Hyderabad vs Punjab: హైదరాబాద్‌ ఘన విజయం.. టాప్‌-4లోకి కేన్‌ సేన

ఆరంభంలో రెండు ఓటముల తర్వాత వరుసగా మూడు విజయాలు సాధించి జోరుమీదున్న హైదరాబాద్‌ మరికాసేపట్లో పంజాబ్‌తో తలపడనుంది...

Updated : 17 Apr 2022 19:52 IST

ముంబయి: పంజాబ్‌పై హైదరాబాద్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్‌ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో ఛేదించింది. హైదరాబాద్‌ బ్యాటర్లలో కేన్‌ విలియమ్సన్‌ (3) విఫలం కాగా.. మార్‌క్రమ్‌ (41*), నికోలస్‌ పూరన్‌ (35*), రాహుల్ త్రిపాఠి (34), అభిషేక్ శర్మ (31) రాణించారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ 2, రబాడ ఒక వికెట్ తీశారు. దీంతో వరుసగా నాలుగో విజయంతో హైదరాబాద్‌ (8) పాయింట్ల పట్టికలో టాప్‌-4లోకి దూసుకెళ్లింది.


ఇంకెన్ని కొట్టాలంటే?

హైదరాబాద్‌ విజయానికి చేరువగా వస్తోంది. పంజాబ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్నప్పటికీ హైదరాబాద్‌ బ్యాటర్లు పరుగులు రాబడుతున్నారు. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్‌ మూడు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. క్రీజ్‌లో నికోలస్‌ పూరన్‌ (20*), మార్‌క్రమ్ (17*) ఉన్నారు. ఇంకా హైదరాబాద్‌ విజయానికి 30 బంతుల్లో 41 పరుగులు కావాలి. 


వేగం పెంచిన బ్యాటర్లు..

పంజాబ్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్‌ ఆటగాళ్లు వేగం పెంచారు. తొలి ఐదు ఓవర్లలో 33 పరుగులు చేసిన ఆ జట్టు.. చివరి ఐదు ఓవర్లలో 41 పరుగులు రాబట్టింది ప్రస్తుతం అభిషేక్‌ శర్మ (29), మార్‌క్రమ్‌ (4) క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది.


Match Updates..

హైదరాబాద్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్‌ 3.1వ ఓవర్‌లో ఓపెనర్‌ కేన్‌ విలియమ్సన్‌ (3) తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. పంజాబ్‌ బౌలర్ రబాడ బౌలింగ్‌లో శిఖర్‌ చేతికి చిక్కాడు. ప్రస్తుతం హైదరాబాద్‌ ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజ్‌లో అభిషేక్ శర్మ (17*), రాహుల్ త్రిపాఠి (19*) ఉన్నారు. ఇంకా హైదరాబాద్‌ విజయానికి 84 బంతుల్లో 113 పరుగులు కావాలి.  


నిదానంగా ఆరంభం

పంజాబ్‌ నిర్దేశించిన 152 లక్ష్య ఛేదనను హైదరాబాద్‌ నిదానంగా ప్రారంభించింది. ఓపెనర్లు కేన్ విలియమ్సన్ (1*), అభిషేక్ శర్మ (6*) ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం రెండు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా ఎనిమిది పరుగులు చేసింది. అంతకుముందు పంజాబ్‌ 151 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.


హైదరాబాద్‌ బౌలర్లు ఉమ్రాన్‌ మాలిక్, భువనేశ్వర్‌ చెలరేగిపోయారు. ఆరంభం, ఆఖర్లో పంజాబ్‌ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. మరీ ముఖ్యంగా ఉమ్రాన్‌ మాలిక్ వేసిన చివరి ఓవర్లో ఒక్క పరుగు రాకుండా నాలుగు వికెట్లు పడ్డాయ్‌. అందులో ఒకటి రనౌట్‌ కాగా.. ఉమ్రాన్‌ మూడు వికెట్లు తీసి పంజాబ్‌ను దెబ్బకొట్టాడు. అయితే లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (60) అర్ధశతకం చేయడంతో హైదరాబాద్‌కు పంజాబ్‌ 152 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. లివింగ్‌స్టోన్‌తోపాటు షారుఖ్‌ ఖాన్‌ (26) ఫర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లలో శిఖర్ ధావన్‌ 8, ప్రభుదేశాయ్‌ 14, జానీ బెయిర్‌స్టో 12, జితేశ్‌ శర్మ 11, ఓడియన్‌ స్మిత్ 13 పరుగులు చేశారు. హైదరాబాద్‌ బౌలర్లలో ఉమ్రాన్‌ మాలిక్ 4, భువనేశ్వర్ 3... నటరాజన్‌, సుచిత్ చెరో వికెట్ తీశారు.


స్వల్ప వ్యవధిలో వికెట్లను చేజార్చుకున్న పంజాబ్ కుదురుకుంది. ఈ క్రమంలో లివింగ్‌స్టోన్ (51*) అర్ధశతకం సాధించాడు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ నాలుగు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. క్రీజ్‌లో లివింగ్‌స్టోన్‌తోపాటు షారుఖ్‌ ఖాన్‌ (24*) ఉన్నాడు. వీరిద్దరూ కలిపి ఇప్పటికే 61 పరుగులు జోడించారు. వరుస ఓవర్లలో బౌండరీలు బాదుతూ వేగంగా పరుగులు రాబడుతున్నారు.


 హైదరాబాద్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండటంతో పంజాబ్‌ త్వరత్వరగా వికెట్లను చేజార్చుకుంది. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ నాలుగు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజ్‌లో షారుఖ్‌ ఖాన్‌ (1*), లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (18*) ఉన్నారు. అంతకుముందు ఓపెనర్లు శిఖర్‌ ధావన్ 8, ప్రభుదేశాయ్‌ 14, జానీ బెయిర్‌స్టో 12, జితేశ్‌ శర్మ 11 పరుగులు చేశారు. ఉమ్రాన్‌, నటరాజన్‌, భువనేశ్వర్‌, సుచిత్ తలో వికెట్ తీశారు.


పంజాబ్‌, హైదరాబాద్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పవర్‌ప్లే ముగిసింది. మార్కో జాన్‌సెన్‌ వేసిన ఆరో ఓవర్‌లో లివింగ్‌స్టోన్‌ రెండు ఫోర్లు, సిక్సర్‌ బాదాడు. ఈ ఓవర్‌ మినహా హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. అదేవిధంగా రెండు వికెట్లను కూల్చింది. ప్రస్తుతం 6 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్‌ రెండు వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. క్రీజ్‌లో జానీ బెయిర్‌స్టో (12*), లివింగ్‌స్టోన్ (14*) ఉన్నారు. భువనేశ్వర్, నటరాజన్‌ చెరో వికెట్ తీసుకున్నారు.


హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. ఆ జట్టు కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే అతడి స్థానంలో శిఖర్‌ ధావన్‌కు జోడీగా ప్రభ్‌సిమ్రాన్‌ ఓపెనర్‌గా వచ్చాడు. దీంతో 2 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు స్కోర్‌ 8/0గా నమోదైంది. భువనేశ్వర్‌ వేసిన తొలి ఓవర్‌లో ధావన్‌ బౌండరీ బాదగా మొత్తం 6 పరుగులు వచ్చాయి. మార్కో జాన్సన్‌ వేసిన రెండో ఓవర్‌లో 2 పరుగులే వచ్చాయి. 


ఆరంభంలో రెండు ఓటముల తర్వాత వరుసగా మూడు విజయాలు సాధించి జోరుమీదున్న హైదరాబాద్‌ మరికాసేపట్లో పంజాబ్‌తో తలపడనుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. మరోవైపు పంజాబ్‌ కూడా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 2 ఓటములతో కొనసాగుతున్నా నెట్‌రన్‌రేట్‌ పరంగా హైదరాబాద్‌ కన్నా ముందుంది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మరింత ముందుకు వెళ్లాలని విలియమ్సన్‌ టీమ్‌ భావిస్తోంది. కాగా, ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ ఆడటం లేదు. అతడికి గాయం కారణంగా శిఖర్‌ ధావన్‌ టాస్‌కు వచ్చాడు.

హైదరాబాద్‌ టీమ్‌: అభిషేక్‌ శర్మ, కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), రాహుల్‌ త్రిపాఠి, ఎయిడెన్‌ మార్‌క్రమ్‌, నికోలస్‌ పూరన్‌, శశాంక్‌ సింగ్‌, జగదీశ్‌ సుచరిత్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మార్కో జాన్సన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, టి.నటరాజన్‌

పంజాబ్‌ టీమ్‌: శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్‌), జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, జితేశ్‌ శర్మ, షారుఖ్‌ ఖాన్‌, ఒడియన్‌ స్మిత్‌, కగిసో రబాడా, రాహుల్‌ చాహర్‌, వైభవ్‌ ఆరోరా, అర్ష్‌దీప్‌ సింగ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని