World cup: ఈ మూడు జట్లలో ఏదో ఒక జట్టు ప్రపంచకప్‌ గెలుస్తుంది: భారత మాజీ సెలెక్టర్

రానున్న ప్రపంచకప్‌పై భారత మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. స్వదేశంలో జరిగే ఈ వరల్డ్‌కప్‌లో భారత్‌ ఫేవరెట్‌ అని పేర్కొన్నాడు

Updated : 28 Jun 2023 19:28 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదలైంది. దీంతో ఆయా జట్లు ఈ మెగా టోర్నీలో ఎలా ఆడాలో ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించుకుంటున్నాయి. మరోవైపు పేవరెట్‌ జట్లు ఏవో.. ఏ జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయో.. మాజీలు అంచనాలు వేస్తున్నారు.  ఈ క్రమంలో 1983 ప్రపంచకప్‌ గెలిచిన టీమ్‌ఇండియా (Team India) జట్టులోని సభ్యుడు, మాజీ సెలెక్టర్‌ అయిన కృష్ణమాచారి శ్రీకాంత్‌  (Krishnamachari srikanth).. రానున్న ప్రపంచకప్‌పై స్పందించాడు. స్వదేశంలో జరిగే ఈ వరల్డ్‌కప్‌లో భారత్‌ ఫేవరెట్‌ అని పేర్కొన్నాడు.

‘ఈ టోర్నీలో భారత్‌ ఫేవరెట్‌ జట్టే. అయితే.. బలంగా ఉన్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ల నుంచి సవాళ్లు ఎదురువుతాయి. ఆస్ట్రేలియాకు భారత్‌లో ఆడిన అనుభవం ఉంది. అందుకే.. భారత్‌, ఆసీస్‌, ఇంగ్లాండ్‌.. ఈ మూడు జట్లలో ఏదో ఒక జట్టు ప్రపంచకప్‌ గెలుస్తుందని నేను భావిస్తున్నా’ అని శ్రీకాంత్‌ ఓ మీడియాతో మాట్లాడుతూ అన్నాడు. అయితే.. భారత్‌లో ఆడిన అనుభవం లేకపోవడంతో బాబర్‌ అజామ్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ను తన జాబితాలో చేర్చలేదు.

‘నేను పాకిస్థాన్‌ను తీసివేయడం లేదు. కానీ.. వారు ఉపఖండం పరిస్థితులను ఉపయోగించుకుంటారు. అయితే.. భారత్‌లో మాత్రం వారు ఆడి చాలా కాలమైంది. అందుకే.. నేను భారత్‌, ఆసీస్‌, ఇంగ్లాండ్‌ జట్ల వైపే మొగ్గుచూపుతాను’ అని వివరించాడు.

ఆల్‌రౌండర్లే కీలకం..

ఇక ఈ ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్లు కీలకమవుతారని శ్రీకాంత్‌ చెప్పాడు. ‘ఇక్కడి పరిస్థితులు భారత్‌కు అడ్వాంటేజ్‌గా మారతాయి. 2011లో మంచి ఆల్‌ రౌండర్లను చూశాం. అప్పుడు యువరాజ్‌ సింగ్‌ అద్భుతంగా ఆడాడు. అప్పటి ప్రపంచకప్‌లో యువీ ఆడిన మాదిరిగానే.. ఇప్పుడు జడేజా ప్రదర్శన ఉంటుందని నేను అనుకుంటున్నాను’ అని వివరించాడు. ప్రపంచకప్‌ గెలవాలంటే.. టీమ్‌ఇండియాలో జడేజా, అక్షర్‌ పటేల్‌లాంటి వారు కీలకంగా మారతారని పేర్కొన్నాడు. 2011లో టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ గెలిచిన సమయంలో.. కృష్ణమాచారి శ్రీకాంత్‌ చీఫ్‌ సెలెక్టర్‌గా వ్యవహరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని