయలేకపోయిన అతని మరో అవకాశం వస్తుందని కచ్చితంగా చెప్పలేం. అతని స్థానంలో కుల్‌దీప్‌ను ఆడించే ఆస్కారముంది. మరోవైపు యువ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ కూడా 11కు పైగా ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకున్నాడు. తన సొంత మైదానంలో అవేశ్‌ను ఆడించాలని అనుకుంటే బిష్ణోయ్‌ను డగౌట్‌కే పరిమితం చేయొచ్చు. భారత ఫీల్డింగ్‌ మాత్రం మరింత మెరుగుపడాల్సి ఉంది.

పుంజుకోవాలని: తొలి టీ20ల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేసిన అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌ సాంతం తీవ్రత కొనసాగించలేకపోయింది. మంచి ఆరంభం దక్కినా.. మధ్యలో నబి చెలరేగినా భారీ స్కోరు సాధించలేకపోయింది.ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో మరింత మెరుగ్గా రాణించి, పుంజుకోవాలని ఆ జట్టు చూస్తోంది.

తుది జట్లు (అంచనా)... భారత్‌: రోహిత్‌, శుభ్‌మన్‌/యశస్వి, కోహ్లి, శివమ్‌ దూబె, జితేశ్‌, రింకు సింగ్‌, అక్షర్‌, సుందర్‌/కుల్‌దీప్‌, రవి బిష్ణోయ్‌/అవేశ్‌, అర్ష్‌దీప్‌, ముకేశ్‌.

అఫ్గానిస్థాన్‌: గుర్బాజ్‌, ఇబ్రహీం జద్రాన్‌, రహ్మత్‌ షా, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, నజీబుల్లా జద్రాన్‌, మహమ్మద్‌ నబి, గుల్బాదిన్‌ నయీబ్‌, కరీం జనాత్‌, ఫజల్‌ ఫరూఖీ, నవీనుల్‌ హక్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌.


పరుగులే పరుగులు

ఇందౌర్‌లోని హోల్కర్‌ స్టేడియంను బ్యాటింగ్‌ స్వర్గధామం అని చెప్పొచ్చు. ఫ్లాట్‌గా ఉండే వికెట్‌, చిన్న బౌండరీల కారణంగా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 210గా ఉండటం విశేషం. ఇక్కడ మూడు టీ20లు ఆడిన భారత్‌ రెండు గెలిచి, ఒకటి ఓడిపోయింది. మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లు రెండు సార్లు నెగ్గగా, ఛేదన జట్టు ఓ సారి విజయం సొంతం చేసుకుంది. మంచు ప్రభావం దృష్ట్యా టాస్‌ గెలిస్తే ఛేదనకే మొగ్గు చూపే ఆస్కారముంది.


40

స్వదేశంలో 12 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన అయిదో ఆటగాడిగా నిలిచేందుకు కోహ్లికి కావాల్సిన పరుగులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని