IND vs PAK: మెగా పోరు మజానే వేరు!

రేడియోల కాలంలో అభిమానులు ఆ మ్యాచ్‌ వస్తే చెవులు రిక్కించి వినేవాళ్లు.. టీవీల్లో బొమ్మ సరిగా రాకపోతే యాంటెనాతో కుస్తీపట్టేవాళ్లు.. కరెంటు పోతే తిట్టుకునేవాళ్లు!

Updated : 13 Oct 2023 09:30 IST


ఈనాడు క్రీడావిభాగం

రేడియోల కాలంలో అభిమానులు ఆ మ్యాచ్‌ వస్తే చెవులు రిక్కించి వినేవాళ్లు.. టీవీల్లో బొమ్మ సరిగా రాకపోతే యాంటెనాతో కుస్తీపట్టేవాళ్లు.. కరెంటు పోతే తిట్టుకునేవాళ్లు! పాఠశాలకెళ్లే పిల్లల నుంచి.. కళాశాలకు వెళ్లే యువత వరకు.. ఆఫీసులకెళ్లే అంకుల్స్‌ నుంచి ఇంట్లో ఉండే పెద్దోళ్ల వరకు అందరికి ఒకటే టెన్షన్‌! ఆ రోజు ఎవరు గెలుస్తారో అని! మరి జరిగేది మామూలు మ్యాచ్‌ కాదు. ఓ మహా సమరం! మైదానంలో అతి పెద్ద యుద్ధం! అదే భారత్‌-పాకిస్థాన్‌ పోరు! కాలం ఎంత గతించినా.. ఒకప్పటి పరిస్థితులు ఇప్పుడు లేకపోయినా..  ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు తలపడుతుంటే అభిమానుల హృదయాలు క్రికెట్‌.. క్రికెట్‌ అంటూ కొట్టుకుంటాయి.  అలాంటి వాతావరణం మళ్లీ వచ్చేసింది. వన్డే ప్రపంచకప్‌లో శనివారం  భారత్‌-పాక్‌ మధ్య హైఓల్టేజ్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.

భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అనగానే అభిమానులు ఎంత ఉద్వేగానికి గురవుతారో.. ఆటగాళ్లు రెండింతలు ఒత్తిడికి లోనవుతారు. అలాంటిది ప్రపంచకప్‌ అంటే ఈ వేడి తీవ్ర స్థాయిలో ఉంటుంది. గతంలో మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటామాటా పెరిగిన సందర్భాల్లో చాలానే ఉన్నాయి. 1992 ప్రపంచకప్‌లో వికెట్‌కీపర్‌ కిరణ్‌ మోరెను చూసి బ్యాటర్‌ మియాందాద్‌ కుప్పిగంతులు వేయడం అందులో మొదటిది. పదే పదే అప్పీలు చేస్తున్న మోరెను అనుకరిస్తూ మియాందాద్‌ కుప్పిగంతులు వేసి రెచ్చగొట్టాడు. అయినా ఈ మ్యాచ్‌లో చివరికి భారత్‌దే పైచేయి అయింది. 1996 ప్రపంచకప్‌ క్వార్టర్‌ఫైనల్లో పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌-అమీర్‌ సోహైల్‌ వివాదం మరో ఎత్తు. ప్రసాద్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టి బ్యాట్‌ను బౌండరీ వైపు చూపిస్తూ సోహైల్‌ హేళన చేయడం.. ఆ వెంటనే ప్రసాద్‌ అతడిని బౌల్డ్‌ చేసి ప్రతీకారం తీర్చుకోవడం అప్పుడో సంచలనం. ఇలాంటివి అభిమానుల మనసులో ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోయేవే. రెండు జట్ల మధ్య మ్యాచ్‌ తీవ్రతకు అద్ధం పట్టే ఇలాంటి ఉదాహరణలు ఎన్నో. 2003 ప్రపంచకప్‌లో తనను కవ్వించిన షోయబ్‌ అక్తర్‌కు సచిన్‌ బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. మైదానంలో క్రికెటర్లే కాదు.. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసే అభిమానుల భావోద్వేగాలు కూడా తీవ్ర స్థాయిలో సాగుతుంటాయి ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ జట్లు తలపడుతుంటే. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య మెగా టోర్నీలో ఏడు మ్యాచ్‌లు జరగగా.. దేనికదే ప్రత్యేకమైంది. ప్రపంచకప్‌లో పాక్‌పై 2003, 2011లో సచిన్‌ వీరోచిత ఇన్నింగ్స్‌.. 2015లో కోహ్లి, 2019లో రోహిత్‌ సెంచరీలు కూడా అభిమానుల మదిలో ఎప్పుడూ నిలిచిపోయేవే.

ఆ వేడి తగ్గింది కానీ..

కాలం మారింది.. క్రికెట్‌ ఆడే తీరు మారింది.. ఒకప్పటితో పోలిస్తే భారత్‌-పాక్‌ మ్యాచ్‌లంటే ఉండే ఉద్విగ్న వాతావరణంలోనూ కాస్త మార్పు వచ్చింది. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌పై అభిమానుల్లో ఉండే ఆసక్తిలో ఎలాంటి మార్పు లేకపోయినా.. మైదానంలో అప్పటిలా ఉద్రిక్త వాతావరణమైతే ఉండట్లేదు. ఆటగాళ్లు స్నేహపూర్వకంగా ఉంటున్నారు. రెండు జట్లు ఎక్కువ మ్యాచ్‌లు ఆడకపోవడమే కారణమేమో. భారత్‌, పాక్‌ మధ్య అసలు ద్వైపాక్షిక సిరీస్‌లే ఉండట్లేదు. తలపడేది ఐసీసీ టోర్నమెంట్లలోనే. పాక్‌ ఏడేళ్ల తర్వాత.. ఇప్పుడు ప్రపంచకప్‌ కోసం అడుగుపెట్టింది. ఆటగాళ్ల మధ్య ఘర్షణాత్మక వాతావరణం లేకపోయినా.. మైదానంలో ఆట తీవ్రతలో తేడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఓడితే ఏం జరుగుతుందో రెండు జట్ల ఆటగాళ్లకు బాగా తెలుసు. ఎన్ని విమర్శలు, ఎంతో ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. కెరీర్‌నే ప్రశ్నార్థకం చేసే మ్యాచ్‌ ఇది. కోట్లాది మంది అభిమానులు తమపై పెట్టుకున్న నమ్మకం నిలబెట్టేందుకు రెండు జట్ల ఆటగాళ్లు ప్రాణంపెట్టి మైదానంలో పోటీపడతారు.

ఒత్తిడి పాక్‌పైనే

భారత్‌-పాక్‌ మధ్య ఇప్పటివరకు ఎన్నో ఉత్కంఠభరిత సమరాలు జరిగాయి. ప్రపంచకప్‌లో మాత్రం ఆధిపత్యం భారత్‌దే. వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటివరకు రెండు జట్ల మధ్య ఏడు మ్యాచ్‌లు జరిగితే అన్నింట్లో టీమ్‌ఇండియాదే విజయం. టీ20 ప్రపంచకప్‌లోనూ పాక్‌పై భారత్‌కు తిరుగేలేదు. అందులో పాక్‌తో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఒక్కటే ఓడింది. ఓ మ్యాచ్‌ రద్దయింది. మొత్తంమీద వన్డేల్లో పాక్‌ ముందంజలో ఉంది. 134 వన్డేల్లో పాక్‌ 73.. భారత్‌ 56 నెగ్గాయి. అయిదింట్లో ఫలితం తేలలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని