IPL - 2022 : భారత జట్టు బలమైన నాయకుడి కోసం ఎదురు చూస్తోంది : రవిశాస్త్రి

త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ - 2022 సీజన్‌లో.. టీమ్ఇండియా పగ్గాలు చేపట్టబోయే నాయకుడు ఎవరో తేలిపోనుందని భారత జట్టు మాజీ కోచ్‌ రవిశాస్త్రి జోస్యం చెప్పాడు. ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గొప్పగా రాణిస్తున్నాడని ప్రశంసించాడు...

Published : 23 Mar 2022 01:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ - 2022 సీజన్‌లో.. టీమ్ఇండియా పగ్గాలు చేపట్టబోయే నాయకుడు ఎవరో తేలిపోనుందని భారత జట్టు మాజీ కోచ్‌ రవిశాస్త్రి జోస్యం చెప్పాడు. ప్రస్తుత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గొప్పగా రాణిస్తున్నాడని ప్రశంసించాడు. అయితే, రోహిత్‌ తర్వాత బాధ్యతలు చేపట్టబోయే బలమైన నాయకుడి కోసం టీమ్‌ఇండియా వేచి చూస్తోందని రవిశాస్త్రి అన్నాడు. 

‘టీమ్‌ఇండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో బాధ్యతలు చేపట్టిన రోహిత్‌ శర్మ గొప్పగా జట్టును నడిపిస్తున్నాడు. ప్రత్యేకించి పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్‌ తనదైన ముద్ర వేశాడు. అయితే, హిట్‌మ్యాన్‌ తర్వాత భారత జట్టు పగ్గాలు చేపట్టేదెవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత జట్టు బలమైన నాయకుడి కోసం ఎదురు చూస్తోంది. యువ ఆటగాళ్లకు ఇదే గొప్ప అవకాశం. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్-2022 సీజన్‌లోనే టీమ్‌ఇండియా భవిష్యత్‌ నాయకుడు ఎవరో తేలిపోనుంది. శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, కేఎల్ రాహుల్‌ వంటి యువ ఆటగాళ్లు నాయకత్వ పోటీలో ముందంజలో ఉన్నారు’ అని టీమ్‌ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి చెప్పాడు.

‘మరోవైపు, త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ సీజన్‌లో అందరి దృష్టి హార్దిక్‌ పాండ్యపైనే ఉంది. వెన్నెముక గాయం నుంచి కోలుకున్న హార్దిక్‌ ఈ సీజన్‌లోనైనా బౌలింగ్ చేస్తాడా.? మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకుంటాడా.? అని ఎదురు చూస్తున్నారు. అతడి లాగే ఎంతో మంది ఆటగాళ్లు భారత జట్టులో చోటు కోసం వేచి చూస్తున్నారు. ఈ సీజన్‌ నుంచి మరో రెండు జట్లు కొత్తగా ఐపీఎల్‌లోకి అడుగుపెడుతుండటంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. యువ ఆటగాళ్లు ఐపీఎల్‌లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. జట్టులో తమ స్థానాలను పదిలం చేసుకోవాలి. ఐపీఎల్‌ కారణంగానే ఎంతో మంది నాణ్యమైన యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. గత సీజన్‌లో వెంకటేశ్ అయ్యర్‌, అవేశ్ ఖాన్‌ లాంటి యువ ఆటగాళ్లు సత్తా చాటారు’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని