IND Vs BAN : తడబడినా నిలిచారు.. రెండో టెస్టు భారత్‌దే..

IND Vs BAN : రెండో టెస్టులో బంగ్లాపై భారత్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది.

Updated : 11 Jul 2023 17:18 IST

మిర్పూర్‌ : బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్‌(IND Vs BAN)ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. రసవత్తరంగా జరిగిన రెండో టెస్టులో 3 వికెట్ల తేడాతో భారత్‌(Team India) విజయం సాధించింది. బంగ్లా(Bangladesh) నిర్దేశించిన 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి.. టీమ్‌ ఇండియా ఆదిలో తడబడింది. స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోతూ.. కష్టాల్లో పడింది.

45/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్‌..  ఆదిలోనే మూడు వికెట్లను కోల్పోయింది. బంగ్లా బౌలర్లు విజృంభించడంతో ఓ దశలో గెలుపు వారివైపే ఉన్నట్లు కనిపించింది. అయితే ఈ సమయంలో అయ్యర్‌(29), అశ్విన్‌(42) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. మరో వికెట్‌ పడకుండా ఆచితూచి ఆడుతూ 8వ వికెట్‌కు 71 పరుగుల  కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. అంతకుముందు భారత బ్యాటర్లలో అక్షర్‌పటేల్‌(34) ఒక్కడే రాణించాడు. ఇక బంగ్లా బౌలర్లలో మిరాజ్‌ 5 వికెట్లు తీయగా.. షకీబ్‌ 2 వికెట్లు పడగొట్టాడు.

ధోనీ బాటలో రాహుల్‌

టెస్టు సిరీస్‌ను గెలిచిన తర్వాత ట్రోఫీని కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ అందుకొన్నాడు. అనంతరం యువ ఆటగాడు సౌరభ్‌ కుమార్‌కు అందజేసి.. గతంలో ఎంఎస్ ధోనీ పాటించిన సంప్రదాయాన్ని ఇప్పుడు రాహుల్‌ కొనసాగించడం విశేషం. రెండో టెస్టులో జట్టుకు విజయాన్ని అందించిన అశ్విన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవగా.. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ను పుజారా గెలుచుకున్నాడు. 


డిఫెన్స్ మాత్రమే సరిపోదని తెలుసు: అశ్విన్‌

‘‘మా తర్వాత బ్యాటర్లు ఎవరూ లేరు. ఇలా ఓడిపోయే దశ నుంచి గెలిచిన మ్యాచుల్లో ఇదొకటి. శ్రేయస్‌ అద్భుతంగా ఆడాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆడటం అంత సులువేం కాదు. బంగ్లా బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. కేవలం మా డిఫెన్స్‌ మాత్రమే సరిపోతుందని మేం భావించలేదు. అందుకే చివర్లో కాస్త దూకుడు ప్రదర్శించాం. శ్రేయస్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు రాకపోయినప్పటికీ.. నాకొచ్చిన ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును అతడితో పంచుకుంటా’’ - రవిచంద్రన్ అశ్విన్‌, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌

‘‘ఇదొక గొప్ప పోటీనిచ్చిన టెస్టు సిరీస్‌. ఇక నా బ్యాటింగ్‌కు సంబంధించి చాలా కసరత్తు చేశా. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ ఆడటం వల్లే ఇది సాధ్యమైంది. టెస్టు మ్యాచ్‌లకు మధ్య కావాల్సినంత వ్యవధి ఉంది. ఇలా వచ్చిన సమయంలో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడటం ఉత్తమం. మానసికంగా బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది’’ - ఛెతేశ్వర్ పుజారా, ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌

బంగ్లా తొలి ఇన్నింగ్స్‌ : 227
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 314
బంగ్లా రెండో ఇన్నింగ్స్‌ : 231
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : 145/7


దూకుడు పెంచిన అయ్యర్‌..

శ్రేయస్‌ అయ్యర్‌ దూకుడు పెంచాడు. షకీబ్‌ వేసిన 41వ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. ప్రస్తుతం 42 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 7 వికెట్ల నష్టానికి 111 పరుగులతో ఆడుతోంది. విజయానికి ఇంకా 34 పరుగులు కావాల్సి ఉంది.


నాలుగో రోజు ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయిన అనంతరం భారత్‌ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 7 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. విజయానికి 50 పరుగుల దూరంలో ఉంది. క్రీజులో అశ్విన్‌ (7), అయ్యర్‌ (14) ఉన్నారు.


విజయానికి 57 పరుగుల దూరంలో భారత్‌..

బంగ్లాతో జరుగుతోన్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి పోరాడుతున్నారు. ప్రస్తుతం 37 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 7 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. క్రీజులో అయ్యర్‌ (10), అశ్విన్‌(4) ఉన్నారు. భారత విజయానికి ఇంకో 57 పరుగులు కావాల్సి ఉండగా.. బంగ్లా విజయానికి 3 వికెట్ల దూరంలో ఉంది.


విజృంభిస్తోన్న బంగ్లా బౌలర్లు.. భారత్‌ ఏడో వికెట్‌ డౌన్‌..

మిర్పూర్‌ :  బంగ్లా నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో టీమ్‌ఇండియా చతికిలపడిపోతోంది. బంగ్లా బౌలర్ల ధాటికి బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేస్తున్నారు. నాలుగో రోజు తొలిసేషన్‌లోనే స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది టీమ్‌ ఇండియా. మెహిదీ వేసిన 30వ ఓవర్‌ మూడో బంతికి నిలకడగా ఆడుతున్న అక్షర్‌ పటేల్‌ (34) ఔటయ్యాడు. ప్రస్తుతం 32 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. భారత విజయానికి ఇంకో 67 పరుగులు కావాలి. బంగ్లా విజయానికి మూడు వికెట్ల దూరంలో ఉంది.


నాలుగో రోజు ఆట ప్రారంభం.. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌

బంగ్లాదేశ్‌ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్‌ కష్టాలు పడుతోంది. నాలుగో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే టీమ్‌ఇండియా స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. షకీబ్‌ వేసిన 25వ ఓవర్‌లో ఉనద్కత్‌ (13) ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత  మెహిదీ వేసిన 28 ఓవర్‌ చివరి బంతికి పంత్‌ (9) కూడా ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 29 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి భారత్‌ 74 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్‌ పటేల్‌(34), శ్రేయస్‌ అయ్యర్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని