FIFA World Cup: ఫిఫా ప్రపంచకప్‌లో మరో సంచలనం.. జర్మనీకి షాక్‌ ఇచ్చిన జపాన్‌

ఖతార్‌ వేదికగా జరుగుతోన్న ఫిఫా ప్రపంచకప్‌ 2022లో సంచలనాలకు కొదవేంలేదు. ఇప్పటికే అర్జెంటీనాకు సౌదీ అరేబియా షాక్‌ ఇస్తే.. తాజాగా జర్మనీపై జపాన్‌ అద్భుత విజయం సాధించింది.

Published : 23 Nov 2022 21:12 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఖతార్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌ 2022లో వరుస సంచలనాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే అర్జెంటీనాకు సౌదీ అరేబియా షాక్‌ ఇస్తే.. తాజాగా జర్మనీపై జపాన్‌ అద్భుత విజయం సాధించింది. అర్ధభాగం ముగిసేసరికి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన జర్మనీని జపాన్‌ ఆటగాళ్లు వీరోచితంగా అడ్డుకొని స్వల్ప వ్యవధిలో రెండు గోల్స్‌ సాధించారు. దీంతో ఆట ముగిసే సమయానికి 2-1 తేడాతో జర్మనీపై జపాన్‌ విజయం సాధించింది. జర్మనీ ఆటగాడు గుండోగన్ 33వ నిమిషంలో గోల్‌ కొట్టగా.. రిస్తో డోన్ 75వ నిమిషం.. టకుమా అసానో 83వ నిమిషంలో గోల్స్‌ సాధించి జపాన్‌ను గెలిపించారు.

విజయంతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ప్రారంభం

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫ్రాన్స్‌ ప్రపంచకప్‌ టోర్నీని విజయంతో ఆరంభించింది. ఆస్ట్రేలియాపై 4-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఫ్రాన్స్‌ ఆటగాళ్లు ఆడ్రిన్‌ రాబియోట్ (27వ నిమిషంలో), ఓలివిర్‌ గిరౌడ్ (32 నిమిషం, 71వ నిమిషం), క్లియాన్‌ మప్పే (68 నిమిషంలో) గోల్స్‌ కొట్టారు. తొలుత ఆస్ట్రేలియా దూకుడుగానే ప్రారంభించినా ఫ్రాన్స్‌ ఎదుట నిలవలేకపోయింది. ఆట ప్రారంభమైన 9వ నిమిషంలోనే ఆసీస్ ప్లేయర్ క్రెయిగ్ గుడ్‌విన్ గోల్‌ సాధించాడు. ఆ తర్వాత పుంజుకొన్న ఫ్రాన్స్‌ తన ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గోల్స్‌ కొట్టేసి విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం జర్మనీ ఆటగాళ్లు ‘నోరు మూసుకొని’ ఫొటో దిగడం గమనార్హం. ‘వన్‌ లవ్‌’ ఆర్మ్‌బ్యాండ్‌ను ఫిఫా బ్యాన్‌ చేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ అలా చేశారు. మరో మ్యాచ్‌లో మొరాకో, క్రొయేషియా జట్ల మధ్య మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని