Sachin : ఆ నిర్ణయం నాకు విస్మయాన్ని కలిగించింది.. WTC Final ఓటమిపై సచిన్‌

WTC Finala టీమ్‌ఇండియా ఘోర ఓటమిపై క్రికెట్‌ దిగ్గజం సచిన్‌(Sachin Tendulkar) స్పందించాడు. జట్టు ఎంపిక తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Updated : 12 Jun 2023 10:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రెండేళ్లు కష్టపడి చివరిదాకా వచ్చి.. WTC Finalలో టీమ్‌ఇండియా(Team India) చేతులెత్తేసింది. కీలక టెస్టు మహాసమరం(WTC Final)లో ఆస్ట్రేలియా(Australia) చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. దీంతో రోహిత్‌ సేన ప్రదర్శనపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. భారత జట్టులో లోటుపాట్లను ఎత్తిచూపుతున్నారు. ఇక దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌(Sachin Tendulkar) కూడా జట్టు సెలక్షన్‌, ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

భారత ప్లేయింగ్‌ XIలో సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin)ను తీసుకోకపోవడంపై సచిన్‌ విస్మయం వ్యక్తం చేశాడు. ‘పోటీలో ఉండాలంటే భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసి ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. భారత్‌ వైపు కొన్ని మంచి మూమెంట్స్‌ ఉన్నప్పటికీ.. ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ టెస్టు బౌలర్‌గా కొనసాగుతున్న అశ్విన్‌ను ఎందుకు తీసుకోలేదో నాకు అర్థం కాలేదు’ అని సచిన్‌ పేర్కొన్నాడు.

సీమర్లకు సహకరించే పిచ్‌ అని చెప్పి అశ్విన్‌ నైపుణ్యాలను ఉపయోగించుకోకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని సచిన్‌ అన్నాడు. ‘నేను గతంలో చెప్పినట్లుగానే.. నైపుణ్యం ఉన్న స్పిన్నర్లు ఎప్పుడూ టర్నింగ్‌ ట్రాక్‌లపైనే ఆధారపడరు. వారు పరిస్థితులను ఉపయోగించుకుని బంతుల్లో వైవిధ్యాన్ని చూపుతారు. ఆసీస్‌ టాప్‌ 8 బ్యాటర్లలో ఐదుగురు లెఫ్ట్‌ హ్యాండర్లన్న విషయాన్ని మరవకూడదు’ అని సచిన్‌ వివరించాడు.

ఇక అశ్విన్‌ ఈ రెండేళ్ల డబ్ల్యూటీసీ సైకిల్‌లో 13 టెస్టుల్లో 61 వికెట్లు పడగొట్టాడు. అయితే అశ్విన్‌ను తీసుకోకపోవడాన్ని కోచ్‌ ద్రవిడ్‌ సమర్థించుకున్నాడు. మేఘావృతమైన పరిస్థితుల కారణంగానే తాము నాల్గో స్పెషలిస్ట్‌ సీమర్‌తో బరిలోకి దిగాల్సి వచ్చిందని చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని