IPL 2024: ‘హార్దిక్‌ పాండ్య లేకపోయినా గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద నష్టం లేదు’

హార్దిక్‌ పాండ్య గుజరాత్ టైటాన్స్‌ను వీడినా ఆ జట్టుకు పెద్ద నష్టం లేదని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ (Brad Hogg) అభిప్రాయపడ్డాడు.

Published : 12 Mar 2024 10:57 IST

ఇంటర్నెట్ డెస్క్: అభిమానులను అలరించేందుకు ఐపీఎల్-2024 (IPL 2024) సిద్ధమైంది. మార్చి 22 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. ఆరంభపోరులో డిఫెండింగ్ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడనుంది.అయితే, గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) తిరిగి ముంబయి ఇండియన్స్‌కు చేరుకున్నాడు. పాండ్య కెప్టెన్సీలో గుజరాత్ వరుసగా రెండుసార్లు ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. హార్దిక్‌ గుజరాత్‌ను వీడటంపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ (Brad Hogg) స్పందించాడు. పాండ్య వెళ్లినా గుజరాత్ టైటాన్స్‌కు పెద్దగా నష్టం లేదన్నాడు. హార్దిక్‌ లేకున్నా టైటాన్స్‌ బలంగానే ఉందని పేర్కొన్నాడు. 

‘‘హార్దిక్ పాండ్య లేకపోవడం గుజరాత్ టైటాన్స్‌కు పెద్దగా నష్టం కలిగించదని అనుకుంటున్నా. అతడు మిడిల్‌ ఆర్డర్‌లో నాణ్యమైన ఆల్‌రౌండర్‌. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ, హార్దిక్‌ లేని లోటును పూడ్చుకోగలదు. ఆ జట్టుకు బలమైన బౌలింగ్‌ దళం ఉంది. హార్దిక్‌ టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ, అది అతడికి అంతగా సెట్‌ కాదు. హార్దిక్‌ లేకున్నా గుజరాత్ పటిష్టంగానే ఉంది. ముంబయి ఇండియన్స్‌ తరఫున పాండ్య లోయర్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడం మంచిది. హార్దిక్ అదే పని చేస్తాడని అనుకుంటున్నాను. ముంబయి తరఫున తన అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడని భావిస్తున్నా’’ అని బ్రాడ్ హాగ్ వివరించాడు. ఈ సీజన్‌ నుంచి ముంబయి ఇండియన్స్‌కు హార్దిక్‌ పాండ్య నాయకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలు, స్టార్‌ ఆటగాళ్లతో నిండిన ముంబయిని ఎలా ముందుండి నడిపిస్తాడో చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని