Published : 03 Aug 2022 13:33 IST

Hardik : నా బౌలింగ్‌ విలువేంటో తెలుసుకున్నా.. అందుకోసం చాలా కష్టపడ్డా: హార్దిక్‌

సూర్యకుమార్‌ రావడం ఆలస్యమేమో కానీ.. అదరగొట్టేస్తున్నాడు: పాండ్య


 

ఇంటర్నెట్ డెస్క్‌: విండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్య (4-0-19-1)తోపాటు సూర్యకుమార్‌ యాదవ్‌ (76) అదరగొట్టేశారు. టీ20ల్లో టీమ్‌ఇండియా ఓపెనర్‌గా మారిన సూర్యకుమార్‌ తొలి రెండు మ్యాచుల్లో పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే మూడో టీ20లో మాత్రం చెలరేగాడు. అర్ధశతకం సాధించి భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో అతడి ప్రదర్శనపై కెప్టెన్‌ రోహిత్ శర్మతోపాటు హార్దిక్ పాండ్య ప్రశంసలు కురిపించారు. అలాగే తాను పూర్తి ఓవర్ల బౌలింగ్‌ కోటాను పూర్తి చేయడంపైనా హార్దిక్‌ స్పందించాడు.

‘‘సూర్యకుమార్‌ యాదవ్‌ అసాధారణమైన ఆటతీరు కలిగిన ప్లేయర్‌. అతడు షాట్లు కొడుతుంటే అలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది. విండీస్‌పై మూడో టీ20 గెలవడంలో అతడి ఇన్నింగ్సే కీలకం. అవకాశాలు ఆలస్యంగా వచ్చినా అందిపుచ్చుకోవడంలో మాత్రం ముందుంటాడు. దాని కోసం చాలా కష్టపడ్డాడు. ఇక నేను పూర్తి ఓవర్లను పూర్తి చేస్తుండటం బాగుంది. బౌలింగ్‌ చేయడాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తుంటా. ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. గాయం తర్వాత కోలుకున్నప్పటి నుంచి పూర్తి కోటాను వేయడానికి కాస్త సమయం తీసుకున్నా. నేను ఇలా బౌలింగ్‌ చేయడం వల్ల జట్టులో సమతూకం వస్తుందనే విషయాన్ని గ్రహించా. సారథితోపాటు జట్టుకు నాపై నమ్మకం వచ్చేలా చేయగలిగాను. ఇంతకుముందు వేరొకరు బౌలింగ్‌ చేయడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు మాత్రమే నేను బౌలింగ్‌కు వచ్చేవాడిని. అయితే ఇప్పుడు మాత్రం పూర్తి ఓవర్లను వేయగలనని గర్వంగా చెప్పగలను. అలానే బ్యాటింగ్‌లోనూ ముఖ్యభూమిక పోషిస్తానని నమ్మకంతో ఉన్నా’’ అని హార్దిక్ వివరించాడు. 

విండీస్‌తో టీ20 సిరీస్‌కు వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించడంపై హార్దిక్‌ ఆనందం వ్యక్తం చేశాడు. ‘‘గాయపడటం లేదా ఫామ్‌ కోల్పోయి బయటకు వెళ్లాక టీమ్‌లోకి మళ్లీ రావాలంటే చాలా కష్టపడాలి. దాని కోసం నేను చాలా హార్డ్‌వర్క్‌ చేశా. అందుకే నేను బాగా ఆడినా.. ఆడకపోయినా ఒకేలా రియాక్షన్ ఇవ్వడం అలవాటు చేసుకున్నా. ఇక భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉండటం గౌరవమే. సారథి రోహిత్ శర్మ మాకు ఎంతో స్వేచ్ఛనిస్తాడు. అదే అతడి బలం. విజయాలు సాధించడానికి ఇద్దరే కారణం. వారిలో ఒకరు రోహిత్ కాగా.. మరొకరు రాహుల్‌ ద్రవిడ్‌. జట్టును సమష్టిగా ఉంచడంతోపాటు సానుకూల వాతావరణం సృష్టిస్తారు. అందుకే ఆటగాళ్లు ఎప్పుడూ సురక్షితంగా ఉన్నామనే భావనతో ఉంటారు. కావాల్సినన్ని అవకాశాలు ఇచ్చి మాలోని ఆటను బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు’’ అని హార్దిక్‌ తెలిపాడు. విండీస్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌ ఆగస్టు 6 (శనివారం)న జరగనుంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts