India vs England: తిరగబడింది

231 పరుగుల లక్ష్యం.. అశ్విన్‌తో కలిపి 9 మంది బ్యాటర్లున్న భారత్‌ కచ్చితంగా గెలుస్తుందని.. నాలుగో రోజు రెండు సెషన్లలోనే మ్యాచ్‌ ముగిస్తుందనే అంచనాలు. అనుకున్నట్లే మ్యాచ్‌ ముగిసింది. కానీ విజేత భారత్‌ కాదు.. ఇంగ్లాండ్‌!

Updated : 29 Jan 2024 07:07 IST

తొలి టెస్టులో టీమ్‌ఇండియా పరాజయం
స్పిన్‌కు దాసోహమన్న ఆతిథ్య జట్టు
7 వికెట్లతో తిప్పేసిన హార్ట్‌లీ

231 పరుగుల లక్ష్యం.. అశ్విన్‌తో కలిపి 9 మంది బ్యాటర్లున్న భారత్‌ కచ్చితంగా గెలుస్తుందని.. నాలుగో రోజు రెండు సెషన్లలోనే మ్యాచ్‌ ముగిస్తుందనే అంచనాలు. అనుకున్నట్లే మ్యాచ్‌ ముగిసింది. కానీ విజేత భారత్‌ కాదు.. ఇంగ్లాండ్‌! అవును.. ప్రతికూల పరిస్థితుల నుంచి బజ్‌బాల్‌ ఆటతీరుతో గర్జించిన ఇంగ్లిష్‌ జట్టు సంచలన విజయాన్ని అందుకోగా.. 190 పరుగుల ఆధిక్యం దక్కించుకున్నా గెలుపు అవకాశాలను చేజార్చుకుని టీమ్‌ఇండియా ఓటమి వైపు నిలిచింది.

స్పిన్‌ ఆడటంలో అనుభవమే లేనట్లు అరంగేట్ర స్పిన్నర్‌ హార్ట్‌లీకి మన బ్యాటర్లు దాసోహమన్నారు. మరో రోజు ఆట మిగిలి ఉందనే విషయాన్ని మర్చిపోయి.. తొందరపాటుతో ఓటమిని కొని తెచ్చుకున్నారు. ఉప్పల్‌లో టెస్టుల్లో అజేయ రికార్డును చేజేతులా కోల్పోయింది టీమ్‌ఇండియా.

ఈనాడు - హైదరాబాద్‌

ప్పల్‌లో భారత్‌కు షాక్‌. ఇక్కడ టీమ్‌ఇండియా (India vs EnglandIndia vs England) తొలిసారి టెస్టుల్లో ఓడింది. ఆదివారం నాటకీయ పరిణామాల మధ్య ముగిసిన మొదటి టెస్టులో ఆ జట్టు 28 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ చేతిలో పరాజయం పాలైంది. తన తొలి టెస్టు ఆడిన స్పిన్నర్‌ టామ్‌ హార్ట్‌లీ (7/62) దెబ్బకు 231 పరుగుల ఛేదనలో భారత్‌ 202 పరుగులకే కుప్పకూలింది. రోహిత్‌ (39) టాప్‌స్కోరర్‌. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 316/6తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌ 420 పరుగులకు ఆలౌటైంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పోప్‌ (196; 278 బంతుల్లో 21×4) ద్విశతకానికి నాలుగు పరుగుల దూరంలో ఆగిపోయాడు. అతని వల్ల ఇంగ్లాండ్‌ 6, 7, 8 వికెట్లకు కలిపి 256 పరుగులు జత చేయడం విశేషం. భారత బౌలర్లలో బుమ్రా (4/41), అశ్విన్‌ (3/126) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 246, భారత్‌ 436 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. నాలుగో రోజు కోటా ఓవర్లు పూర్తి చేయడం కోసం అరగంట, ఫలితం వచ్చే అవకాశం ఉండటంతో మరో అరగంట ఆటను పొడిగించారు. అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా రెండో టెస్టు వచ్చే నెల 2న విశాఖపట్నంలో ఆరంభమవుతుంది.

తిప్పేశాడు..: ఉప్పల్‌లో టెస్టుల్లో ఇప్పటివరకూ విజయవంతమైన లక్ష్యఛేదన 72 పరుగులే. అయినా రెండు రోజులు కలిపి అయిదు సెషన్ల ఆట మిగిలి ఉండటంతో బ్యాటింగ్‌ లోతు ఎక్కువగా ఉన్న భారత్‌ 200కు పైగా లక్ష్యాన్ని చేరుకుంటుందనిపించింది. కానీ భారత స్పిన్నర్ల కంటే మెరుగ్గా పరిస్థితులను, పిచ్‌ను ఉపయోగించుకున్న హార్ట్‌లీ విజృంభించాడు. ప్రతి బంతికీ బ్యాటర్లను పరీక్షించాడు. స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కోవడానికి స్వీప్‌ సరైన అస్త్రమని చాటిన పోప్‌ బాటలోనే రోహిత్‌ సాగాడు. స్వీప్‌, రివర్స్‌ స్వీప్‌తో బౌండరీలు రాబట్టాడు. కానీ హార్ట్‌లీ ఒకే ఓవర్లో యశస్వి (15), శుభ్‌మన్‌ (0)ను ఔట్‌ చేసి షాకిచ్చాడు. లీచ్‌ ఓవర్లో రివర్స్‌ స్వీప్‌తో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన రోహిత్‌.. ఇలాగే ఆడితే చాలు అనుకునే సమయంలో అతణ్ని ఎల్బీగా హార్ట్‌లీ వెనక్కిపంపాడు. దీంతో జట్టు 42/0 నుంచి 63/3తో కష్టాల్లో పడింది. ఆ దశలో అక్షర్‌ (17)తో కలిసి రాహుల్‌ (22) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.

నిలబడలేక..: చేతిలో ఏడు వికెట్లు.. మరో 136 పరుగులు చేస్తే చాలు.. ఇదీ మూడో సెషన్‌కు ముందు భారత పరిస్థితి. కానీ చివరి సెషన్లో హార్ట్‌లీ స్పిన్‌తో కథ తారుమారైంది. హార్ట్‌లీకి రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి అక్షర్‌ వెనుదిరిగాడు. అప్పటివరకూ పట్టుదల ప్రదర్శించిన కేఎల్‌ రాహుల్‌ను రూట్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. స్టోక్స్‌ అద్భుతమైన ఫీల్డింగ్‌తో జడేజా (2) రనౌట్‌గా నిష్క్రమించాడు. ఆ వెంటనే లీచ్‌ బౌలింగ్‌లో బద్దకంగా ఆడిన శ్రేయస్‌ (13) స్లిప్‌లో రూట్‌ చేతికి చిక్కాడు. 24 పరుగుల తేడాతో నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్‌ 119/7తో ఓటమి వైపు సాగింది. పీకల్లోతు కష్టాల్లో మునిగిన టీమ్‌ఇండియాను భరత్‌ (28), అశ్విన్‌ (28) ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరూ అద్భుత పోరాట పటిమ ప్రదర్శించారు. ఒక్కో పరుగు జత చేస్తూ, ఒక్కో బౌండరీ సాధిస్తూ సాగారు. ఈ ఇద్దరి భాగస్వామ్యం కూడా 50 దాటింది. కానీ వేగంగా ఆడాలనే ప్రయత్నంలో వికెట్లు కోల్పోయారు. హార్ట్‌లీనే వరుస ఓవర్లలో భరత్‌, అశ్విన్‌ను ఔట్‌ చేసి టీమ్‌ఇండియాకు ఓటమి మిగిల్చాడు. ఆఖర్లో సిరాజ్‌ (12) ఆశలు రేపినా.. నాలుగో రోజు చివరి ఓవర్లో స్టంపౌట్‌ కావడంతో మ్యాచ్‌ ముగిసింది.

మరో 104..: అంతకుముందు ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో మిగిలిన నాలుగు వికెట్లు పడగొట్టేందుకు భారత బౌలర్లు ఆపసోపాలు పడ్డారు. పోప్‌ (ఓవర్‌నైట్‌ స్కోరు 148)కు అడ్డుకట్ట వేయలేకపోయారు. నాలుగో రోజు 25.1 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్‌ మరో 104 పరుగులు చేసింది. పాతబడ్డ బంతితో రివర్స్‌ స్వింగ్‌ రాబట్టిన బుమ్రా.. రెహాన్‌ (28; ఓవర్‌నైట్‌ స్కోరు 16)ను త్వరగానే బుట్టలో వేసుకున్నాడు. దీంతో టెయిలెండర్లను బౌలర్లు చుట్టేస్తారనిపించింది. కానీ తొమ్మిదో స్థానంలో వచ్చిన హార్ట్‌లీ (34)తో కలిసి పోప్‌ 80 పరుగులు జోడించాడు. ఇంగ్లాండ్‌ ఆధిక్యం 200, స్కోరు 400 దాటింది. పరిస్థితులు భారత్‌కు మరింత క్లిష్టంగా మారుతున్న సమయంలో బౌలింగ్‌ ఎండ్‌ మార్చిన అశ్విన్‌.. హార్ట్‌లీని బౌల్డ్‌ చేయడంతో జట్టు ఊపిరి తీసుకుంది. మరో రెండు ఓవర్లలోనే ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. బుమ్రా బౌలింగ్‌లో రివర్స్‌ స్కూప్‌ ఆడేందుకు ప్రయత్నించిన పోప్‌ బౌల్డ్‌ అయ్యాడు.


ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 246
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 436
ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: క్రాలీ (సి) రోహిత్‌ (బి) అశ్విన్‌ 31; డకెట్‌ (బి) బుమ్రా 47; పోప్‌ (బి) బుమ్రా 196; రూట్‌ (ఎల్బీ) బుమ్రా 2; బెయిర్‌స్టో (బి) జడేజా 10; స్టోక్స్‌ (బి) అశ్విన్‌ 6; ఫోక్స్‌ (బి) అక్షర్‌ 34; రెహాన్‌ అహ్మద్‌ (సి) భరత్‌ (బి) బుమ్రా 28; హార్ట్‌లీ (బి) అశ్విన్‌ 34; మార్క్‌వుడ్‌ (సి) భరత్‌ (బి) జడేజా 0; లీచ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 32; మొత్తం: (102.1 ఓవర్లలో ఆలౌట్‌) 420; వికెట్ల పతనం: 1-45, 2-113, 3-117, 4-140, 5-163, 6-275, 7-339, 8-419, 9-420; బౌలింగ్‌: బుమ్రా 16.1-4-41-4; అశ్విన్‌ 29-4-126-3; అక్షర్‌ 16-2-74-1; జడేజా 34-1-131-2; సిరాజ్‌ 7-1-22-0

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ ఎల్బీ (బి) హార్ట్‌లీ 39; యశస్వి (సి) పోప్‌ (బి) హార్ట్‌లీ 15; శుభ్‌మన్‌ (సి) పోప్‌ (బి) హార్ట్‌లీ 0; రాహుల్‌ ఎల్బీ (బి) రూట్‌ 22; అక్షర్‌ (సి) అండ్‌ (బి) హార్ట్‌లీ 17; శ్రేయస్‌ (సి) రూట్‌ (బి) లీచ్‌ 13; జడేజా రనౌట్‌ 2; భరత్‌ (బి) హార్ట్‌లీ 28; అశ్విన్‌ (స్టంప్డ్‌) ఫోక్స్‌ (బి) హార్ట్‌లీ 28; బుమ్రా నాటౌట్‌ 6; సిరాజ్‌ (స్టంప్డ్‌) ఫోక్స్‌ (బి) హార్ట్‌లీ 12; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం: (69.2 ఓవర్లలో ఆలౌట్‌) 202; వికెట్ల పతనం: 1-42, 2-42, 3-63, 4-95, 5-107, 6-119, 7-119, 8-176, 9-177; బౌలింగ్‌: రూట్‌ 19-3-41-1; వుడ్‌ 8-1-15-0; హార్ట్‌లీ 26.2-5-62-7; జాక్‌ లీచ్‌ 10-1-33-1; రెహాన్‌ అహ్మద్‌ 6-0-33-01


1

ఉప్పల్‌ స్టేడియంలో టెస్టుల్లో భారత్‌కు ఇదే తొలి ఓటమి. గతంలో అయిదు టెస్టులాడిన భారత్‌ నాలుగు గెలిచి, ఒకటి డ్రా చేసుకుంది.


3

తొలి ఇన్నింగ్స్‌లో 100కు పైగా ఆధిక్యం సాధించినా టీమ్‌ఇండియా ఓడిన మ్యాచ్‌లు. 2015లో శ్రీలంక (192), 2022లో ఇంగ్లాండ్‌ (132) చేతిలో ఓడింది.


4

సొంతగడ్డపై గత 48 టెస్టుల్లో భారత్‌ ఓడిన మ్యాచ్‌లు


196

రెండో ఇన్నింగ్స్‌లో పోప్‌ చేసిన పరుగులు. భారత్‌లో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లాండ్‌ ఆటగాడిగా కుక్‌ (2012లో కుక్‌ 176) రికార్డును పోప్‌ బద్దలుకొట్టాడు. ఓవరాల్‌గా అతను నాలుగో స్థానంలో ఉన్నాడు.


‘‘ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించడం కష్టమే. 190 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో మేం ఆధిపత్యం సాధించాం. కానీ పోప్‌ అసాధారణంగా బ్యాటింగ్‌ చేశాడు. భారత పరిస్థితుల్లో నేను చూసిన అద్భుతమైన ఇన్నింగ్స్‌ల్లో ఇదొకటి. 230 పరుగులంటే ఛేదించాల్సిన లక్ష్యమే. కానీ బ్యాటింగ్‌లో విఫలమై లక్ష్యాన్ని అందుకోలేకపోయాం. లోయర్‌ఆర్డర్‌ పోరాడింది. ఎలా బ్యాటింగ్‌ చేయాలో టాప్‌ఆర్డర్‌కు చూపించింది. రెండో ఇన్నింగ్స్‌లో సరైన ప్రాంతాల్లోనే బంతులేశాం. మా బౌలింగ్‌ను విశ్లేషించుకున్నాం. అయినా పోప్‌ బాగా ఆడాటని ఒప్పుకోవాల్సిందే’’

రోహిత్‌


‘‘నేను కెప్టెన్సీ చేపట్టిన తర్వాత 100 శాతం ఇదే మా అత్యున్నత విజయం. ఈ పరిస్థితుల్లో తొలిసారి కెప్టెన్‌గా ఆడుతున్నా. ఇక్కడ భారత్‌ ఎలా ఆడుతుందనేది గమనించా. హార్ట్‌లీ, పోప్‌ గొప్పగా ఆడారు. ఏదేమైనా హార్ట్‌లీతో సుదీర్ఘ స్పెల్‌లు వేయించాలని అనుకున్నాం. అందుకే అతను ఏడు వికెట్లు సాధించిగలిగాడు. ఉపఖండంలో ఇంగ్లాండ్‌ ఆటగాడు ఆడిన గొప్ప ఇన్నింగ్స్‌ పోప్‌దే. ఓటములకు మేం భయపడం. మైదానంలో దిగి సత్తాచాటుతాం’’

స్టోక్స్‌


‘‘ఈ ప్రదర్శన నమ్మశక్యంగా లేదు. చంద్రుని మీద ఉన్నట్లు ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో మేం అనుకున్నంత బంతి తిరగలేదు. కెప్టెన్‌, కోచ్‌ నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చారు. రెండో ఇన్నింగ్స్‌లో ఫలితం దక్కింది. బ్యాటింగ్‌లో ఒత్తిడికి గురయ్యా. కానీ కొన్ని పరుగులు కచ్చితంగా జట్టుకు సాయపడగలవని తెలుసు’’

హార్ట్‌లీ


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు