Rahul Dravid : అతడిలో ‘Ra’ తక్కువ.. ‘Chin’ ఎక్కువ.. రచిన్‌ ఆటతీరుపై ద్రవిడ్‌ సరదా స్పందన

న్యూజిలాండ్‌ యువ సంచలనం రచిన్‌ రవీంద్రపై రాహుల్‌ ద్రవిడ్‌ ప్రశంసలు కురిపించాడు. అతడి ఆటతీరును పొగుడుతూ తనపైనే జోకులు వేసుకున్నాడు.

Updated : 07 Oct 2023 12:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : వన్డే మెగాటోర్నీ(ODI World Cup 2023) తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్‌.. గత ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లాండ్‌(ENG vs NZ)పై అద్భుత విజయాన్ని నమోదు చేసి బోణీ కొట్టింది. ఇక ఈ మ్యాచ్‌ చూసిన తర్వాత అందరికీ గుర్తొచ్చే ఒకేఒక్క పేరు న్యూజిలాండ్‌ యువ సంచలనం రచిన్‌ రవీంద్ర (Rachin Ravindra). డేవన్‌ కాన్వేతో కలిసి అద్భుత శతకంతో మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు. తన పేరులోనే దిగ్గజాలను చేర్చుకున్న రచిన్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. బెంగళూరులో జన్మించిన అతడి తల్లిదండ్రులు.. రాహుల్‌ ద్రవిడ్‌ నుంచి ‘Ra’ సచిన్‌ నుంచి ‘chin’లతో అతడికి రచిన్‌ రవీంద్ర అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.

ఇక రచిన్‌ ప్రదర్శనపై టీమ్‌ఇండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) స్పందించాడు. రచిన్‌ బ్యాటింగ్‌లో సచిన్‌ ప్రభావమే ఎక్కువగా కనిపిస్తుందని.. తన ప్రభావం తక్కువగా ఉందని సరదాగా చెప్పి తనపైనే జోకులు వేసుకున్నాడు. ‘అతడి బ్యాటింగ్‌ను చూశాను. ఐదు సిక్స్‌లు బాదాడు. అతడి ఆటతీరు చూస్తుంటే ‘Chin’ ప్రభావమే ఎక్కువగా ఉందని అనిపిస్తుంది. నేను ఆఫ్‌ ది స్క్వేర్‌లో బంతిని కొట్టలేను. బహుశా స‘చిన్‌’ అందులో అతడికి సహాయం చేసి ఉండొచ్చు’ అంటూ చెప్పి నవ్వులు పూయించాడు. ఇక అతడి ఆటతీరుకు ద్రవిడ్‌ ముగ్ధుడయ్యాడు.

న్యూజిలాండ్‌ నుంచి అనుకోని హీరో..

‘ఈ మ్యాచ్‌లో ఇద్దరూ (కాన్వే, రచిన్) బాగా బ్యాటింగ్‌ చేశారు. ఈ టోర్నీలో న్యూజిలాండ్‌కు మంచి ఆరంభం లభించింది. ఆట సాగుతున్నప్పుడు పిచ్‌ వారికి సహకరించింది. ఇక 2021 కాన్పూరు టెస్టు మ్యాచ్‌లో రచిన్‌ చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి దాదాపు గంటన్నరపాటు బ్యాటింగ్‌ చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు’ అని ద్రవిడ్‌ కొనియాడాడు.

ఇక తొలి మ్యాచ్‌లో కేన్‌ విలయమ్సన్‌ ఆడకపోవడంతో తుది జట్టులోకి వచ్చిన రచిన్‌ రవీంద్ర (123 నాటౌట్‌, 96 బంతుల్లో 11×4, 5×6) అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్‌ ఆర్డర్లో దిగువన ఆడే రచిన్‌ ఈ మ్యాచ్‌లో మాత్రం వన్‌డౌన్‌ స్థానంలో వచ్చి ఇంగ్లిష్‌ బౌలర్లను ఉతికారేసిన విషయం తెలిసిందే.

ఇక భారత్‌(Team India) తన ప్రపంచకప్‌ జర్నీని ఆదివారం ప్రారంభించనుంది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియా(IND vs AUS)తో తొలి పోరులో తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని