SKY: బౌలర్‌ ఎలా ఆలోచిస్తాడో.. నేనూ అలానే ఆలోచిస్తా: సూర్యకుమార్‌ యాదవ్‌

తనకు మాత్రమే సాధ్యమైన షాట్లతో వీరవిహారం చేస్తూ చెలరేగుతున్నాడు సూర్యకుమార్‌ యాదవ్‌. ర్యాంప్‌ షాట్‌ ఆడేందుకు తాను ఎలా సిద్ధమవుతానో ఈ మిస్టర్‌ 360 వివరించాడు.

Updated : 07 Nov 2022 11:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ పొట్టి ప్రపంచకప్‌లో తన బ్యాటింగ్‌ విశ్వరూపం చూపిస్తూ.. బౌలర్లను ఊచకోత కోయడమే పనిగా పెట్టుకుంటూ.. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు భారత యువ 360 సూర్య కుమార్‌ యాదవ్‌. ఇక నిన్న జింబాబ్వేపై జరిగిన సూపర్‌ 12 చివరి మ్యాచ్‌లో అతడి ఇన్నింగ్స్‌ అద్భుతం. తనకు మాత్రమే సాధ్యమైన షాట్లతో వీరవిహారం చేస్తూ కేవలం 25 బంతుల్లో 61 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో సూర్య ఆడిన ర్యాంప్‌ షాట్‌ గురించి మ్యాచ్‌ అనంతరం మాజీ కోచ్‌ రవిశాస్త్రి అడగ్గా.. అలాంటి స్ట్రోక్స్‌ ఆడేందుకు ఎలా సిద్ధమవుతాననేది ఈ భారీ హిట్టర్‌ వివరించాడు. ‘ఆ సమయంలో బౌలర్‌ ఎలా బౌలింగ్‌ చేయబోతున్నాడో అర్థం చేసుకోవాలి. కొంచెం ముందుగానే చిన్న అంచనాతో ఉండాలి. రబ్బర్‌ బాల్‌ క్రికెట్‌ ఆడేటప్పుడు ఇలాంటి షాట్లు ఎన్నో ప్రాక్టీస్‌ చేశాను.  ఆ సమయంలో బౌలర్‌ ఏం ఆలోచిస్తున్నాడో.. మీరు కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉండాలి’ అని సూర్య వివరించాడు.

ఇక ఆ షాట్‌ ఆడటానికి మణికట్టు బలం ఎంత అవసరమని శాస్త్రి అడగ్గా..‘మన వెనుకున్న బౌండరీ ఎంత పొడవో మీకు తెలిసి ఉండాలి. నేనైతే అది కేవలం 60-65 మీటర్లు మాత్రమే అని భావిస్తా. బంతి వేగానికి సరైన టైమింగ్‌ను జోడించి ప్రయత్నిస్తాను. బంతిని బౌండరీకి తరలిస్తాను’ అని సూర్య తెలిపాడు.

ఈ టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక విజయాలతో సెమీస్‌లోకి దూసుకెళ్లిన టీమ్‌ ఇండియా.. గురువారం ఇంగ్లాండ్‌తో తలపడనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని