ఈ చిక్కుముడిని విప్పేదెలా?

అయిదు టైటిళ్లతో ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతున్న ముంబయి ఇండియన్స్‌కు గత కొన్ని సీజన్ల నుంచి కలిసి రావడం లేదు. ఈసారైనా రాత మారుతుందేమో అనుకుంటే.. టోర్నీని ఓటమితో ఆరంభించింది.

Updated : 26 Mar 2024 07:01 IST

ముంబయికి ‘హార్దిక్‌’ తలపోటు
ఈనాడు క్రీడావిభాగం

అయిదు టైటిళ్లతో ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతున్న ముంబయి ఇండియన్స్‌కు గత కొన్ని సీజన్ల నుంచి కలిసి రావడం లేదు. ఈసారైనా రాత మారుతుందేమో అనుకుంటే.. టోర్నీని ఓటమితో ఆరంభించింది. అయితే లీగ్‌లో సగం జట్లు టోర్నీని ఓటమితోనే ఆరంభిస్తాయి కాబట్టి అదేం పెద్ద సమస్య కాదు. ఫలితాలను మించి ముంబయిని వేధించబోయే అంశం.. కెప్టెన్సీ మార్పు. తొలి మ్యాచ్‌లోనే ఈ విషయం స్పష్టమైంది. చిక్కుముడిలా మారిన ఈ సమస్యను ముంబయి ఎలా పరిష్కరిస్తుందో?

శాబ్దం పాటు కెప్టెన్‌గా ముంబయిని నడిపించాడు రోహిత్‌ శర్మ. అతడి సారథ్యంలో ఏకంగా అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిందా జట్టు. అలాంటి ఆటగాడిని కెప్టెన్సీ నుంచి తీసేసింది ముంబయి. కెప్టెన్సీ మార్పు కంటే మార్చిన తీరు అభిమానులకు రుచించలేదు. గత కొన్ని సీజన్ల నుంచి ముంబయి ప్రదర్శన పేలవం. రోహిత్‌ బ్యాటింగ్‌ కూడా బాలేదు. కానీ ధోని, కోహ్లి, రోహిత్‌ స్థాయి ఆటగాళ్లతో అభిమానులకు ఉండే భావోద్వేగ బంధం వేరు. వీళ్లు ప్రాతినిధ్యం వహించే ఫ్రాంఛైజీలకు వచ్చిన ఆదరణలో ఎక్కువ వాటా వారిదే. ఆటను మించి తమ ఉనికితోనే జట్టుకు ఆకర్షణ తెచ్చే ఇలాంటి ఆటగాళ్ల విషయంలో పెద్ద నిర్ణయాలు తీసుకునేటపుడు ఫ్రాంఛైజీలు జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. కానీ ముంబయి మాత్రం ఏకపక్షంగా రోహిత్‌ను కెప్టెన్‌గా తప్పించడం అభిమానులను బాధించింది. ఒకప్పుడు ముంబయికే ఆడిన హార్దిక్‌.. తిరిగి ఈ ఫ్రాంఛైజీకి రావడానికి తను కెప్టెన్‌గా చేయాలన్న షరతు విధించాడని ప్రచారం జరిగింది. ముంబయి కొత్త కెప్టెన్‌ హార్దిక్‌ అనే ప్రకటన రాగానే అతడిపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో హార్దిక్‌ చేదు అనుభవాలు తప్పలేదు. టాస్‌కు రావడం ఆలస్యం.. అహ్మదాబాద్‌ స్టేడియంలో అభిమానులు అతణ్ని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఇందులో రోహిత్‌ అభిమానులతో పాటు గుజరాత్‌ మద్దతుదారులూ ఉన్నారు. కెప్టెన్‌గా మంచి స్థాయిని కల్పించిన గుజరాత్‌ ఫ్రాంఛైజీని హార్దిక్‌ విడిచి వెళ్లిపోవడం అక్కడి అభిమానులకు నచ్చలేదు. మ్యాచ్‌ అంతటా పలు సందర్భాల్లో హార్దిక్‌ను హేళన చేశారు ప్రేక్షకులు. హార్దిక్‌ను ప్రేక్షకులు లక్ష్యంగా చేసుకోవడం తొలి మ్యాచ్‌కే పరిమితం అయ్యేలా లేదు.

యాజమాన్యం ఏం చేయబోతోంది?: ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన జట్లలో ఒకటిగా ముంబయి కొనసాగుతుండడానికి భారీగా ఉన్న అభిమానగణం ఓ కారణం. ఆ జట్టుకు ముంబయిలో లభించే ఆదరణే వేరు. వేరే నగరాలకు వెళ్లినా ఆ జట్టుకు బ్రహ్మరథం పడతారు. ముంబయి ఆడుతుంటే స్టేడియాలు నిండిపోయేది రోహిత్‌ లాంటి ఆటగాళ్ల వల్లే. అలాంటి ఆటగాడిని కెప్టెన్‌గా తప్పించడంపై పెద్ద దుమారమే చెలరేగింది. చెన్నై సారథి ధోని.. రుతురాజ్‌కు పగ్గాలప్పగించినట్లు సామరస్యంగా, పద్ధతి ప్రకారం ఈ మార్పు జరిగి ఉంటే వేరుగా ఉండేది. కానీ రోహిత్‌ను బలవంతంగా తప్పించినట్లు సంకేతాలు రావడంతో అభిమానులు తట్టుకోలేకపోయారు. హార్దిక్‌ను కెప్టెన్‌గా ప్రకటించిన వెంటనే లక్షల మంది సామాజిక మాధ్యమాల్లో ముంబయిని అన్‌ఫాలో చేశారు. ఇప్పుడు నేరుగా మైదానాల్లో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. అభిమానుల సంగతి పక్కన పెడితే.. జట్టులోని ఆటగాళ్ల మద్దతు కూడా హార్దిక్‌కు లేదనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో హార్దిక్‌కు, ముంబయి ఆటగాళ్లకు మధ్య సమన్వయం కనిపించలేదు. కెప్టెన్‌గా ఒత్తిడికి గురయ్యాడు పాండ్య. తనకంటే మెరుగైన బౌలర్లుండగా.. మూడు ఓవర్లు వేసి ఎక్కువ పరుగులు సమర్పించుకోవడం విమర్శలకు దారితీసింది. బ్యాటింగ్‌లో ముందు రావాల్సిన వాడు.. ఏడో స్థానంలో దిగి, మ్యాచ్‌ గెలిపించకుండానే నిష్క్రమించాడు. ఇవన్నీ కాక ఎప్పుడూ వలయం లోపల ఫీల్డింగ్‌ చేసే రోహిత్‌ను బౌండరీ వద్దకు పంపడం వివాదాస్పదమైంది. ముంబయి కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో హార్దిక్‌కు ఏదీ కలిసి రాలేదు. హార్దిక్‌ పట్ల ఇంత వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముంబయి యాజమాన్యం హార్దిక్‌, రోహిత్‌లతో ఉమ్మడి సమావేశం నిర్వహించి అభిమానుల మద్దతు సంపాదించడానికి, జట్టులో సమన్వయం సాధించడానికి ప్రణాళిక రూపొందించాల్సిందే.  హార్దిక్‌.. అభిమానులను మెప్పించేలా అతడితో గౌరవప్రదంగా వ్యవహరించాలి. రోహిత్‌కు పెద్దన్న పాత్రను ఇచ్చి అవసరమైనపుడు అతడి సలహాలూ తీసుకోవాలి. అంతేకాక హార్దిక్‌కు మద్దతుగా నిలవాలని అభిమానులకు రోహిత్‌ సందేశం ఇవ్వడం కూడా ఆవశ్యకం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని