ICC: ఫిక్సింగ్‌ ఆరోపణలు.. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్‌పై రెండేళ్ల నిషేధం

బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ నాసిర్ హొస్సేన్‌ (Nasir Hossain)పై ఐసీసీ రెండేళ్ల నిషేధం విధించింది.

Updated : 16 Jan 2024 22:33 IST

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ నాసిర్‌ హొస్సేన్‌కు ఐసీసీ షాక్‌ ఇచ్చింది. ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు (ECB) అవినీతి నిరోధక కోడ్ ఉల్లంఘించినందుకు రెండేళ్లపాటు అన్ని క్రికెట్ ఫార్మాట్లలో ఆడకుండా నిషేధం విధించింది. ఈ మేరకు ఐసీసీ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. అబుదాబి టీ10లో 2021-22 సీజన్‌లో పుణె డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన నాసిర్‌.. మరో ఏడుగురితో కలిసి ఫిక్సింగ్‌కు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఉన్నవారిపై 2023 సెప్టెంబరులో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం అభియోగాలు నమోదు చేసింది. 

విచారణలో నాసిర్‌ తప్పు చేసినట్లు తేలింది. ఖరీదైన ఐఫోన్‌ను పొందడం సహా ఫిక్సింగ్‌కు సంబంధించి ఆ ఫోన్‌లో బుకీలతో మాట్లాడటం, ఆ విషయం గురించి అవినీతి నిరోధక అధికారికి వెంటనే తెలియచేయకపోవడం, విచారణకు సహకరించకపోవడంతో అతడిపై వేటు పడింది. తనపై మోపిన అభియోగాలను నాసిర్‌ అంగీకరించాడు. దీంతో అతడిపై నిషేధం విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. నాసిర్‌ బంగ్లాదేశ్ తరఫున 19 టెస్టులు, 65 వన్డేలు, 31 టీ20లు ఆడాడు. 2018లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌ అతడి కెరీర్‌లో చివరిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు